సాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఉద్యోగుల కోసం రూపొందించిన స్కీం. ఉద్యోగులు దురదృష్టవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా నెల వారీగా జీతం మొత్తంలో డబ్బులు అందజేసే ఏర్పాటే ఈ ఇన్సూరెన్స్.
న్యూఢిల్లీ: ఎంతో కష్టపడి.. కెరీర్‌లో ఉన్నతస్థానాలకు చేరుకుని ఆర్జించేది అంతా కూడా తమ కుటుంబ శ్రేయస్సు కోసమే. వారి భవిష్యత్ కోసమే ఉద్యోగులు ఎంతో కష్టపడి.. వచ్చిన జీతంలో ఎంతో కొంత పొదుపు చేసే ప్రణాళికలు అమలు చేస్తుంటారు. ఇదంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. కానీ, ఒక వేళ ఉద్యోగం చేసే వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఏమిటీ? ఈ సందేహానికే సమాధానంగా సాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకుంటే.. మీరు మరణించినప్పటికీ నెల వారీగా జీతం వచ్చే మొత్తం కుటుంబానికి చేరుతుంది.
ఈ సాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌నే ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ఉద్యోగులు మరణించినా కుటుంబం జరుగుబాటు కోసం ఎంచుకున్న సంవత్సరాలకు నెలవారీగా జీతం స్థాయిలో డబ్బులు వస్తాయి.
ఈ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలనుకునే వారు.. కొన్ని విషయాలు స్పష్టంగా గమనంలో పెట్టుకోవాలి. ఇది కేవలం టర్మ్ పాలసీ. మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. మీరు ఒక వేళ 15 సంవత్సరాల కాలంగా టర్మ్ పాలసీ ఎంచుకుంటే.. ఇన్సూరెన్స్‌ను ఎంచుకున్న తర్వాత మరణిస్తే.. మిగిలినా ఆ సంవత్సరాలు ప్రతి నెలా కుటుంబానికి డబ్బులు అందుతాయి. అయితే.. ఒక వేళ టర్మ్ కాలం అంతా జీవించి ఉంటే.. మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి.. ఆ డబ్బులు రావు.
ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కుటుంబానికి ఎలా అందాలనేదాన్ని కూడా పాలసీ హోల్డర్ నిర్ణయించవచ్చు. అంటే.. తాను మరణించగానే.. మొత్తం డబ్బులు వచ్చేలా లేదా.. నెలవారీగా వచ్చేలా నిర్ణయించి పెట్టవచ్చు. అలాగే.. నెలవారీగా ఎంత మొత్తంలో డబ్బులు కుటుంబానికి చేరాలనేది కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే.. ప్రస్తుతం తాను పొందుతున్న జీతానికి సమానంగా లేదా.. అంతకంటే తక్కువగా వచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చు.
