నేడు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టే ఈ సర్వే ప్రాముఖ్యత, చరిత్ర ఏమిటో తెలుసా?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ సర్వే రూపకల్పనలో సాధారణంగా ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కీలక భూమిక పోషిస్తారు. అయితే ప్రస్తుతం ప్రధాన ఆర్థిక సలహాదారు లేకపోవడంతో ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్, ఇతర అధికారులు ఈ సర్వేను తయారు చేశారు.
అయితే ఆర్థిక సర్వే అంటే ఏమిటి?, ప్రాముఖ్యత ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం అధికారిక నివేదిక కార్డ్‌గా కూడా పరిగణించబడే ఈ సర్వే.. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది. అలాగే ముందుకు వెళ్లే మార్గాన్ని వివరిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన వార్షిక ఆర్థికాభివృద్ధికి సంబంధించిన సారాంశాన్ని ఈ ఆర్థిక సర్వే అందిస్తుంది. ఈ వార్షిక సర్వే భారత ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్‌పై ప్రభావం చూపే మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి, ధరలు, ఎగుమతులు, దిగుమతులు, ద్రవ్య సరఫరా, విదేశీ మారక నిల్వలు, ఇతర అంశాల ధోరణులను విశ్లేషిస్తుంది.
అలాగే.. సర్వే ఆర్థిక వృద్ధి అంచనాలను కూడా తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుందా? లేదా మందగిస్తుందా? అని నమ్మడానికి సమర్థన, వివరణాత్మక కారణాలను అందిస్తుంది. కొన్నిసార్లు ఇది కొన్ని నిర్దిష్ట సంస్కరణ చర్యలు అవసరమని చెబుతోంది.
ఆర్థిక సర్వే చరిత్ర..
బడ్జెట్ పత్రాల్లో భాగంగా 1950-51లో మొదటి ఆర్థిక సర్వే ఉనికిలోకి వచ్చింది. 1960వ దశకంలో ఇది బడ్జెట్ పత్రాల నుంచి వేరు చేయబడింది. కేంద్ర బడ్జెట్‌కు ముందు రోజు సమర్పించడం ప్రారంభమైంది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మంది ఈ సర్వే సెంట్రల్ థీమ్ ఏమిటనే దానిపై దృష్టి సారిస్తారు. గత ఏడాది ఈ సర్వే సెంట్రల్ థీమ్ ఎజైల్ అప్రోచ్.. దీనిని కోవిడ్-19 మహమ్మారి షాక్‌కు భారతదేశం ఆర్థిక ప్రతిస్పందనపై రూపొందించబడింది. ఫీడ్‌బ్యాక్ లూప్‌లు, వాస్తవ ఫలితాల రియల్ టైమ్ మానిటరింగ్, అనువైన ప్రతిస్పందనలు, సేఫ్టీ నెట్ బఫర్‌లు మొదలైన వాటిపై ఈ థీమ్ ఆధారపడి ఉందని కేంద్ర ఆర్థిక సర్వే -2022 ముందుమాట పేర్కొంది. రంగాల వారిగా చాప్టర్‌లతో పాటు, ఫోకస్ చేయాల్సిన కొత్త అవసరం-ఆధారిత అధ్యాయాలను కూడా ఈ సర్వే పేర్కొంది.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతిగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము చేస్తున్న తొలి ప్రసంగం ఇది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24ను లోక్‌సభల ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ రెండు విడుతల్లో జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 14న ముగుస్తుంది. రెండో విడతలో భాగంగా మార్చి 12న పార్లమెంటు తిరిగి సమావేశమవుతుంది. అప్పటి నుంచి ఏప్రిల్ 6 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.