న్యూఢిల్లీ: తల బొప్పి కట్టిన తర్వాత గానీ వైద్యం తెలియదు.. అలాగే ఉన్నది కేంద్రం ప్రత్యేకించి కేంద్ర ఆర్థిక శాఖ పనితీరు. జీఎస్టీ అమలుతో ఇబ్బడి ముబ్బడిగా పన్ను వసూళ్లు జరుగుతాయన్న అంచనాల మధ్య ఇష్టారాజ్యంగా 28 శాతం వరకు ఐదారు రకాల శ్లాబ్‌లు ఖరారు చేసిన కేంద్రం.. ఇప్పుడు అత్యధికంగా డబుల్ డిజిట్ లోపు వస్తువులపైనే అత్యధికంగా 28 శాతం జీఎస్టీ అమలు చేసే స్థాయికి దిగి వచ్చింది. 

అయితే వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో క్రయ విక్రయాలు నమోదు చేస్తేనే జీఎస్టీ అమలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే వివిధ రకాల వస్తువులు, సేవలపై జీఎస్టీని తగ్గిస్తూ అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఇప్పుడు కస్టమర్ల నుంచి జీఎస్టీ చార్జీలను వసూలు చేయకుండా కంపోజిషన్ డీలర్లను నిరోధించే చర్యలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నది.

ఇందులో భాగంగానే కొనుగోలుదారుల నుంచి ఏ పన్నునూ తీసుకోకుండా ఇన్వాయిస్‌ల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను కంపోజిషన్ డీలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు తప్పక పేర్కొనేలా నిర్ణయం తీసుకోవాలని రెవిన్యూ శాఖ భావిస్తున్నది. ఈ మేరకు పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) కూడా ఈ ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నది. ఒక్కసారి గనుక ఇది అమల్లోకి వస్తే కస్టమర్ల నుంచి కంపోజిషన్ డీలర్లు వసూలు చేస్తున్న జీఎస్టీకి అడ్డుకట్ట పడినట్లేనని ప్రభుత్వం భావిస్తున్నది. 

ఇలా వసూలవుతున్న జీఎస్టీ ఖజానాకు రావడం లేదంటున్న ఓ అధికారి.. అదంతా కూడా అక్రమంగా కంపోజిషన్ డీలర్లకే ప్రయోజనకరమైందని చెబుతున్నారు. అందుకే కస్టమర్లకు లబ్ధి చేకూరేలా కంపోజిషన్ డీలర్ల జీఎస్టీ వసూళ్లకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సదరు అధికారి చెప్పారు.

వినియోగదారులకూ ఈ విషయంలో అవగాహన కల్పించాలని రెవిన్యూ శాఖ అనుకుంటున్నది. కొనుగోలుదారుల నుంచే జీఎస్టీని వసూలు చేయాల్సిన అవసరం డీలర్లకు లేదన్న దానిపై స్పష్టత వచ్చేలా ప్రచారం చేపట్టాలని చూస్తున్నది. జీఎస్టీ కంపోజిషన్ పథకం కింద ట్రేడర్లు, తయారీదారులు గూడ్స్‌పై ఒక్క శాతం మాత్రమే జీఎస్టీని చెల్లించాలి. ఇందులోలేనివారు 5, 12, 18 శాతం పన్నులను చెల్లించాల్సి ఉంటున్నది. వీరికి కూడా కొనుగోలుదారుల నుంచి జీఎస్టీ చార్జీలను వసూలు చేయడానికి అనుమతి లేదు.

అలాంటిది తక్కువ జీఎస్టీని చెల్లిస్తున్న కంపోజిషన్ డీలర్ల దోపిడి ఇటు వినియోగదారులకు ఇబ్బందికరంగా, అటు ప్రభుత్వానికి నష్టదాయకంగా పరిణమించింది. కస్టమర్ల నుంచి అధిక శాతంలో జీఎస్టీని వసూలు చేస్తున్న కంపోజిషన్ డీలర్లు అందుకు అనుగుణంగా మాత్రం ప్రభుత్వ ఖజానాకు డిపాజిట్ చేయడం లేదని ఓ అధికారి పీటీఐకి తెలిపారు. కాగా, జీఎస్టీ కింద 1.17 కోట్ల వ్యాపారులు నమోదై ఉన్నారు.

వీరిలో దాదాపు 20 లక్షల మంది వ్యాపారులు కంపోజిషన్ స్కీం వర్తింపజేసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి ఈ నెల 10న జరిపిన 32వ సమావేశంలో జీఎస్టీ కంపోజిషన్ స్కీం కింద టర్నోవర్ ఆధారంగా చిన్న వర్తకులు, వ్యాపారులు చెల్లిస్తున్న ఒక్క శాతం పన్ను రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ దాటినవారికే వర్తిస్తుందని నిర్ణయించిన విషయం తెలిసిందే. 
ప్రస్తుతం ఈ పన్ను వార్షిక టర్నోవర్ కోటి రూపాయలు దాటితే పడుతున్నది. ఏప్రిల్ 1 నుంచి మార్పు వర్తిస్తుందని నాడు జైట్లీ పేర్కొన్నారు. అలాగే రూ.50 లక్షలదాకా వార్షిక టర్నోవర్ ఉన్న సేవలు లేదా, వస్తు, సేవల కల్పనదారులు, సరఫరాదారులూ కంపోజిషన్ స్కీంను ఉపయోగించుకోవడానికి అర్హులని చెప్పిన సంగతీ విదితమే.

జీఎస్టీ అమలు తర్వాత ఆయా రాష్ర్టాలు ఆదాయాన్ని కోల్పోతున్న నేపథ్యంలో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ అందుకు గల కారణాలను పరిశీలించనున్నది. గత నెల 22న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ కమిటీని మండలికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నియమించారు. 

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, ఒడిశా, గోవా, బీహార్, గుజరాత్, ఢిల్లీ రాష్ర్టాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతేడాది ఏప్రిల్-నవంబర్ వ్యవధిలో కనిష్ఠంగా 14 శాతం నుంచి గరిష్ఠంగా 37 శాతం వరకు ఆదాయాన్ని ఈ రాష్ర్టాలు కోల్పోయినట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. పుదుచ్చేరి ఏకంగా 43 శాతం రెవిన్యూ నష్టాన్ని చవిచూసింది. ఈ రాష్ర్టాలకు జీఎస్టీ నష్టపరిహారం కింద రూ.48,202 కోట్లనూ కేంద్రం విడుదల చేసింది. అంతకుముందు ఏడాది ఇది రూ.48,178 కోట్లుగా ఉన్నది. 
దేశంలోని మొత్తం 31 రాష్ర్టాల్లో దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఈశాన్య రాష్ర్టాలైన మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్‌లు మాత్రమే జీఎస్టీ వచ్చాక రికార్డు స్థాయిలో ఆదాయాన్ని అందుకోగలుగుతున్నాయి. ఈ క్రమంలో మిగతా రాష్ర్టాల ఆదాయాన్నీ పెంచి జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపులను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తున్నది. వివిధ రకాల వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లను తగ్గించడంతో నెలసరి వసూళ్లు పడిపోవడం, వ్యాపారుల అక్రమాలతో జీఎస్టీ చెల్లింపులు తగ్గిపోవడంతో నష్టపరిహారం భారాన్ని సర్కారు మోయలేకుండా ఉన్నది.