హాంకాంగ్ ఆందోళనను మొదట్లోనే అణచివేయాలని చైనా భావిస్తోంది. కానీ పశ్చిమ దేశాల నుంచి ప్రత్యేకించి అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. హాంకాంగ్ సుసంపన్నం. విదేశాల్లోకి పెట్టుబడులు వెళ్లాలన్నా, చైనాలో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలన్నా హాంకాంగ్ కీలకం.
బీజింగ్: బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం హాంకాంగ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనాకు 20147 వరకు గడువు ఉంది. నాడు ఒక్క దేశం- రెండు వ్యవస్థలు నినాదం అమలుకు చైనా అంగీకారం కుదిరింది. కానీ 2047 వరకు కూడా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేయాలని భావిస్తోంది.
ఇప్పటి నుంచే ఈ నగరాన్ని చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికి ఎందుకు ఆత్రపడుతోంది..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆర్థిక అవసరాలు..! బంగారు బాతు వంటి హాంకాంగ్‌లో గుడ్లను వాడుకోకుండా బాతునే కోసుకు తినాలని చూస్తోంది.
జూన్ 9న వివాదానికి బీజం వేస్తూ హాంకాంగ్ ప్రభుత్వం నేరస్థులను చైనాకు తరలించే బిల్లును ప్రవేశపెట్టింది. తర్వాత మూడు రోజులకు మొదలైన ఆందోళన సునామీలా మారి దాదాపు రెండు నెలలు పూర్తి చేసుకొని మూడో నెలలో కొనసాగుతున్నది.
సాక్షాత్తు హాంకాంగ్ పాలకురాలు కెరీలామ్ క్షమాపణ చెప్పినా.. ఏడ్చినా.. బిల్లును రద్దు చేసినా ఆందోళన కొనసాగుతోంది. ఇన్నాళ్లు తెరచాటున వ్యవహారం నడిపిన చైనా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది.
చైనా భద్రతా దళాలు మారుదుస్తుల్లో హాంకాంగ్ ప్రదర్శనకారుల్లో చేరి దాడులు చేస్తున్నాయి. హాంకాంగ్ సరిహద్దుల్లో భారీగా చైనా దళాలు, ట్యాంకులను మోహరించింది. ఈ వ్యహారం మొత్తం చూస్తే హాంకాంగ్‌పై చైనా దండయాత్ర చేస్తోందా, లేక మరో తియాన్మన్ స్క్వేర్ పునరావృతం అవుతుందా అనే స్థాయిలో పరిస్థితి నెలకొంది.
ఒకప్పటి బ్రిటష్ కాలనీ హాంకాంగ్ ఆర్థికంగా ఎల్లవేళలా సుసంపన్నంగానే ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపార వాతావరణం హాంకాంగ్‌కు పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడుల వరదను పారించింది. చైనా కంపెనీలకు విదేశీ నిధులు ఇక్కడి నుంచే వెళతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్లలో హాంకాంగ్ మార్కెట్ ఒకటి. హాంకాంగ్ ఆదాయం, పరపతి నుంచి చైనా భారీగా లబ్ధిపొందింది.
చైనా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద దేశేతర మార్కెట్ హాంకాంగే. ప్రపంచ దేశాలకే అప్పులు ఇచ్చే ఆ బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో 7శాతం ఈ ఒక్క నగరంలోనే ఉన్నాయంటే ఎంత వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ చైనాకు చెందిన బీవోసీ హాంకాంగ్ లిమిటెడ్ నోట్లు జారీ చేసే బ్యాంకుల్లో ఒకటి.
బ్యాంకు నిర్వహణ ఆదాయం ఐదో వంతు హాంకాంగ్, మకావ్‌ల నుంచే వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో కొన్నిటి ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్‌లోనే ఉన్నాయి.
