బెంగళూరు: బెంగళూరులోని తమ అనుబంధ సంస్థకు చెందిన టెక్‌పార్క్‌ను విక్రయించడానికి కేఫ్‌ కాఫీడే సిద్ధమైంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేఫ్‌ కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆర్థిక ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కొన్ని వారాలకే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

బుధవారం కేఫ్ కాఫీడే నిర్వహించిన కార్యనిర్వాహక సమావేశంలో బోర్డు సభ్యులు ఈ సంగతి చెప్పారు. సంస్థకు ఉన్న అప్పులను కొంత మేర తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బెంగళూరులో 90 ఎకరాల్లో విస్తరించి ఉన్న టెక్‌ పార్క్‌.. కేఫ్‌ కాఫీడేకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న టాంగ్లిన్‌ డెవలెప్‌మెంట్స్‌కు చెందింది. 
ఈ టెక్ పార్కును న్యూయార్క్‌కు చెందిన సంస్థ బ్లాక్‌ స్టోన్‌కు రూ.3వేల కోట్లకు విక్రయించనున్నారు. ఇప్పటికే ఇరు సంస్థల మధ్య అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ నిర్వాహకులు వివరించారు. ట్రేడింగ్‌ సంస్థ ఆల్ఫాగ్రేప్‌ సెక్యూరిటీస్‌ను కూడా రూ.28 కోట్లకు అమ్మకానికి పెట్టినట్లు సంస్థ తెలిపింది.

సీఈఓ స్థాయి బాధ్యతలను నిర్వర్తించేందుకు ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక కమిటీలో అదనపు సభ్యురాలుగా 31 జులైన సిద్ధార్థ భార్య మాలవికా హెగ్దే చేరారు. కేఫ్‌ కాఫీడే సంస్థ మొత్తం ఆస్తులు రూ.11,259 కోట్లు.

ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు కేఫ్‌ కాఫీడేకు చెందిన అనుబంధ సంస్థలకు (కేఫ్‌ కాఫీడే గ్లోబల్‌ లిమిటెడ్, శిఖల్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌, టాంగ్లిన్‌ డెవలెప్‌మెంట్స్‌ లిమిటెడ్‌, వే టు వెల్త్‌, కాఫీడే హోటల్స్‌) మొత్తంగా రూ.7,653 కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం.