ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ షాక్ త‌గిలింది. ప్రయాణికుడి వద్ద వ్యాలిడ్ టికెట్ ఉన్నప్పటికీ ఎయిరిండియా సిబ్బంది ఆ వ్య‌క్తిని విమానం ఎక్కించుకోలేదు. దీనిపై ఆ ప్రయాణికుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు చేశారు. తప్పు ఎయిరిండియాదే కావ‌డంతో డీజీసీఏ రూ. 10 లక్షల రూపాయల పెనాల్టీని విధించింది.  

ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిన తరువాత కూడా ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా తీరు మారలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఎయిరిండియా గత సంవత్సరం తన మాతృసంస్థ టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ- తన నైజాన్ని మార్చుకోలేకపోతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. భారీగా జరిమానా విధించింది. దీని విలువ 10 లక్షల రూపాయలు.

ఓ ప్రయాణికుడిని విమానం ఎక్కనివ్వకపోవడమే దీనికి కారణం. ఆ ప్రయాణికుడి వద్ద వ్యాలిడ్ టికెట్ ఉన్నప్పటికీ.. విమానం ఎక్కించుకోలేదు. దీనిపై ఆ ప్రయాణికుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఫిర్యాదు చేశారు. టికెట్ నంబర్, ఇతర వివరాలను డీజీసీఏ ఫిర్యాదుల పరిష్కార వేదిక దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డీజీసీఏ విచారణ నిర్వహించింది. ఈ వ్యవహారంలో తప్పు ఎయిరిండియాదేనని తేలడంతో 10 లక్షల రూపాయల పెనాల్టీని విధించింది. దీనితో పాటు ఎయిరిండియా కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తీరు మార్చుకోవాలని సూచించింది. 

హైదరాబాద్ సహా బెంగళూరు, న్యూఢిల్లీ నుంచి తరచూ ఎయిరిండియా సహా కొన్ని పౌర విమానయాన సంస్థలపై ఫిర్యాదులు అందుతుండటంతో డీజీసీఏ ప్రత్యేకంగా నిఘా ఉంచింది. వ్యాలిడ్ టికెట్ ఉన్నప్పటికీ.. విమానాన్ని ఎక్కించుకోవకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. తాము విధించిన మార్గదర్శకాలను ఆయా విమానయాన సంస్థలు అనుసరించట్లేదని స్పష్టం చేసింది. 

వ్యాలిడ్ టికెట్ ఉన్న ప్రయాణికుడిని ఎక్కించుకోకపోతే సరిగ్గా గంట వ్యవధిలో ప్రత్యామ్నాయ విమాన సర్వీస్‌లో సీట్‌ను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని డీజీసీఏ స్పష్టం చేసింది. 24 గంటల వ్యవధిలో విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకుని రాకపోతే 10,000 రూపాయలు, ఆ తరువాతి 24 గంటల్లో కూడా ప్రయాణించే ఏర్పాటు చేయకపోతే 20,000 రూపాయలను సదరు ప్రయాణికుడికి పరిహారంగా అందజేయాల్సి ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది.