Asianet News TeluguAsianet News Telugu

సొంత ప్రయాణాలకి చార్టర్ట్ ఫ్లైట్.. కరోనా నేపథ్యంలో సంపన్న కుటుంబాలు తీరు..

కరోనా వైరస్ సోకుతుందన్న అనుమానాల మధ్య పలు సంపన్న కుటుంబాలు ప్రయాణం కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేసుకుంటున్నాయి. ఇటీవల దేశీయ విమాన సర్వీసుల నిర్వహణకు అనుమతించిన తర్వాత ఈ ట్రెండ్ పెరిగింది. దీంతో సదరు విమానయాన సంస్థలు కూడా చార్టర్డ్ ఫ్లైట్ల చార్జీలు పెంచేశాయి.

Corona effect: Demand for Chartered planes for rich families
Author
Hyderabad, First Published Jun 6, 2020, 12:57 PM IST

న్యూఢిల్లీ: గత నెలలో విమాన సేవలు పునః ప్రారంభమయ్యాక భోపాల్‌కు చెందిన ఓ బడా వ్యాపారి ముగ్గురు కుటుంబ సభ్యులను ఢిల్లీ నుంచి రప్పించేందుకు రూ.10 లక్షలు ఖర్చు చేసి ఏకంగా ఓ విమానాన్నే బుక్‌ చేశాడు. ఇండిగోకు చెందిన ఆ 180 సీట్ల విమానంలో కేవలం తన కుటుంబ సభ్యులే ప్రయాణం చేశారు.

ఇది అరుదైన సంఘటనే అయినా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రీమంతులు తీసుకుంటున్న జాగ్రత్తలకు ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భౌతిక దూరం, శుభ్రత దృష్ట్యా ప్రత్యేక విమానయాన సేవలను కోరుకుంటున్న ధనికులు పెరుగుతున్నారు. దాంతో చిన్న సైజు చార్టర్‌ విమానాల బుకింగ్‌ల కోసం ఎంక్వైరీలు గణనీయంగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

‘‘దేశంలోని పలు ప్రాంతాల్లో, విదేశాల్లో చిక్కుకున్న వారు తిరిగి వారి ప్రదేశాలకు చేరుకోవాలనుకుంటున్నారు. దాంతో అత్యవసర విమానయాన సేవలకు డిమాండ్‌ అన్యూహంగా పుంజుకుంది’ అని జెట్‌ హెచ్‌క్యూ ఏషియా ప్రెసిడెంట్‌ రోహిత్‌ కపూర్‌ చెప్పారు.

‘విదేశాల్లో చిక్కుకున్న వారి విషయానికి వస్తే, ‘వందే భారత్‌’ పేరుతో ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకునే ఉద్దేశం లేని ధనికులు ప్రత్యేక విమాన సేవల వైపు మొగ్గు చూపుతున్నార’’ని జెట్‌ హెచ్‌క్యూ ఏషియా ప్రెసిడెంట్‌ రోహిత్‌ కపూర్‌ అన్నారు.

లాక్‌డౌన్‌ సడలింపులతో బడా పారిశ్రామికవేత్తలు సైతం వ్యాపార అవసరాల నిమిత్తం ఇతర నగరాలకు ప్రయాణించడం పెరిగింది. వేరే ప్రాంతంలోని తమ ఫ్యాక్టరీలను సందర్శించాలనుకునే, ఉద్యోగులను కలుసుకోవాలనుకునే కార్పొరేట్‌ వర్గాలు ప్రత్యేక విమానయానానికే ప్రాధాన్యమిస్తున్నారని వినికిడి.

also read   నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ..త్వరలో డ్రోన్ల సేవలు అందుబాటులోకి..

దేశీయంగా చార్టర్‌ విమానయాన బుకింగ్‌ కోసం ఎంక్వైరీలు 15 శాతం మేర పెరిగాయని క్లబ్‌ వన్‌ ఎయిర్‌ సీఈఓ రాజన్‌ మెహ్రా తెలిపారు. ఈ సంస్థ వద్ద 10 చార్టర్‌ విమానాలు ఉన్నాయి. గతంలో రోజుకు 6-7 ఎంక్వైరీలు వస్తుండేవని, ఇప్పుడా సంఖ్య 10-12కు పెరిగిందని ఆటమ్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకులు అర్చిత్‌ గుప్తా తెలిపారు. 


గిరాకీ పెరగడంతో చార్టర్‌ విమాన సంస్థలు చార్జీలు పెంచేశాయి. గతంలో గంటకు రూ.75,000 వసూలు చేసే ఆటమ్‌ ఏవియేషన్‌.. ఇప్పుడు రుసుమును రూ.లక్షకు పెంచింది. ప్రధాన ఎయిర్‌లైన్స్‌ సైతం: విమాన సర్వీసులు పునః ప్రారంభమైనా ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌ వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్‌కు మాత్రం నిరాశే ఎదురవుతోంది.

వైర్‌సకు జడిసి విమానం ఎక్కేవారు తగ్గిపోయారు. దాంతో ఈ ఎయిర్‌లైన్స్‌ల విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పూర్తి సీటింగ్‌ సామర్థ్యంలో 50 శాతం లోపే ఉంటోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. 

అందుకే ఇండిగో, స్పైస్‌జెట్‌ సైతం చార్టర్‌ విమాన సేవలను ప్రారంభించాయి. గతంలో ‘ఉడాన్‌’ మార్గాల్లో నడిపిన ఏటీఆర్‌, బొంబార్డియర్‌ క్యూ400 విమానాలను ఈ చార్టర్‌ సర్వీసుల కోసం ఉపయోగించుకుంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios