Asianet News TeluguAsianet News Telugu

‘ఆన్‌లైన్’ రికార్డ్స్: ఐదు రోజుల్లో రూ.15 వేల కోట్ల సేల్స్

దసరా-దీపావళి పండుగ సీజన్‌ను ఈ- కామర్స్‌ సంస్థలు ఘనంగా ప్రారంభించాయి. దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ 5 రోజుల్లోనే రూ.15,000 కోట్ల మేర అమ్మకాలు జరిపి ఉంటాయని అంచనా. స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్లు-వాషింగ్‌మెషీన్లు-ఏసీల వంటి మన్నికైన వినియోగ ఉత్పత్తులు, దుస్తుల విక్రయాలు భారీగా జరిగినట్లు ఆయా సంస్థలు చెబుతున్నాయి.

E-tailers clock Rs 15,000 cr in festive sales in 5 days; Amazon, Flipkart claim record numbers
Author
Mumbai, First Published Oct 16, 2018, 8:28 AM IST

దసరా-దీపావళి పండుగ సీజన్‌ను ఈ- కామర్స్‌ సంస్థలు ఘనంగా ప్రారంభించాయి. దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ 5 రోజుల్లోనే రూ.15,000 కోట్ల మేర అమ్మకాలు జరిపి ఉంటాయని అంచనా.

స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్లు-వాషింగ్‌మెషీన్లు-ఏసీల వంటి మన్నికైన వినియోగ ఉత్పత్తులు, దుస్తుల విక్రయాలు భారీగా జరిగినట్లు ఆయా సంస్థలు చెబుతున్నాయి. గతేడాది పండుగ సీజన్‌లో ఈ-కామర్స్‌ పోర్టల్స్ విక్రయాలు 1.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,325 కోట్ల) మేర జరిగాయి.

ఈ నెల 9-14 తేదీల మధ్య 2 బిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.15,000 కోట్ల) జరిగినట్లు అంచనా. అంటే ఈసారి 64 శాతం వృద్ధి లభించిందని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ నివేదిక అంచనా వేసింది.

సాధారణంగా ఈ-కామర్స్‌ పోర్టల్స్ కొనుగోళ్లు నగరాల్లో అధికంగా జరుగుతాయని అంచనా. ఈసారి రెండో అంచె పట్టణాల నుంచి మరింత ఎక్కువగా ఆర్డర్లు లభించాయని పోర్టల్స్ చెబుతున్నాయి.

ముఖ్యంగా ధరలు తగ్గించడం, కొన్ని ఉత్పత్తులపై ఇచ్చిన ప్రత్యేక ఆఫర్లు, సెల్‌ఫోన్ల వంటివి కొనుగోలు చేసుకున్నప్పుడు, కొంతకాలం గడిచాక, మార్చుకుని, కొత్తది కొనుగోలు చేసుకునేందుకు పాతదానికి అధిక ధర ఇచ్చే పూచీ వంటి లాయల్టీ పథకాల వల్ల కొత్త వినియోగదారులు లభించాయని సంస్థలు పేర్కొంటున్నారు. సాధారణ విక్రయశాలల్లో కొనుగోలు చేసేవారు కూడా ఆన్‌లైన్‌ పోర్టళ్లలో ఆర్డర్లు ఇచ్చారని రెడ్‌సీర్‌ పేర్కొంది.

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరిట జరిపిన విక్రయాల్లో భారీ వృద్ధి లభించిందని అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ తెలిపారు. గతేడాది జరిగిన కొనుగోళ్ల సంఖ్యను, ఈ ఏడాది 36 గంటల్లోనే అధిగమించామన్నారు.

అన్ని విభాగాల్లో అంచనాలను మించి అమ్మకాలు జరిపామని, తొలిసారిగా తమ పోర్టల్‌లో కొనుగోళ్లు జరిపిన వారిలో 80% మంది చిన్న పట్టణాల నుంచే ఉన్నారని తెలిపారు. ఆర్డర్ల విలువ పరంగా చూస్తే, అధికభాగం సెల్‌ఫోన్ల నుంచే ఉన్నాయి. అదే సంఖ్యాపరంగా ఫ్యాషన్‌ (దుస్తులు, ఇతరాలు) నుంచి వచ్చాయి. కొత్త ఖాతాదారులను ఆర్జించడంలో ఫ్యాషన్‌ విభాగానిదే కీలకపాత్ర. 

మొత్తం వినియోగదారుల్లో మూడింట రెండొంతుల మంది మార్పిడి, నెలవారీ వాయిదాలు, బ్యాంకుల ఆఫర్లను వాడుకున్నారని అమెజాన్ సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ చెప్పారు.  హిందీ భాషలో రూపొందించిన అమెజాన్‌ వెబ్‌సైట్‌పై, సాధారణ రోజుల ఖాతాదార్లతో పోలిస్తే, 2.4 రెట్లు అధికంగా కొత్త ఖాతాదారులు కొనుగోళ్లు జరిపారని అమెజాన్ దేశీయ అధిపతి అమిత్‌ అగర్వాల్‌ చెప్పారు.

దేశీయ రిటైల్‌ రంగంలో ప్రస్తుతం ఉన్న పాత రికార్డులన్నీ పటాపంచలు అయ్యాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఐదు రోజుల్లోనే ‘ఈ-కామర్స్‌’ పోర్టల్స్ జరిపిన  అమ్మకాల్లో 70% వాటా తమదేనని ఫ్లిప్ కార్ట్ చెప్పింది.

గతేడాది కంటే, ఈ ఏడాది జరిగిన స్థూల అమ్మకపు విలువ 80 శాతం పెరిగింది. వస్తువుల సంఖ్యా పరంగా రెండు రెట్ల వృద్ధి లబించింది. విలువ పరంగా ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తుల అమ్మకాల్లో 85 శాతం, మన్నికైన వినియోగ ఉత్పత్తుల్లో 75 శాతం మాదే. ప్రతి 4 స్మార్ట్‌ఫోన్లలో 3 తమ వేదిక నుంచే అమ్ముడయ్యాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.

కొత్త ఖాతాదారుల పరంగా 50% వృద్ధి లభించింది. ప్రతి ఇద్దరిలో ఒకరు నెలవారీ వాయిదాలు, బ్యాంక్‌ ఆఫర్లు వినియోగించుకున్నారని, వాల్‌మార్ట్‌ మా సంస్థను కొన్నాక, ఇంత భారీ అమ్మకాలు జరిగాయని ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధి చెప్పారు.

1.2 కోట్ల ఉత్పత్తులు విక్రయించామని ఆన్ లైన్ పేమెంట్ బ్యాంక్ ‘పేటీఎం’ తెలిపింది. సాధారణ రోజులతో పోలిస్తే, లావాదేవీలు ఐదు రెట్లు పెరిగాయని, దాదాపు 6 కోట్ల మంది తమప్లాట్‌ఫామ్‌ను సందర్శించగా, రెండు లక్షల మంది వ్యాపారులు తమ సరకు విక్రయించారని పేటీఎం వివరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios