Asianet News TeluguAsianet News Telugu

న్యూయార్క్ టు బెంగళూరు: డాయిష్ బ్యాంక్ ఉద్యోగులు ఇంటికే

నష్టాలను నివారించేందుకు డాయిష్ బ్యాంకు రెండు దశాబ్దాల్లోనే తొలిసారి భారీ పునర్వ్యవస్థీకరణకు పూనుకున్నది. న్యూయార్క్ నుంచి బెంగళూరు వరకు తమ ఈక్విటీ వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించడంతో ప్రపంచ వ్యాప్తంగా 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో కొత్త కొలువులు లభించడం కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Deutsche bank shares fall 5% as global cull of 18,000 staff begins
Author
Hong Kong, First Published Jul 10, 2019, 12:30 PM IST

హాంకాంగ్/ న్యూయార్క్: నష్టాల్లో నడుస్తున్న ఈక్విటీ వ్యాపారాన్ని మూసివేయనున్నట్లు తాజాగా జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకున్న డాయిష్ బ్యాంక్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని, బ్యాంకుకు వార్షికంగా 8.3 బిలియన్‌ డాలర్ల వరకు మిగులు ఉంటుందని పేర్కొంది. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలో అంటే సొమవారం నాడే  భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు డాయిష్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఉద్యోగాల నుంచి తొలగిస్తారని ముందు నుంచే ఉద్యోగులకు కూడా సంకేతాలు ఉన్నాయి. అయినా ఆ తొలగించే వాళ్లలో తమ పేరు ఉండకపోవచ్చనే నమ్మకంతోనే చాలామంది ఉన్నారు. చివరకు తమకూ ఉద్వాసన పత్రం అందడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భవిష్యత్‌పై ఆందోళన చెందుతూ, సహోద్యుగులకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగాలకు లోనయ్యారు.

వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగాల కోతపై తమ మాతృసంస్థ డాయిష్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయం భారత్‌లో పనిచేస్తున్న సిబ్బందిపైనా ప్రభావం పడుతుందని డాయిష్‌ బ్యాంక్‌ ఇండియా తెలిపింది. ‘భారత్‌లోని ఈక్విటీ వ్యాపారాన్ని కూడా మూసివేస్తారు. దీనిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదు’అని పీటీఐ వార్తా సంస్థకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

అయితే భారత్‌లో ఎన్ని ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని, తొలగించిన వారిని ఇతర విభాగాల్లో తిరిగి నియమించుకునే విషయంపైనా స్పష్టత లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాల తొలగింపుపై ఇప్పుడు వ్యాఖ్యానించడం సరి కాదని బ్యాంకు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించే  విషయాన్ని నేరుగానే ఉద్యోగులకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.

సిడ్నీ, హాంకాంగ్ డివిజన్లలో పని చేసే సిబ్బంది ముందుకు వైదొలగాల్సి ఉంటుందని డాయిష్ బ్యాంక్ ముందే సమాచారం ఇచ్చింది. హంకాంగ్ లో డాయిష్ బ్యాంక్ హెడాఫీసు సిబ్బందిని పిలిచి మరీ పింక్ స్లిప్ లు అందజేసి వీడ్కోలు పలుకడంతో వారంతా భావోద్వేగానికి గురయ్యారు. సీనియర్ బ్యాంక్ అధికారి సైతం తనకు జాబ్ కావాలని అభ్యర్థించడం దయనీయ పరిస్థితిని తెలియజేస్తోంది. 

యాజమాన్యం అందజేసిన ఉద్వాసన లేఖలు, వేతన చెల్లింపుల కవర్లతో బయటకు వచ్చే ముందు ఒకరినొకరు పలుకరించుకుని, కౌగిలించుకుని, సెల్ఫీలు తీసుకుంటూ భారమైన మనస్సులతో ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. ముందస్తు సమావేశాల్లోనే డాయిష్ బ్యాంక్ సిబ్బంది కుదింపు తప్పదని యాజమాన్యం తేల్చేసింది. కొన్ని వారాలుగా తమ ఉద్యోగాలు పోతాయని ముందే ఊహించామని పలువురు చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాలు కష్టతరంగా ఉన్న పరిస్థితుల్లో కొత్త కొలువులు సంపాదించుకోవడం కష్ట సాధ్యమేనని అభిప్రాయ పడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios