న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని జియో ఇన్ఫోకామ్ సంస్థకు అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని ఆర్ కాం స్పెక్ట్రం విక్రయించేందుకు సిద్ధమైనా ‘టెలికం శాఖ (డాట్) మోకాలడ్డు పెట్టింది. ధీరుభాయి అంబానీ మరణం తర్వాత విడిపోయిన అంబానీ సోదరుల్లో ముకేశ్ అంబానీ క్రమక్రమంగా ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడిగా అవతరించగా, అనిల్ అంబానీ ప్రారంభంలో అన్నతో పోటీ పడినా.. కాల క్రమేణా చేసిన కొన్ని తప్పిదాలsy ఆయన ఆధ్వర్యంలోని సంస్థలు ప్రధానంగా ఆర్ కాం దివాళా ప్రక్రియను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. 

రూ. 45 వేల కోట్ల రుణాలను చెల్లించాల్సిన పరిస్థితుల్లో ముకేశ్‌కు చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తమ్ముడు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఆధ్వర్యంలోని ఆస్తులను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. అలా వచ్చిన నిధులను అప్పులు తీర్చి దివాలా ప్రక్రియ నుంచి బయటపడాలన్నది ఆర్‌కామ్‌ ఉద్దేశం. కానీ తాజా పరిణామం దెబ్బకొట్టింది.
  
ప్రతిపాదిత ఆర్‌కామ్‌-రిలయన్స్‌ జియో స్పెక్ట్రమ్‌ ఒప్పందానికి అనుమతి ఇవ్వడానికి టెలికం శాఖ (డాట్‌) తిరస్కరించినట్లు తెలుస్తోంది. రుణ తగ్గింపు చర్యల్లో భాగంగా గతేడాది డిసెంబర్ నెలలో ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియోతో రూ.25,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని ఆర్ కామ్ కుదుర్చుకుంది. 

ఇందులో భాగంగా స్పెక్ట్రంతో పాటు వివిధ బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన ఆస్తులను జియోకు విక్రయించనుంది. తద్వారా దివాలా ప్రక్రియకు వెళ్లకుండా చూసుకోవాలన్నది కంపెనీ ఉద్దేశం. కాగా, జియోకు వైర్‌లెస్‌ ఆస్తులు; స్థిరాస్తులను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయించడం ద్వారా రూ.18వేల కోట్ల నిధులను సమీకరించాలని ఆర్ కాం అంచనా వేసింది.  

రెండు రోజుల్లోగా రూ.1400 కోట్ల కార్పొరేట్‌ గ్యారంటీ ఇవ్వాలని, అపుడు ఏడు రోజుల్లోగా ఆర్‌కామ్‌-ఆర్‌జియో స్పెక్ట్రమ్‌ విక్రయ ఒప్పందానికి డాట్‌ ‘నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) ఇస్తుందని అంతక్రితం సుప్రీం కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అన్నీ సజావుగా సాగుతున్నట్లే కనిపించింది. ఆర్‌కామ్‌ గ్యారంటీ మొత్తాన్ని ఇచ్చింది. డాట్‌ కూడా అనుమతులు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.  

ఆర్ కాం కంపెనీకి ఎన్‌ఓసీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలిపిన డాట్‌ మంగళవారం మాట మార్చింది. దీనికి జియో లేఖే కారణమని తెలుస్తోంది. ఆర్‌కామ్‌ స్పెక్ట్రం పాత బకాయిలకు తాము బాధ్యులం కాదని ఆ లేఖ సారాంశం. ఆర్‌కామ్‌ రూ.1400 కోట్ల కార్పొరేట్‌ గ్యారంటీ లైసెన్సు షరతుల ప్రకారం బ్యాంకు గ్యారంటీ కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఆ లేఖలో జియో పేర్కొంది.

