పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడు నీరవ్ మోదీని వెంటనే అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్‌తోపాటు బ్రిటన్‌ ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. లండన్‌లోని ఓ లగ్జరీ ఫ్లాట్‌లో నెలకు రూ.15 లక్షలకుపైగా అద్దె చెల్లించి నీరవ్ మోదీ దర్జాగా బ్రతికేస్తున్న సంగతి బయటపడిన సంగతి తెలిసిందే.

నేపథ్యంలో సీబీఐ వర్గాలు అటు ఇంటర్‌పోల్‌తో, ఇటు బ్రిటన్ అధికార వర్గాలతో సంప్రదింపులు జరిపాయి. ఇప్పటికే నీరవ్‌పై రెడ్‌కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దీని ఆధారంగా నీరవ్‌ను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని భారత్ విజ్ఞప్తి చేస్తున్నది.

వేర్వేరు దేశాల పౌరసత్వాలను కలిగి ఉన్న నీరవ్.. లండన్ నుంచి మరో దేశానికి పారిపోకముందే అప్రమత్తం కావాలని బ్రిటన్‌లోని ఇంటర్‌పోల్ వర్గాలను కోరినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

నిరుడు ఆగస్టులోనే నీరవ్ మోదీ లండన్‌లో ఉన్నట్లు బ్రిటన్, ఇంటర్‌పోల్‌లకు తెలియజేశామని, అయితే ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియక ఆ వివరాలను మాత్రం చెప్పలేకపోయామని గుర్తుచేశారు.

ఈ క్రమంలో లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లోగల తోటెన్‌హామ్ కోర్టు రోడ్డులో ఉన్న సెంటర్ పాయింట్ టవర్ అనే లగ్జరీ అపార్టుమెంట్‌లో త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్ తీసుకుని నీరవ్ ఉంటున్నట్లు శనివారం స్పష్టమైంది.

ఈ ఫ్లాట్ విలువ 8 మిలియన్ పౌండ్లు (రూ.73 కోట్లు). ఇక్కడ రూ.15.50 లక్షల నెలసరి అద్దె చెల్లించి నీరవ్ నివాసం ఉంటున్నాడని బ్రిటన్‌ ‘ది డైలీ టెలిగ్రాఫ్’దిన పత్రిక ప్రకటించింది. దీంతో ఇంటర్‌పోల్, బ్రిటన్ ప్రభుత్వాలతో  సీబీఐ టచ్‌లో ఉంటున్నది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.14,000 కోట్లు ముంచి గతేడాది జనవరిలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయిన సంగతి విదితమే. నీరవ్ మేనమామ, రత్నాల వ్యాపారి మెహుల్ చోక్సీ కూడా ఈ స్కాంలో కీలక నిందితుడే.

ఈయన కరేబియన్ దేశమైన అంటిగ్వాలో ఉంటున్నట్లు సీబీఐ చెబుతున్నది. ఈయన్నూ భారత్‌కు తెచ్చేందుకు సీబీఐ విశ్వప్రయత్నాలను చేస్తున్నది. మరోవైపు లండన్‌లో నీరవ్ మోదీ వ్యాపార లావాదేవీలను ప్రారంభించడానికి సహకరించిన వారిపై సీబీఐ, ఈడీ అధికారులు ద్రుష్టి సారించారు.

బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ యాజమాన్యంతో నీరవ్ మోదీ తొలి నుంచి సంబంధాలు కలిగి ఉన్నాడని ఈడీ, సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతేడాది మే నెలలో వ్యాపార లావాదేవీలను నీరవ్ మోదీ ప్రారంభించాడని తెలుస్తున్నది. 

అయితే కంపెనీ హౌస్ జాబితాలో దీన్ని చేర్చలేదు. జ్యువెల్లరీ అండ్ వాచ్ రిటైల్ షాప్‌గా నీరవ్ మోదీ బిజినెస్ నడుపుతున్నట్లు సమాచారం. బ్రిటన్‌లోనూ వర్క్స్ అండ్ పెన్షన్ శాఖ నుంచి నీరవ్ మోదీ నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ అందుకున్నాడని, దీంతో బ్యాంక్ ఖాతా ప్రారంభించి ఆన్ లైన్ సేవలను అందుకుంటున్నాడని తెలుస్తోంది.

రిచ్ ఫారినర్స్‌కు సలహాలిచ్చే వెల్త్ మేనేజ్మెంట్ సంస్థతోనూ నీరవ్ మోదీ సంప్రదింపులు జరిపాకే ఈ బిజినెస్ ప్రారంభించాడని తెలియ వస్తున్నది. నీరవ్ మోదీ అప్పగింత కోసం గతేడాది జూలైలో బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ అభ్యర్థించింది.

గతంలో విజయ్ మాల్యా అప్పగింత విషయంలో అనుసరించిన విధానాన్నే నీరవ్ మోదీ పట్ల బ్రిటన్ ప్రభుత్వం అనుసరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. చట్టపరమైన ఇబ్బందులను పరిశీలించిన తర్వాత నీరవ్ మోదీని ప్రోవిజనల్ అరెస్ట్ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని బ్రిటన్ స్కాట్లాండ్ పోలీసులు నిర్దేశించుకుంటారు.

నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. దీన్ని విచారించిన తర్వాతే అక్కడి న్యాయస్థానాలు భారత దేశానికి నీరవ్ మోదీని అప్పగించాలన్న పిటిషన్ ను విచారిస్తాయి.