ఏడాది క్రితం మహిళా దినోత్సవం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళ ఆమె. ఎవరో కాదు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చర్‌.. కానీ ప్రస్తుతం ఆమె చుట్టూ వీడియోకాన్ రుణాల కేసు ఉచ్చు గట్టిగానే బిగుస్తున్నది.

ఈ కేసులో ఇప్పటికే చందాకొచ్చర్‌ను మూడు రోజుల పాటు ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)..తాజాగా ఆమె భారీగా లబ్దిపొందినట్లు గుర్తించింది. చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ వివిధ రూపాల్లో రూ.500 కోట్ల మేర లబ్ధి పొందినట్లు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది.

ఈ నేపథ్యంలో కొచ్చర్ కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసేయోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తున్నది. వీడియోకాన్‌కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణాల కేసులో చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లను గత వారంలో మూడు రోజులుప్రశ్నించింది.

రుణం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ధూత్..దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్ సంస్థలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో జనవరిలోనే చందాకొచ్చర్‌పై ఈడీ..ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినా ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు పంపలేదు.

త్వరలో చందాకొచ్చర్‌కు సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. నూపవర్ రెన్యూవబుల్‌లోకి 2010లో వేణుగోపాల్ ధూత్ రూ.64 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఈడీ గుర్తించింది. 2009 నుంచి 2011 మధ్యకాలంలో ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద రూ.1,575 కోట్ల మేర రుణం తీసుకున్నారు. 

నిశాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థయైన ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ కూడా రూ.325 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఎస్సార్ గ్రూపు చైర్మన్ రవీ రూయా అల్లుడే నిశాంత్ కనోడియా. చందా కొచ్చర్ నాయకత్వంలోనే ఎస్సార్ స్టీల్‌కు 530 మిలియన్ డాలర్ల రుణంగా ఇచ్చింది.

అయితే దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్ సారథ్యంలోని వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు విషయంలో క్రెడిట్ కమిటీ పాత్రపై నిగ్గు తేల్చేందుకు కూడా ఈడీ సిద్ధమవుతోంది. గతవారం వేణుగోపాల్ ధూత్ కీలక సన్నిహితుడు, చందాకొచ్చర్ అండ్ దీపక్ కొచ్చర్ బంధువు మహేష్ పుగాలీని కూడా ఈడీ గతవారం ప్రశ్నించింది.