కరెన్సీ నోటుకు బదులు కార్డుతో చెల్లింపులు జరిపేవారి సంఖ్య మన దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. మెట్రో నగరాలు మొదలు చిన్న పట్టణాలకు క్రమంగా పట్టణాలకూ ఈ ధోరణి విస్తరిస్తోంది. షాపింగ్‌, తదితర అవసరాల కోసం భారీమొత్తంలో డబ్బు వెంట తీసుకెళ్లడం కంటే పాకెట్లో డెబిట్‌ కార్డు పెట్టుకొని బయటికెళ్లడం ఎంతో భద్రం అనే భావన అందరిలోనూ బలపడుతోంది. 

డెబిట్ కార్డుతో చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతులు శరవేగంగా విస్తరిస్తుండటం కూడా ఇందుకు దోహదపడుతోంది. మొత్తంగా స్వల్ప నగదు లావాదేవీల సమాజంగా అవతరించే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది.
 
ఇటీవలే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా నివేదిక ప్రకారం.. గత రెండేళ్లలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 50 శాతం పెరిగాయి. దేశంలో డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులు, మొబైల్‌ వాలెట్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ మార్గాల్లో చెల్లింపులు జరిపే ట్రెండ్‌ శరవేగంగా పెరుగుతున్నది. 

ప్రధాన, చిన్న నగరాల్లోని వినియోగదారులు కార్డు ద్వారా చెల్లింపులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అంతర్జాతీయ పేమెంట్‌ గేట్‌వే కంపెనీ వీసా పేర్కొంది. వేగం, సౌఖ్యం, సరళత, భద్రత వంటి అంశాలు కార్డు చెల్లింపు లావాదేవీల వైపు మొగ్గుచూపేందుకు తోడ్పడుతున్నాయని తాజాగా విడుదల చేసిన నోట్‌లో ప్రస్తావించింది. 

‘ఖర్చు విషయంలో భారతీయులది సంప్రదాయంతోపాటు కొత్త కోరికల మేళవింపుతో కూడిన వినూత్న వైఖరి. చాలా మంది వినియోగదారులు తమ ఆర్థిక సామర్థ్యం మేరకే ఖర్చు చేస్తారు. అయితే, ప్రయోగాత్మకంగా కొత్త విధానాలను ఎంచుకోవడంలో ముందుంటార’ని వీసా గ్రూప్‌ భారత్‌, దక్షిణాసియా కంట్రీ మేనేజర్‌ టీఆర్‌ రామచంద్రన్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం దేశంలో 95 కోట్లకు పైగా డెబిట్‌ కార్డులు జారీ అయ్యాయి. గత రెండేళ్లలో డెబిట్‌ కార్డుల చలామణి దాదాపు 25 శాతం పెరిగింది. ఇందుకు తగినట్లు దేశంలో కార్డు చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతులూ విస్తరించాయి. 2016లో దేశవ్యాప్తంగా రెండు లక్షల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టెర్మినళ్లు ఉండగా ఇప్పుడు వాటిసంఖ్య ఏకంగా 35 లక్షలకు పెరిగింది.
 
మోదీ ప్రభుత్వం 2016 నవంబర్ ఎనిమిదో తేదీన పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతోపాటు మొబైల్‌ వాలెట్లు, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేవారి సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూనిఫైడ్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ (యూపీఐ) వంటి డిజిటల్‌ వసతులు అందుబాటులోకి రావడం కూడా ఎలకా్ట్రనిక్‌ చెల్లింపుల పెరుగుదలకు కలిసి వచ్చింది.