ఎలాన్ మ‌స్క్ చేతుల్లోకి ట్విట్ట‌ర్ వెళ్ల‌డంతో యూఎస్ మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ళ్లీ అకౌంట్ తెర‌వాల‌ని రిపబ్లిక‌న్లు కోరుతున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. మ‌స్క్ చాలా మంచివారు. అయినే నేను ట్విట్ట‌ర్ ఖాతాను తెర‌వ‌ను. ట్రూత్ సోష‌ల్‌లోనే ఉంటాను అన్నారు. మ‌స్క్ ట్విట్ట‌ర్‌ను మెరుగుప‌రుస్తార‌ని ఆశిస్తున్నాని ఆయ‌న అన్నారు. 

సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ చాలా బోరింగ్‌గా తయారైందని ట్రంప్ అన్నారు. ఈ వేదికను టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సొంతం చేసుకున్నప్పటికీ, తాను మళ్ళీ ఆ వేదికపైకి రాబోనని తేల్చిచెప్పారు. ఎలాన్ మస్క్ మంచి వ్యక్తి. ఆయన ట్విట్టర్‌కు మెరుగులు దిద్దుతారని ఆశిస్తున్నాను. కానీ నేను మాత్రం 'ట్రూత్‌' (ట్రంప్ సోషల్ మీడియా)లోనే కొనసాగుతాను. వచ్చే వారం నుంచి నేను ట్రూతింగ్ చేయడం మొదలుపెడతాను. ట్విట్టర్ చాలా బోరింగ్‌గా మారిపోయింది. చాలా మంది మంచివాళ్లను ట్విట్టర్‌ వదులుకుంది. ముఖ్యంగా కన్జర్వేటివ్ వాయిసెస్‌ను కోల్పోయింది. TRUTH నా గళానికి, నా మద్దతుదారుల గళాలకు వేదిక. TRUTH వేదికపైకి అందరూ రావాలని నేను కోరుకుంటున్నానని అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

2021 జనవరి 6న అమెరికా కేపిటల్ హిల్‌పై దాడి కారణంగా డొనాల్డ్ ట్రంప్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌ల నుంచి సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ట్విట్టర్‌లో ట్రంప్‌కు తర్వాత 8.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. దీంతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా హ్యాండిల్‌ను సృష్టించారు. తన అభిమానులు అందరూ ఈ సోషల్ మీడియా వేదికకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. తమ అభిప్రాయాలను ఇక్కడ స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని ట్రంప్ తెలిపారు.

టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌.. ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌తో ఆయన ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన మస్క్.. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు.