శాన్‌ఫ్రాన్సిస్కో: సెర్చింజన్ ‘గూగుల్’ తన ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపిన తీరుపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయం వద్ద వందల మంది గూగుల్ ఉద్యోగులు నిరసనకు దిగారు.

తాజా పరిణామాలు ఉద్యోగులు, గూగుల్ మాత్రు సంస్థ ఆల్ఫాబెట్‌కు మధ్య నెలకొన్న వివాదాన్ని తెలియ జేస్తున్నాయి. ఒకనాడు సంస్థ కార్పొరేట్ కల్చర్‌ను మెచ్చుకున్న ఉద్యోగులే ఇప్పుడు గూగుల్ వ్యవహరిస్తున్న తీరును తూర్పారపడుతున్నారు. ఈ విషయమై ప్రశ్నించిన ఉద్యోగులను అణచివేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  దాదాపు 200 మంది ఉద్యోగులు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.

also read:  అగ్రశ్రేణి బిజినెస్ పర్సన్ సత్యనాదెళ్ల

‘సంస్థలో జరుగుతున్న లైంగిక వేధింపులపై సరైన చర్యలు తీసుకోవాలని నేను, నా తోటి ఉద్యోగులు సంస్థను అడుగుతున్నాం, అదే సమయంలో పని పరిస్థితులను మెరుగుపర్చాలని కోరుతున్నాం. ఇవేవీ గూగుల్ పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోకపోగా, మమ్మల్నే నోరుమూసుకుని ఉండాలని సంస్థ చెబుతోంది’ అని గూగుల్‌లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జోరాతంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

తన ఉద్యోగులపైనే గూగుల్ నిఘా పెడుతుందని, తమనుంచి ఏదీ దాచిపెట్టలేరని నిరసన కారులు తెలిపారు. ఇద్దరు ఉద్యోగులకు ఎలాంటి హెచ్చరికల్లేకుండా సెలవుపై వెళ్లమని చెప్పడం పట్ల జోరాతంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి సంఘీభావంగా ‘టెక్ వుడ్ నాట్ బిల్డ్ ఇట్’, ‘దిసీజ్ అవర్ ఆఫీస్’, ‘వారిని వెనక్కు తీసుకు రండి’ అనే నినాదాలతో కార్యాలయం హోరెత్తింది. 

also read: నకిలీ బ్రాండ్లకు అమెజాన్ షాకింగ్ న్యూస్

హెచ్చరికలు జారీచేసినా కంపెనీకి చెందిన అత్యంత రహస్య పత్రాల గురించి అన్వేషణ కొనసాగిస్తున్నారన్న ఆరోపణపై సెలవుమీద వెళ్లాల్సిందిగా ఒక ఉద్యోగిని గూగుల్ ఆదేశించింది. కాగా, ఈ నెల ప్రారంభంలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపినట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.