ముంబై: గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్‌ మ్యాక్‌ బుక్‌ ప్రో పాత వర్షన్ కంప్యూటర్లను భారత్‌తోపాటు పలు దేశాల విమానయాన సంస్థలు అనుమతించడం లేదు. చెక్‌ఇన్‌ లగేజీలో గానీ, హ్యాండ్‌ లగేజీలో గానీ అనుమతి ఇవ్వడానికి అంగీకరించడంలేదు. 

ఆపిల్ మాక్ బుక్ ప్రో’ల్లో గల బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరగవచ్చనే సందేహాలతో విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. జూన్‌లో ఆపిల్‌ స్వచ్ఛందంగా 15 అంగుళాల మ్యాక్‌ బుక్‌ ప్రో లాప్‌టాప్‌లను రీకాల్‌ చేసింది. 

2015-17మధ్యలో ఉత్పత్తి చేసిన ల్యాప్ టాప్ కంప్యూటర్లలో అమర్చిన బ్యాటరీ పేలే ప్రమాదం ఉన్నదని అమెరికా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ పేర్కొంది. దీంతో ఆపిల్‌ వీటిని రీకాల్‌ చేసింది.

ఆదివారం సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ తమ వినియోగ దారులు లగేజీలో యాపిల్‌మ్యాక్‌ బుక్‌ ప్రోను తేవద్దని వెల్లడించింది. అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కూడా వీటిని విమానాల్లోకి తేవడంపై నిషేధం విధించింది. 

ఇటీవల ఆపిల్‌ లెక్కల ప్రకారం 26 కేసుల్లో ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ప్రో విపరీతంగా వేడెక్కినట్లు తేలింది. వీటిల్లో ఐదుగురు వినియోగదారులకు స్వల్పగాయాలు కావడంతో పాటు, పొగ వెలువడిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. అమెరికాలో 4.32 లక్షలలు, కెనడాలో 26వేల ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో ల్యాప్ టాప్ కంప్యూటర్లను విక్రయించింది. 

యాపిల్‌ 'మ్యాక్‌ బుక్‌ ప్రో' ల్యాప్​టాప్​లకు చెందిన కొన్ని మోడళ్లను విమానాల్లో అనుమతించబోమని విమానయాన నియంత్రణ వ్యవస్థ డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ మ్యాక్​ బుక్​ ప్రో పాత వెర్షన్​లోని బ్యాటరీల కారణంగా ప్రమాదాలు జరగవచ్చనే సందేహంతో ఈ నిర్ణయం తీసుకుంది.