న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సేవలకు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు రోడ్లపై ఎవ్వరూ తిరగకూడదని అంక్షలు విధించడంతో డెలివరీ బాయ్స్‌ తాత్కాలికంగా తమ సేవలను నిలిపివేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌, ముంబై నగరాల్లో తమ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు అవసరమైన కొన్ని నిత్యావసరాలు, వైద్యసంబంధిత పరికరాలు, ఔషధాలు మాత్రం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

ఇందుకు స్థానిక పోలీసు యంత్రాంగం నుంచి తమ సిబ్బందికి అవసరమైన అనుమతి పత్రాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడికక్కడ సరకు రవాణా వాహనాలు నిలిచిపోవడం, గిడ్డంగులను మూసివేయడంతో ఇప్పటికే ఆర్డర్‌ చేసుకున్న వస్తువులు డెలివరీ చేయడానికి కనీసం 4-5 రోజుల ఆలస్యం అవుతుందని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

అలాగే లాక్‌డౌన్‌ అమలులో ఉన్నంత వనరే క్యాష్ఆన్‌డెలవరీ, కార్డు వినియోగ సర్వీసును నిలిపివేస్తున్నట్టు అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా భౌతికదూరం పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులకు ఇంటివద్ద నుంచే పని చేసే ఆయా సంస్థలు వెసులుబాటు కల్పించడంతో ఎక్కువగా బ్రాడ్‌బ్యాండ్‌ రూటర్లు, కేబుల్స్‌కు సంబంధించి ఆర్డర్లు వచ్చాయని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. 

Also read:ఎల్పీజీ సహా ఏ ఇంధన కొరత కూడా లేదు.. తేల్చేసిన ఐఓసీ

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు లేనందువల్ల ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ-కామర్స్‌ సంస్థలు సుమారు ఒక బిలియన్‌ అమెరికన్ డాలర్ల నష్టాన్ని చవి చూడొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సకాలంలో ఆర్డర్లు పంపిణీ చేయడానికి సరిహద్దుల మూసివేత, సిబ్బంది కొరత ఆటంకంగా ఉన్నాయని సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. మరోవైపు స్నాప్ డీల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఢిల్లీ, నొయిడా, గుర్ గ్రామ్ నగరాల మధ్య ఫుడ్, గ్రాసరీ వస్తువులను అంతర్గతంగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.