కోవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విమానాశ్రయాల‌లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా దేశీయ విమాన సర్వీసులు పెరగకపోవడంతో టికెట్‌ ధరలకు రెక్కలొచ్చాయి.  

మీరు తరుచూ విమానాల్లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. ద్రవ్యోల్భణ భయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు ప్రభావం చూపడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో మన వద్ద విమాన ఇంధన ధర పెరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా దేశీయ (డొమెస్టిక్) విమాన ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. అయితే మార్చి 27వ తేదీ నుండి అంతర్జాతీయ విమానాలకు కేంద్రం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో అబ్రాడ్ ధరలు మాత్రం కాస్త తగ్గే అవకాశముంది.

డొమెస్టిక్ విమాన ధరలు గత రెండు నుండి నాలుగు వారాల్లోనే ఏకంగా 15 శాతం నుండి 30 శాతం మధ్య పెరిగాయి. ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఐఎక్స్ఐగో ప్రకారం ఢిల్లీ-ముంబై వన్-వే విమాన ఛార్జీ ఫిబ్రవరి 25 నుండి మార్చి 3 మధ్య రూ.5119కి పెరిగింది. అంతకుముందు అంటే ఫిబ్రవరి 1 నుండి 7 మధ్య ఈ ఛార్జీ రూ.4055గా ఉంది. 26 శాతం పెరిగి, రూ.1000కి పైగా పెరిగింది. అలాగే కోల్‌కతా-ఢిల్లీ మధ్య ఛార్జీ రూ.4916 నుండి 29 శాతం పెరిగి రూ.6114కు చేరుకుంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో చమురు ధరలు భారీగా పెరిగి, ఇది విమాన ఇంధన పెరుగుదలకు కారణమై, తద్వారా టిక్కెట్ ధరలు పెరిగాయి.

ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం మార్చి 1, 2021లో కిలో లీటర్‌కు రూ.55,350 ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నాటికి రూ.95,350గా ఉంది. అంటే దాదాపు మూడింట రెండొంతులు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం బ్రెంట్ క్రూడ్ ధరలు మార్చి 8న 130 డాలర్లకు చేరుకోవడమే. 2021 మార్చి 10న ఇదే బ్రెంట్ 68 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి, తదనుగుణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎయిర్ లైన్ ఛార్జీలు 20 శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు. ఢిల్లీ, గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కత మార్గాల్లో ధరలు పెరిగాయని చెబుతున్నారు.

ఇక, మార్చి 27వ తేదీ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తోంది ప్రభుత్వం. సర్వీసులు పెరుగుతాయి. ఎయిర్ బబుల్‌లో భాగంగా ఇప్పటి వరకు సర్వీసులు పరిమితమయ్యాయి. భారత్ నుండి ప్రతివారం 2000 వరకు విమానాలు విదేశాలకు వెళ్తున్నాయి. కరోనాకు ముందు ఈ సంఖ్య 4700. అంటే సగాని కంటే ఎక్కువగా తగ్గింది. అంతర్జాతీయ విమానాలపై పరిమితులు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, పెరుగుతున్న చమురు ధరలు వంటి అంశాలు కారణమయ్యాయి. ఉదాహరణకు ఢిల్లీ నుండి దుబాయ్‌కు కరోనా కంటే ముందు విమాన ఛార్జీ రూ. 24,751. 2022 ఫిబ్రవరిలో ఇది 32 శాతం పెరిగి రూ.32,651గా ఉంది. ఢిల్లీ-మాడ్రిడ్ మార్గంలో 2020 ఫిబ్రవరిలో విమాన ఛార్జీ రూ.48,418 కాగా, 2022 ఫిబ్రవరి నాటికి ఇది రూ.39 శాతం పెరిగి రూ.67,436గా ఉంది. అయితే విమానాల పునరుద్ధరణ తర్వాత కెపాసిటీ పెరిగి, దీనికి తోడు చమురు ధరలు 130 డాలర్ల నుండి 110 డాలర్లకు రావడంతో అంతర్జాతీయంగా ధరలు ప్రస్తుతం కంటే తగ్గే అవకాశం ఉంది.