వాషింగ్టన్‌: వాణిజ్య, మార్కెట్ అనుమతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి భారత్ ఆమోదయోగ్యమైన, నిజాయితీతో కూడిన ప్రతిపాదన తెస్తే తప్పక పరిశీలిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను వాణిజ్యపరమైన అంశాలు దెబ్బతీస్తున్నాయి. తాజాగా భారత్ నుంచి దిగుమతి అయ్యే చేనేతతోపాటు 50 వస్తువులను జీఎస్పీ నుంచి అమెరికా మినహాయించింది.

అననుకూల వాతావరణంలో భారత్ - అమెరికా వాణిజ్యం
ఈ క్రమంలో అమెరికా విదేశాంగశాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్, అత్యంత కీలక ఆర్థిక భాగస్వామిగా అమెరికా ఉండటం గర్వకారణం. వ్యాపారపరంగా భారత్‌లో అమెరికా సంస్థలకు, ఉత్పత్తులకు సులభతరమైన అనుమతులు, వ్యాపార నిర్వహణకు అనువైన అవకాశాలు లేవు. ఇది ఇబ్బందికరం’ అని సదరు అధికారి శుక్రవారం అన్నారు. 

అమెరికా- భారత్ మధ్య రెగ్యులేటరీ సమస్యలు
కానీ తమకు రెగ్యులేటరీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ వాణిజ్యం మరింత సులభతరం కావాలని అమెరికా కోరుతోంది. తమ ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలని, వాస్తవంగా చెప్పాలంటే కేవలం వ్యాపార అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం నిరాశాపూరితంగా ఉన్నాయని విదేశాంగశాఖ అధికారి చెప్పారు.

భారత్ సరైన ప్రతిపాదనలతో వస్తే చర్చలకు రెడీ
అమెరికా ఉత్పత్తులను మార్కెట్లోకి అనుమతించే విషయమై భారత్‌ సరైన ప్రతిపాదనలతో వస్తే ఇప్పటికీ ఆ దేశానికి చర్చల కోసం తలుపులు తెరిచే ఉంచామన్నారు. గత నవంబర్‌లో భారత్‌ నుంచి వచ్చే దాదాపు 50 వస్తువులను పన్ను మినహాయింపు జాబితా నుంచి తొలగించింది. వీటిల్లో చేనేత, వ్యవసాయ ఉత్పత్తులను కూడా చేర్చింది. 

భారత్ అధిక పన్నులతో భారం మోస్తున్నామని బ్లాక్ మెయిల్
ఈ క్రమంలోనే భారత ఉత్పత్తులపై పన్ను రాయితీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటూ సదరు విదేశాంగశాఖ అధికారి పేర్కొన్నారు. తాము సత్సంబంధాలను కోరుకున్నా భారత్ మాత్రం అధిక పన్నులతో అమెరికా సంస్థలపై, ఉత్పత్తులపై భారం మోపుతున్నదని చెప్పుకొచ్చారు.

ఏడాదిగా చర్చలు.. సానుకూల స్పందన కరువు
‘ఇప్పటికే దాదాపు ఏడాదిగా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా అమెరికా ఉత్పత్తుల విషయంలో సానుకూల నిర్ణయం వెలువడలేదు అందుకే భారత్‌ను జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ ప్రోగ్రాం నుంచి తొలగించాం’ అని సదరు అధికారి పేర్కొన్నారు. 

విధానపరమైన సవాళ్లు పరిష్కారం కావాలి
‘ఇప్పటికే భారత్‌కు గత ఏడాది అమెరికా నుంచి చమురు, ఎల్‌ఎన్జీ ఎగుమతులు పెరిగాయి. వీటి వల్ల ద్వైపాక్షిక వాణిజ్యంలో ఉన్న 7.1శాతం లోటు భర్తీ అయింది. కానీ పలు విధానపరమైన సవాళ్లు ఉన్నాయి. అవి ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది’ అని అమెరికా విదేశాంగశాఖ అధికారి తెలిపారు.  

భారత్ కు రెండు నెలల గడువు ఇలా
భారత్‌ను జీఎస్పీ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా నోటిఫై చేసిన తర్వాత కూడా రెండు నెలల గడువు ఉంటుంది. ఈ లోపు భారత్ స్పందించి సానుకూల నిర్ణయం తీసుకొంటే జీఎస్‌పీలో కొనసాగించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు భారత్‌లో ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ సమయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 

జీఎస్‌పీ హోదా తొలగిస్తేనే బెటర్ అంటున్న ఎఫ్ఐఈఓ
భారతదేశానికి జీఎస్‌పీ (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌) హోదాను అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకున్నా, దాని ప్రభావం నామమాత్రమేనని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షుడు గణేష్‌ కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. మనదేశం నుంచి 2017లో యూఎస్‌కు నమోదైన ఎగుమతుల మొత్తం 50.57 బిలియన్‌ డాలర్లు కాగా, ఇందులో జీఎస్‌పీ హోదా వల్ల కలిగే రాయితీ ఫలితంగా నమోదైన ఎగుమతులు 190 మిలియన్‌ డాలర్లు మాత్రమే, అందువల్ల ఇదేమంత ప్రభావం చూపే అంశం కాదన్నారు.

జీఎస్పీకి, పన్నులకు సంబంధమే లేదు
జీఎస్పీ అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పన్ను రాయితీల వంటిది కాదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షుడు గణేష్‌ కుమార్‌ గుప్తా చెప్పారు. అయినా అమెరికా ప్రభుత్వం పన్నుల తగ్గింపు అంశానికి ముడిపెట్టి సంక్లిష్టం చేస్తోందని అన్నారు.

భారత్ ఎగుమతులు తగ్గితే అమెరికాకే నష్టం
జీఎస్పీ కింద మనదేశం నుంచి ఇంటర్మీడియేట్లు, పాక్షికంగా తయారైన వస్తువులు అమెరికాకు ఎగుమతి అవుతున్నట్లు,  వాటితో ఆ దేశంలో తుది వస్తువులు తయారు చేస్తోందని చెబుతూ.., మనదేశం నుంచి ఈ ఎగుమతులు ఆగిపోతే యూఎస్‌లో వస్తువుల ధరలు పెరిగి ఆ దేశానికే నష్టం జరుగుతుందని అన్నారు. మనదేశం నుంచి రసాయనాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయని, జీఎస్‌పీని ఉపసంహరిస్తే అమెరికాలో ఆ ఉత్పత్తుల ధరలు 5 శాతం అయినా పెరుగుతాయని  తెలిపారు.