Asianet News TeluguAsianet News Telugu

తమాషాగా ఉందా?! జైలుకు వెళ్తారా?! దైచీ కేసులో ఫోర్టిస్ బ్రదర్స్‌కు సుప్రీం చివాట్లు

 జపాన్ ఫార్మా దిగ్గజం ‘దైచీ - స్యాంకో’కు డబ్బు చెల్లింపుపై మీనమేషాలు లెక్కిస్తున్న ఫొర్టిస్ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్‌లపై దేశ అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ఈ నెల 11 లోపు డబ్బు చెల్లింపునకు సరైన ప్రణాళిక సమర్పించకపోతే జైలు ఊచలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. 

Daiichi-Ranbaxy case: SC warns Singh brothers of jail if guilty of contempt
Author
New Delhi, First Published Apr 6, 2019, 9:12 AM IST

న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా ఉత్పత్తుల సంస్థ రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లైన మాల్విందర్, శివిందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జపాన్‌ ఫార్మా దిగ్గజం దైచీ స్యాంకో సంస్థకు చెల్లించాల్సిన డబ్బు కట్టకపోతే జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

దైచీకి చెల్లించాల్సిన రూ.4 వేల కోట్లను ఎలా చెల్లిస్తారో ప్రణాళికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని గతంలో ఆదేశాలపై సింగ్ సోదరులు ఇచ్చిన సమాధానంపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ అసంతృప్తిని వ్యక్తంచేసింది. 

‘ఈ ప్రణాళిక అసంపూర్ణంగా ఉండటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మీపై నేరుగా కోర్టు ధిక్కార పిటిషన్‌నే విచారిస్తాం. ఈ నెల 11న విచారణ చేపడుతాం..ధిక్కారణకు పాల్పడినట్లు తేలితే జైలుకు పంపిస్తాం’ అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్‌లు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. 

మరోదఫా ఈ కేసు విచారణకు రాకముందే కోర్టుకు ప్రణాళికను సమర్పించాలని సింగ్ బ్రదర్స్‌కు కోర్టు సూచించింది. ఆ డబ్బును ఎలా చెల్లిస్తారో ప్రణాళిక రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దీనికి సింగ్‌ సోదరులు ఇచ్చిన సమాధానంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్బు చెల్లిస్తారా.. లేదా జైలుకు పంపించమంటారా? అని హెచ్చరించింది.

2008లో రాన్‌బాక్సీని దైచీ స్యాంకో కొనుగోలు చేసింది. అయితే కంపెనీపై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు చేపడుతోందన్న నిజాన్ని దాచిపెట్టి రాన్‌బాక్సీ షేర్లను సింగ్ సోదరులు విక్రయించారంటూ దైచీ సంస్థ సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. 

దీనిపై విచారణ చేపట్టిన సింగపూర్‌ ట్రిబ్యూనల్‌ సింగ్‌ సోదరులు దైచీ సంస్థకు రూ. 4000 కోట్లు చెల్లించాలని 2016లో ఆదేశించింది. ఇంతవరకూ ఆ మొత్తం చెల్లించకపోవడంతో దైచీ.. భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సింగ్‌ సోదరులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ అంశంపై గతనెల 14వ తేదీన విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం మాల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌ డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. డబ్బు చెల్లింపుపై ప్రణాళికను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. దీంతో సింగ్‌ సోదరులు శుక్రవారం తమ ప్రణాళికను సమర్పించారు. 

ఈ ప్రణాళిక అసంపూర్ణంగా ఉండటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇక మీపై నేరుగా కోర్టు ధిక్కార పిటిషన్‌నే విచారిస్తాం. ఏప్రిల్‌ 11న విచారణ చేపడుతాం. ధిక్కరణకు పాల్పడినట్లు తేలితే జైలుకు పంపిస్తాం’ అని చీఫ్ జస్టిస్ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 

సింగపూర్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అ నుగుణంగా సుప్రీంకోర్టు రూ.4 వేల కోట్లను దైచీ స్యాంకోకు చెల్లించాలని మార్చి 14న ఆదేశించిన విషయం తెలిసిందే. సింగ్‌బ్రదర్స్ తరుఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, పీఎస్ పట్వాలియా వాదిస్తున్నారు. 

సింగ్ బ్రదర్స్‌కు చెందిన ఆస్తుల్లో రూ.6,300 కోట్లు పలువురు బాబాలు కొట్టివేశారని, వారి పిల్లలు మోసానికి గురయ్యారని కోర్టుకు కపిల్ సిబల్ తెలిపారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. 

మా ఆదేశాల ఉల్లంఘనపై మేము మాత్రమే న్యాయం చేస్తాం.మీ ఆస్తులను విక్రయించి దైచీకి చెల్లింపులు జరుపండి.లేకపోతే జైల్లో ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉండాలి’ అని ప్రత్యేక బెంచ్ హెచ్చరించింది. అసలు ఇంతటి స్థాయిలో నిధులు ఉన్నాయా అని అనుమానం కలుగుతున్నదని పేర్కొంది.

కాగా, రెండేళ్లపాటు దైచీతో కలిసి పనిచేసిన తర్వాత తన మార్కెట్ విలువను పెంచుకొని అత్యధికంగా లాభపడింది మీరు.. ప్రస్తుతం అందుకు తగ్గ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. మీ ఆస్తుల విలువను లెక్కించడం కుదురుతుందా అని కోర్టు ప్రశ్నించింది.

మరోవైపు, వీరిద్దరిపై రెలిగేర్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్..ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ వద్ద దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇదే క్రమంలో సింగ్ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా జపాన్‌కు చెందిన ఈ సంస్థ కూడా ధిక్కార కేసును దాఖలు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios