న్యూఢిల్లీ: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్ జీడీపీ వృద్ధిరేటును తగ్గించింది. 2018లో 7.4శాతం వృద్ధిరేటు సాధించవచ్చని వేసిన అంచనాల్లో మార్పులు చేసింది. తాజా పరిస్థితులను బట్టి వృద్ధిరేటు 5.6శాతం మాత్రం ఉండవచ్చని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినిమయ డిమాండ్‌ను ఏ మాత్రం పెంచలేవని స్పష్టం చేసింది. 

‘భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత్లో జీడీపీ వేగం తగ్గుతుందని అంచనావేస్తున్నాం. ఇది 2019లో 5.6% ఉండవచ్చు. 2018లో 7.4%గా వేసిన అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత ఆర్థిక మందగమనం అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఉండనుంది. ప్రభుత్వ తీసుకొన్న చర్యల్లో ఏవీ బలహీనంగా ఉన్న డిమాండ్ మీద ప్రభావం చూపేవి కాదు. డిమాండే ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తి’’ అని మూడీస్ పేర్కొంది. 

also read ద్రవ్యలోటుకు కళ్లెం వేయాలంటే ఐఓసీకి మంగళం

ఇప్పటికే అక్టోబర్ 10వ తేదీన మూడీస్ భారత ఆర్థిక వృద్ధిరేటును 6.2శాతం నుంచి తగ్గించి 5.8శాతానికి చేర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను మూడీస్ తగ్గించింది. ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలం’ రేటింగ్ ఇచ్చింది. ముఖ్యం దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో ఇది వృద్ధిరేటుపై పడుతోందని అభిప్రాయపడింది.

వచ్చే ఏడాది లేదంటే ఆపై ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మూడీస్.. 2020లో 6.6 శాతంగా, 2021లో 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘దేశ ఆర్థిక వృద్ధిరేటు 2018 జూన్ నుంచి మందగిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో 5 శాతానికి పతనమైంది. నాడు దాదాపు 8 శాతంగా ఉండేది. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది’ అని స్పష్టం చేసింది. 

పెట్టుబడులు నెమ్మదించాయని, వినియోగ సామర్థ్యం దెబ్బతిన్నదని పేర్కొన్నది. శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ద్వితీయ త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి.

aslo read నకిలీ బ్రాండ్లకు అమెజాన్ షాకింగ్ న్యూస్

ఇదిలా ఉండగా, 21 దేశీయ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల ఔట్‌లుక్‌కూ మూడీస్ కోత పెట్టింది. ఎస్బీఐ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ సంస్థల ఔట్‌లుక్‌ను స్థిరం నుంచి ప్రతికూలానికి దిగజార్చింది. గత వారం భారత రేటింగ్స్ ఔట్‌లుక్‌ను సైతం మూడీస్ స్థిరం నుంచి ప్రతికూలానికి దించిన సంగతి విదితమే. అయితే దేశ స్థానిక, విదేశీ కరెన్సీ రేటింగ్స్‌ను మాత్రం బీఏఏ2 వద్ద స్థిరంగానే ఉంచింది.

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని వడ్డీరేట్ల కోతలకు దిగుతుందని మూడీస్ అంచనా వేసింది. వచ్చే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్బీఐ మరింతగా తగ్గించే వీలుందని పేర్కొన్నది. ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యంగా ఉండటం, ముడి చమురు ధరలు అదుపులోనే ఉండటం.. ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు అవకాశాలను ఇస్తున్నాయి. అయితే బ్యాంకులు రుణాలపై ఆశించిన స్థాయిలో వడ్డీరేట్లను తగ్గించకపోవడం ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడింది.