Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలుతున్న ఆర్దిక వ్యవస్థలు...ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన...

కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. వివిధ దేశాల్లో ప్రత్యేకించి అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులపైనే దేశీయ ఐటీ రంగం ఆధారపడింది. ఆ దేశాల్లోనూ కరోనా మరణ మ్రుదంగం మోగిస్తున్న వేళ.. భారత ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు రావడం అనుమానమే. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. క్యాంపస్ సెలక్షన్ల ప్రక్రియను పక్కనబెట్టేశాయి. కానీ కేంద్రం మాత్రం తాము అన్ని సానుకూల చర్యలు తీసుకుంటామని.. క్యాంపస్ సెలెక్షన్లను నిలిపేయవద్దని ఐటీ దిగ్గజాలను కోరింది. 

corona virus: dont withdraw  job offers made in ccampus placements hrd min appeals companies
Author
Hyderabad, First Published Apr 7, 2020, 11:34 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్దిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. అన్ని రంగాలు స్తంభించడంతో ఇవి ఎప్పటికి కోలుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పేరుతో వివిధ ప్రైవేట్‌ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో భాగంగా చేసిన ఎంపికలను రద్దు చేయరాదని కేంద్రం కోరింది.

లాక్‌డౌన్‌ వల్ల దేశంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎంపికయిన అభ్యర్థుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా సంస్థలకు సూచించింది. ఎంపికైన అభ్యర్థులను యథా ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వెల్లడించింది. 

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ కాలం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం క్యాంపస్‌ ఎంపికలపై పడకుండా చూసుకోవాలని గతవారం 23 ఐఐటీల డైరెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌ ఎంపికలను రద్దు చేసుకోవద్దని రిక్రూటర్లను కోరినట్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ వీ రాంగోపాల్‌రావు తెలిపారు.

కరోనా మహమ్మారి వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఐటీ రంగ ఉద్యోగాల్లో భారీగా కోతపడనున్నది. కొందరికి ఇప్పటికే పింక్ స్లిప్‌లను కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సిద్ధంచేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంలోని చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నాయి. కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు కొద్ది నెలల క్రితం కొత్తగా చేరినవారికి అవసరం లేదని సంస్థలు సమాచారం ఇస్తున్నాయి.

కొన్ని ఐటీ సంస్థలు నియామకాలను రద్దు చేస్తుండగా, మరొకొన్ని చోట్ల వాయిదా పడే సూచనలు కనపిస్తున్నాయి. వారంతా జూన్‌ చివరి నుంచి ఉద్యోగాల్లో చేరాల్సి ఉంది. ఇప్పుడు కరోనా ప్రభావంతో విదేశాల నుంచి ప్రాజెక్టులు ఆగిపోయే సంకేతాలు వెలువడటంతో ఉద్యోగాలు దక్కుతాయా?లేదా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

also read కరోనా వైరస్ పై పోరాటానికి ఆపిల్ రెడీ...రోగులకు 2 కోట్లు...

కాగా, వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని మానవవనరుల విభాగం నిపుణులు పేర్కొన్నారు. వీరంతా క్లయింట్లపై ఆధార పడే చిన్న చిన్న ఐటీ సంస్థల్లో పనిచేసేవారని ఓ నిపుణుడు వెల్లడించారు. పెద్ద, మధ్యతరహా ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగ నియమాకాల విషయమై కొంత విరామం పాటిస్తాయని తెలిపారు.

ఐటీ రంగంలో 40 నుంచి 50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. చిన్న ఐటీ సంస్థల్లోనే 10 నుంచి 12 లక్షల మంది ఉన్నారు. దేశంలోని ఐదు అతిపెద్ద ఐటీ కంపెనీల్లో 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో గత జూలై నుంచి డిసెంబర్ వరకు ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వెళ్లి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి.

ప్రముఖ, పేరెన్నికగన్న ఐటీ సంస్థలు నైపుణ్యం గల ప్రొఫెషనల్స్‌కు పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చి తీసుకున్నాయి. వారిని వచ్చే జూన్‌ నుంచి కొలువుల్లో చేర్చుకోవాల్సి ఉంది. నియామకాల అమలు ప్రక్రియ వచ్చే ఆగస్టుతో ముగియాలి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలు పునరాలోచించాలని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.

‘కొలువుల్లోకి తీసుకోవడం ఆలస్యం కావొచ్చు...అది ఈసారి వచ్చే డిసెంబర్ వరకు సాగవచ్చని సమాచారం ఉంది’ అని ప్రముఖ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి చెప్పారు. దేశంలోని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలకు 80 శాతం వరకు ప్రాజెక్టులు అమెరికా, ఐరోపాల నుంచే వస్తాయి. ఆ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సందిగ్ధత నెలకొంది.

ఫేర్ పోర్టల్ అనే ఐటీఈఎస్-బీపీఓ సంస్థ ప్రయాణ పరిశ్రమ సేవలందస్తోంది. ఇప్పటికీ 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఇంటికెళ్లిపోవాలని ఆదేశించింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుందన్న సంగతి తెలియదు. ఈ సంస్థ బిజినెస్ 85 శాతం పడిపోయిన తర్వాత ఈ సంస్థ ఉద్యోగులను తొలగించడం గమనార్హం.

ఫేర్ పోర్టల్ సంస్థ తన ఉద్యోగులను తొలగించడంతోపాటు సీఈఓ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లో కోత విధిస్తోంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఉద్యోగుల తొలగింపులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios