కార్డురహిత లావాదేవీలను పెంచేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు లేకపోయినా బ్యాంకు ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు కూడా తన కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. కార్డు లేకుండా మనీని విత్ డ్రా చేసుకునే ప్రక్రియను ఈ బ్యాంకు వివరించింది.
ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకులో మీకు సేవింగ్స్ ఖాతా ఉందా..? అయితే ఈ వార్త మీకోసమే. ఏటీఎం లేదా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు కల్పిస్తోంది. ఏటీఎం కార్డు తీసుకుని బయటికి వెళ్లడం మీకు నచ్చకపోయినా లేదా పొరపాటున ఏటీఎం కార్డు మర్చిపోయి ఏటీఎం వద్దకు వెళ్లినా.. మీరు తేలిగ్గా మనీని విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!
ఐమొబైల్ యాప్ తప్పనిసరి..
కార్డురహిత నగదు విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు కల్పిస్తోంది. దీని కోసం ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఐమొబైల్ యాప్ మీ వద్ద ఉండాలి. ఈ యాప్ ద్వారా బ్యాంకు కస్టమర్లు తేలిగ్గా దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
స్టెప్ 1: ఐమొబైల్ యాప్‌పై మీరు సర్వీసెస్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కార్డులెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత, ఐసీఐసీఐ ఏటీఎం వద్ద మీకు ఎంత మొత్తం కావాలో దాన్ని, నాలుగంకెల టెంపరరీ పిన్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత ప్రీ కన్ఫర్మేషన్ స్క్రీన్‌పై కనిపించే వివరాలను కన్‌ఫార్మ్ చేసి, సబ్‌మిట్ నొక్కాలి.
స్టెప్ 2: ఆ తర్వాత ఎస్‌ఎంఎస్ రూపంలో ఆరెంకెల కోడ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి వస్తుంది. ఈ కోడ్ ఆరు గంటల పాటు వాలిడ్‌లో ఉంటుంది.
స్టెప్ 3: ఆ తర్వాత మీరు ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
- అక్కడ మీరు కార్డులెస్ విత్ డ్రా అనే దానిపై క్లిక్ చేయాలి.
- అంతేకాక మీ వద్దనున్న ఐమొబైల్ యాప్‌లో కూడా సర్వీసెస్‌లో కార్డులెస్ విత్ డ్రా అనే దానిపై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నొక్కాలి.
- యాప్‌లో మీరు సెట్ చేసిన టెంపరరీ నాలుగంకెల కోడ్‌ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఆరు అంకెల కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- విత్ డ్రా మొత్తాన్ని తెలపాలి.
