న్యూఢిల్లీ: విదేశీ ఐటీ నిపుణుల వీసా నిబంధనల్లో మార్పులు తీసుకు రావడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఉంటాయని ఇండియన్ ఐటీ బాడీ నాస్కామ్ పేర్కొంది. విదేశీ నిపుణులను ఐటీ సంస్థలు నియమించుకోవడం కష్ట సాధ్యం అవుతుందని హెచ్చరించింది. దీనివల్ల అమెరికాలో ఐటీ కంపెనీలకు గల నిపుణుల కొరత తీర్చడం క్రిటికల్‌గా మారుతుందని హెచ్చరించింది. 

వీసా నిబంధనల్లో సవరణ ప్రతిపాదనల్లో ఒకటి సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అమలులోకి రానున్నది. ఆయా ఐటీ సంస్థలకు విదేశీ నిపుణుల అవసరాల మాటెలా ఉన్నా.. వారి రాకపోకలను, వారి దరఖాస్తులను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారులు నిర్దేశిస్తారు. విదేశీ ఐటీ నిపుణుల దరఖాస్తులు, పిటిషన్లు తిరస్కించాలా? లేదా? అన్న విచక్షణాధికారం వారికి ఉంటుంది. తొలిసారి జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ) లేదా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టూ డినై (ఎన్ఓఐడీ) అభ్యర్థనలతో నిమిత్తం లేకుండా చర్యలు తీసుకుంటారు. 

ఈ మేరకు నోటీసెస్ టు అప్పియర్ (ఎన్టీఏ)లో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్  (ఐసీఈ) గత నెల 28న మెమొ జారీ చేసింది. దీనర్థం అమెరికాలోని వివిధ ఐటీ సంస్థల్లో పని చేసేందుకు వచ్చిన నిపుణుల హెచ్-1బీ వీసా గడువు పూర్తి కాగానే వారిని సాగనంపేందుకు చేసిన ప్రతిపాదనేనని నాస్కామ్ అభిప్రాయ పడుతున్నది. వీసా పొడిగింపు వేచి చూస్తూ అభ్యర్థనలు దాఖలు చేసిన కొందరిని కూడా వారి సొంత దేశాలకు సాగనంపాలని భావిస్తున్నట్లు తెలిపింది.  

అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి ప్రతిభావంతులు అమెరికాలోని వివిధ సంస్థల్లో పని చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని నిరుత్సాహపర్చడమేనని నాస్కామ్ స్పష్టం చేసింది. ఇది అమెరికా ఐటీ కంపెనీల ప్రగతికి ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొన్నది.

అమెరికా లేబర్ మార్కెట్‌లో భారీస్థాయిలో నిపుణుల కొరత ఉన్నదని నాస్కామ్ గుర్తు చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి విదేశీ నిపుణుల సాయం అవసరం ఉన్నదని తెలిపింది. హెచ్-1 బీ వీసా నిబంధనల్లో మార్పులు తేవడం వల్ల అమెరికా వ్రుద్ధి మందగించడంతోపాటు నూతన ఆవిష్కరణలు తగ్గిపోతాయని నాస్కామ్ హెచ్చరించింది. అమెరికా కంపెనీలు తమకు అవసరమైన నిపుణులను పొందలేరని పేర్కొన్నది. అమెరికా జారీ చేసిన నూతన విధానంపై నాస్కామ్ తన భాగస్వాములతో కలిసి చర్చించి విశ్లేషిస్తామని, అవసరమైన సంస్కరణలు ప్రతిపాదిస్తామని వివరించింది.