ప్రముఖ ఈకామర్స్, డిజిటల్ వ్యాలెట్ పేటీఎంలో భారీ స్కాం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ కు చెందిన అధికారులు ఆలస్యంగా గుర్తించారు. క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఏకంగా రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌ సంస్థతో కలిసి రూపొందించిన ఒక ప్రత్యేక టూల్‌తో ఈ మోసాన్ని గుర్తించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.  

ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. ‘దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్‌ లభిస్తుండటాన్ని మా టీమ్‌ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరాం‘ అని విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పారు. 

ఆడిటింగ్‌ సంస్థ  నిర్వహించిన ఆడిట్‌లో కొందరు జూనియర్‌ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్‌ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని ఆయన వివరించారు.క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో వ్యాపారం లాభసాటిగా ఉండదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటివి ఇచ్చినా వ్యాపారం నిలదొక్కుకోగలదని శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పడుతుందని చెప్పారు.