చైనాలో నగదు కొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, స్థానిక ప్రభుత్వ ఆర్థిక సంస్థలు హాంకాంగ్ నుంచి రుణాలు తెచ్చుకుంటాయి. అవే రుణాలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాలి. ఇప్పుడు హాంకాంగ్ చేజారితే చైనాకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు ఉన్న హాంకాంగ్‌లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి చైనా కంపెనీలు ఇష్టపడతాయి. చాలా కంపెనీలు ఇక్కడి స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. టెన్సెంట్ హోల్డింగ్స్, క్నుక్ వంటి దిగ్గజాలు ఇక్కడే ఉన్నాయి.
2015 నుంచి హాంకాంగ్‌లో ఐపీవోలకు వచ్చిన చైనా కంపెనీలు 100 బిలియన్ డాలర్లకు పైగా సేకరించాయి. చైనాలో సేకరించిన మొత్తంలో ఇది 80శాతానికి సమానం..! అదీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్ శక్తి.
తాజాగా విదేశీ పెట్టుబడిదారులు హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ద్వారా షాంఘై మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ రకమైన ట్రేడింగ్ వాటా షాంఘై స్టాక్‌మార్కెట్లో 8శాతానికి చేరుకొంది.
హాంకాంగ్ కరెన్సీ విలువ డాలర్‌కు దాదాపు సమానం. దీంతో చైనీయులు యువాన్లను డాలర్లలో మార్చుకోవడానికి హాంకాంగ్‌లోని బీమా ఉత్పత్తులను వాడుకొంటారు.
క్రెడిట్ కార్డ్ల ద్వారా చెల్లింపులు చేసి చైనా నిబంధనలను బైపాస్ చేస్తుంటారు. దీనికి తోడు చైనా విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా హాంగ్‌కాంగ్‌కే వెళతాయి. 2017 చివరినాటికి ఇవి దాదాపు 981 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి.
హాంకాంగ్‌లో ఏమి చేసైనా అల్లర్లను అదుపు చేయడం చైనాకు ఇప్పుడు అత్యవసరం. అమెరికా హాంకాంగ్‌ను వాణిజ్య యుద్ధంలో బేరాలాడటానికి ఆయుధంగా మలుచుకున్నది. హాంకాంగ్‌లో చైనా దుస్సాహసాలకు పాల్పడితే భవిష్యత్‌లో వాణిజ్య ఒప్పందం ఉండదని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
హాంకాంగ్ నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులకు టారీఫ్‌లు విధించకుండా ట్రంప్ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. చాలా చైనా కంపెనీలు ఇప్పుడు హాంకాంగ్ నుంచే ఎగుమతులు చేస్తున్నాయి.
ఇప్పుడు హాంకాంగ్‌లో ఆందోళనలు ఆ ఎగమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ మినహాయింపులను ఏడాదికోసారి సమీక్షించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి.
మరోపక్క చైనా కంపెనీలకు మంచి మార్కెట్ విలువను ఇచ్చే హాంకాంగ్ సూచీలు వేగంగా పడిపోతుండటం డ్రాగన్‌లో ఆందోళన పుట్టిస్తోంది. హాంకాంగ్‌కు విమాన టిక్కెట్ల బుకింగ్ 20శాతం పడిపోగా, రిటైల్ విక్రయాలు 6శాతానికి పైగా తగ్గాయి.
దీనికి తోడు త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 0.5శాతానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ వృద్ధి రేటు. హాంకాంగ్ ఆర్థిక మాద్యంలోకి జారితే చైనా ఆర్థిక వ్యవస్థకు భారీగా దెబ్బతగులుతుంది.
చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో షాంఘై, షెన్జన్ వంటి నగరాలను పశ్చిమ దేశ కంపెనీలను ఆకర్షించేలా చేయాలంటే సుదీర్ఘ ప్రణాళిక అమలుతోపాటు ఏళ్లు పడుతుంది. కానీ అప్పటి వరకు ఆర్థిక సంక్షోభం ఆగదు. అందుకే హాంకాంగ్ గొంతు నొక్కేయాలని చైనా ప్రయత్నిస్తోంది. కానీ ఆ ప్రయత్నం వికటించే సంకేతాలు కనిపించడంతో డ్రాగన్ విలవిలలాడుతున్నది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 26, 2019, 2:07 PM IST