కాగా ‘ప్రభుత్వానికి రాసిన లేఖలో జియో పేర్కొన్న షరతులు స్పెక్ట్రమ్‌ ట్రేడింగ్‌ నిబంధనల ప్రకారం లేవు. ఆ నిబంధనల ప్రకారం.. విక్రేత నుంచి వసూలుకాని బకాయిలకు కొనుగోలుదారే బాధ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందానికి ఒప్పుకోలేమ’ని డాట్‌ పేర్కొన్నట్లు ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. అదే సమయంలో ఇక ఈ అంశం కోర్టు తేల్చి చెప్పాలని.. అప్పటివరకూ ఒప్పందం జరగదని ఒక  ఆ అధికారి స్పష్టం చేశారు.  

జియోకు ఆస్తుల విక్రయంపై ఆర్‌కామ్‌కు డాట్‌ అనుమతి చాలా కీలకం. ఇప్పటికే ఎరిక్‌సన్‌కు ఆర్ కాం ముందే నిర్దేశించినట్లుగా ఈ నెల 15వ తేదీలోగా గడువులోగా బకాయిలను తీర్చలేకపోయింది. ఒక వేళ ఈ గడువులోగా తీర్చకపోతే జనవరిలో కోర్టు శీతకాల విరామం తర్వాత తెరచిన వెంటనే ఎరిక్‌సన్‌ ఉల్లంఘన పిటిషన్‌ను ముందుకు తీసుకెళుతుంది. ఆర్‌కామ్‌కు మొత్తం రూ.46 వేల కోట్ల అప్పులు ఉన్నాయి.

ఎరిక్‌సన్‌కు రూ.550 కోట్లను తక్షణం చెల్లించాల్సి ఉంది. ఒక వేళ అది జరగకపోతే ఆర్‌కామ్‌, అనిల్‌ అంబానీలపై దివాలా ప్రక్రియ మొదలవుతుంది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ మైనారిటీ వాటాదార్లకు కూడా రూ.232 కోట్లను అత్యవసరంగా చెల్లించాల్సి ఉంది. అందుకే డాట్‌ అనుమతుల కోసం ఆతృతగా వేచి చూస్తోంది.  

2006లో సోదరుడు ముకేశ్‌తో అనిల్‌ అంబానీ తెగదెంపులు చేసుకుని తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు. నాటి నుంచీ అనిల్‌ సంపద కరగడం మొదలైంది. 2007లో అనిల్‌ నికర సంపద 45 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అందులో 66 శాతం వాటా ఆర్‌కామ్‌దే. అప్పటికి ముకేశ్‌ నికర సంపద 49 బిలియన్‌ డాలర్లు.

తర్వాత కాలంలో అన్న ముకేశ్‌ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు.. అనిల్‌ అంబానీ కూడా తొలుత అన్నకు దగ్గరలోనే ఉన్నట్లనిపించినా.. తర్వాత ప్రభను కోల్పోయి  భారీగా అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. చివరకు అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికీ సిద్ధమయ్యారు. 

ఇక 2018 ఫోర్బ్స్‌ ఇండియా జాబితా ప్రకారం చూస్తే ముకేశ్‌ 47.3 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 2.44 బిలియన్‌ డాలర్లతో అనిల్‌ 66వ స్థానంలోకి పడిపోయారు. గ్రూప్‌ కంపెనీల్లోనూ ఈ ధోరణి ప్రతిబింబించింది.

అధిక అప్పుల నేపథ్యంలో గతేడాది ఆర్‌కామ్‌ రుణ పరిష్కార ప్రణాళికను ప్రకటించక తప్పలేదు. ఇందులో భాగంగా ఆస్తుల విక్రయానికీ ఆర్ కాం సిద్ధమైంది. 2010లో టెలికం మార్కెట్లో 17% వాటాతో రెండో స్థానంలో ఉన్న ఆర్‌కామ్‌ 2016 కల్లా 10 శాతం లోపునకు పడిపోయింది. 

2017లో వైర్‌లెస్‌ కార్యకలాపాలను మూసివేయాల్సి వచ్చింది కూడా. మార్కెట్‌ వాటాను కోల్పోవడంతో 2009-10లో రూ.25,000 కోట్లుగా ఉన్న అప్పు ఇపుడు రూ.45,000 కోట్లకు చేరింది.