న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు భారత్‌ బంగారు గని లాంటిదని, అందుకు నిదర్శనం భారతలో జరుగుతున్న ఆన్‌లైన్‌ కొనుగోళ్లేనని బెయిన్‌ అండ్‌ కంపెనీ, గూగుల్‌ అండ్‌ ఒమిడ్యార్‌ సంయుక్త నివేదికల్లో వెల్లడైంది. భారత్‌లో ఇంకా రూ.3.5లక్షల కోట్ల వాణిజ్యానికి అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారి సంఖ్య పెరగడంతో దాదాపు 50 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని తెలిపింది. డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన పెరగడం, ఈ-కామర్స్‌ రంగంలో అవకాశాలు మెండుగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని తెలిపింది.

గతేడాది 20 బిలియన్ల డాలర్ల విక్రయాలు

2017లో ఈ-కామర్స్‌రంగంలో దాదాపు 20 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు జరిగాయి. అయితే అమెరికాలో 459 బిలియన్‌ డాలర్లు కాగా, చైనాలో దాదాపు 935 బిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. పెద్ద ఆర్థిక రాజ్యాల కంటే అమ్మకాల్లో తక్కువైనా ఈ ఏడాది మొత్తం సేల్స్‌లో భారత్‌ వాటా 2శాతం వరకూ నమోదైంది. దేశంలో దాదాపుగా 30.9కోట్ల అంతర్జాల వినియోగదారుల్లో 40శాతం మంది అంటే 160 మిలియన్ల మంది ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుపుతున్నారు. వీరిలో 90శాతం మంది అంటే 140 మిలియన్ల మంది ధనిక కుటుంబాలకు చెందిన వారే.

భారత్‌లో ఈ - కామర్స్ రంగానికి ముచ్చటగా మూడు సవాళ్లు

అయితే, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య పెరుగుతున్నా భారత్‌లో ఈ-కామర్స్‌ రంగం మూడు సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో వారికి ఆన్‌లైన్‌ సేవల మీద అవగాహన తక్కువగా ఉంటోంది. రెండోది భారత్‌లో అంతర్జాలాన్ని ఉపయోగించే మహిళల సంఖ్య తక్కువగా ఉండటం, ఇక మూడోది అంతర్జాల సౌకర్యాలు తక్కువగా ఉండటం. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కోగలిగితే భారత్‌లోనూ ఈ-కామర్స్‌ రంగం మరింత పుంజుకుంటుందని బెయిన్‌ అండ్‌ కంపెనీ అభిప్రాయపడింది.

 
ఎయిరిండియా స్వాతంత్ర్యదినోత్సవ ఆఫర్‌

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా ఆఫర్ల బాటపట్టింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎయిరిండియా వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఎయిర్‌లైన్‌ తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లోని విమానాలపై ఆగస్టు 15 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.


డిస్కౌంట్ ఆఫర్ కోసం ఇలా ప్రోమో కోడ్ ఉపయోగించాలి

అయితే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను వినియోగించుకోవాలంటే కస్టమర్లు బుకింగ్‌ సమయంలో 18INDAY అనే ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలని ఎయిరిండియా తెలిపింది. ఈ మేరకు ఆఫర్‌ వివరాలు, నియమనిబంధనలను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎయిరిండియా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ కింద టికెట్లపై ఎంత వరకు డిస్కౌంట్‌ ఇస్తోందన్న విషయాన్ని మాత్రం ఎయిరిండియా వెల్లడించలేదు. బుకింగ్‌ చేసుకునే సమయంలో ప్రోమో కోడ్‌ ఎంటర్‌ చేసిన తర్వాత ఆఫర్‌ వివరాలు కన్పిస్తాయి. మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌, గోఎయిర్‌ లాంటి ప్రయివేటు రంగ విమానయాన సంస్థలు కూడా ఇప్పటికే ఫ్రీడమ్‌ సేల్‌ను ప్రకటించాయి. రూ. 1,099 ప్రారంభ ధరతో గోఎయిర్‌ 10లక్షల సీట్లను ఆఫర్‌కు ఉంచగా.. జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ఎకనమిక్‌, ప్రీమియం క్లాస్‌ టికెట్లపై ఆఫర్‌ ఇస్తోంది.

నీరవ్ మోదీకి బహిరంగ సమన్లు

నీరవ్ మోదీ, ఆయన సోదరి పూర్వీ మోదీ, సోదరుడు నిషాల్ మోదీలకు పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం ప్రత్యేక కోర్టు శనివారం బహిరంగ సమన్లు జారీ చేసింది. ప్రముఖ జాతీయ దినపత్రికల్లో ఈ ముగ్గురికీ నోటీసులను కోర్టు ఇచ్చింది. వచ్చే నెల 25లోగా కోర్టు ఎదుట హాజరుకావాలని ముంబైలోని ఈ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ సదరు నోటీసుల్లో ఆదేశించారు. హాజరుకాని పక్షంలో చట్ట ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.14,000 కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి మొదట్లోనే నీరవ్ దేశం విడిచి పారిపోయిన సంగతీ విదితమే. కాగా, పూర్వీ, నిషాల్ కూడా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపిస్తున్నది. పీఎన్‌బీ స్కాం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వీరి జాడ లేదంటున్నది. ఈ క్రమంలో తాజా నోటీసులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 25న ఉదయం 11 గంటలకు హాజరుకావాల్సి ఉంటుందని నోటీసుల్లో కోర్టు స్పష్టం చేసింది.