పండగల సీజన్‌ దూసుకొస్తున్నది. ఈ సీజన్‌లో అమ్మకాలు రెండంకెల వృద్ధి నమోదవుతుందని గృహోపకరణ ఉత్పత్తుల తయారీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే కస్టమ్స్‌ సుంకాలు పెంచినా, దాని ప్రభావం పండుగ సీజన్ అమ్మకాలపై ఉండబోదని.. కాదు కాదు పడనివ్వబోమని సదరు గృహోపకరణ ఉత్పత్తుల కంపెనీలు చెబుతున్నాయి.

కేంద్రప్రభుత్వం పెంచిన దిగుమతి సుంకాలను సదరు సంస్థలు ప్రస్తుతానికి వినియోగదారులపై మోపకపోవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల తదితర అంశాలు వినియోగదారుల మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నది.

కానీ పానాసోనిక్‌, హాయర్‌, గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌, బిఎ్‌సహెచ్‌ హౌస్‌హోల్డ్‌ అప్లయెన్సెస్‌ వంటి కంపెనీలు పండగ సీజన్‌ జోష్‌ను యథాతథంగా ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కేరళలో ఓనం నుంచి ప్రారంభమైన జోష్.. నవరాత్రులు, దీపావళితో ముగిసే పండగల సీజన్‌లో ఈ కంపెనీల వార్షిక విక్రయాలు దాదాపు 25 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నాయి.

వాస్తవంగా ఆగస్టులో కేరళలో వచ్చిన అకాల వరదలతో అమ్మకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని, తాజాగా కేంద్రం పెంచిన కస్టమ్స్‌ సుంకాలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు పానాసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ మనీష్‌ శర్మ తెలిపారు.

ఫుల్లీ మాన్యుఫ్యాక్చర్డ్‌ ఎసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లతో పాటు కంప్రెసర్ల దిగుమతులపై 20 కస్టమ్స్‌ సుంకాలను కేంద్రం విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఐదారు శాతం విక్రయాలు తగ్గుముఖం పడుతాయని ఇప్పటివరకు అంచనా వేశారు.

కంప్రెషర్స్‌పైనా కస్టమ్స్ సుంకాన్ని పెంచడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా నీరసించింది. కంప్రెసర్లపై దిగుమతిపై సుంకాలను పెంచటంతో రిఫ్రిజిరేటర్లు, ఎసీల ధరలు కచ్చితంగా పెరుగుతాయని, ఇది పండగల సీజన్‌లో అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని పానాసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ మనీష్ శర్మ చెప్పారు. ప్రభుత్వం విధించిన సుంకాల భారాన్ని తామే భరిస్తామని, ప్రస్తుత పండగల సీజన్‌లో అమ్మకాల జోరును కొనసాగించటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

తద్వారా ఈ నెలలో మొదలయ్యే దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, తదుపరి రిపబ్లిక్ డే ఉండటంతో అమ్మకాల్ని ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్నాయి. ఆఫర్లతో మరింత ఉత్సాహాన్ని తీసుకురావాలన్న యోచిస్తున్నాయి.

పండగల సీజన్‌లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు హాయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రంగాజా చెప్పారు. ఈ సీజన్‌లో మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ కోసం తాము రూ.40 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈసారి అమ్మకాల్లో దాదాపు 50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రకటనల కోసం అదనంగా 25 శాతం మొత్తాలను కేటాయిస్తున్నట్లు పానాసోనిక్‌ సిఇఒ మనీష్‌ తెలిపారు. ఈ సీజన్‌లో టీవీలు, కిచెన్‌ అప్లయెన్సెస్‌, బ్యూటీ కేర్‌, వెల్‌నెస్‌ ఉత్పత్తుల విక్రయాలు 25-30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రత్యేక ఫైనాన్స్‌ పథకాలను ఆపర్‌ చేయటంతో పాటు భారీగా మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు బిఎస్‌హెచ్‌ సీఈఓ గుంజన్‌ శ్రీవాత్సవ తెలిపారు.
 
పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున కాంపోనెంట్స్‌, ఫినిష్డ్‌ గూడ్స్‌ను దిగుమతి చేసుకున్నామని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది తెలిపారు. తామే కాక ఈ రంగంలోని పలు కంపెనీలు పెద్దఎత్తున అవసరమైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని, దీంతో ఈ సీజన్‌లో ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం లేదని కమల్‌ నంది పేర్కొన్నారు.

అయితే కొంతమంది ఉత్పత్తిదారులపై సుంకాల ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ వారు కూడా ధరల పెంపునకు సిద్ధపడక పోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా ధరల పెంపు మాత్రం ప్రస్తుత పండగల సీజన్‌ ముగిసిన తర్వాత ఉంటుందని కమల్‌ నంది అన్నారు.