Asianet News TeluguAsianet News Telugu

పీకల్లోతు కష్టాల్లో బైజూస్‌కు మరో షాక్ .. రూ.9,000 కోట్ల జరిమానా విధించిన ఈడీ, కారణమిదే..?

అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న విద్యా సేవల సంస్థ ‘‘బైజూస్’’కు మరో షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు గాను రూ.9000 కోట్లను చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. 

Byjus Asked To Pay 9,000 Crore For Violating Foreign Funding Laws ksp
Author
First Published Nov 21, 2023, 2:57 PM IST

అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న విద్యా సేవల సంస్థ ‘‘బైజూస్’’కు మరో షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు గాను రూ.9000 కోట్లను చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే అధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ తమకు అందలేదని కంపెనీ పేర్కొంది. ఈడీలోని మూలాల ప్రకారం.. బైజూస్ 2011 నుంచి 2023 మధ్యకాలంలో దాదాపు రూ.28000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) పొందింది. అలాగే విదేశీ నిధులకు సంబంధించిన చట్టాలను బేఖాతరు చేస్తూ దాదాపు 9,754 కోట్లను ఓవర్సీస్ డైరెక్ట్ పేరుతో పంపించారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

ఈడీ నోటీసులపై మీడియాలో వస్తున్న కథనాలపై బైజూస్ ఎక్స్ ద్వారా స్పందించింది. ‘‘ ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి కమ్యూనికేషన్ అందుకోలేదని పేర్కొంది. బైజూస్‌ ఫెమా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం ’’ అని స్పష్టం చేసింది. ఈడీ నోటీసు అనేది దేశంలోనే అత్యంత విలువైన స్టార్ట్ అప్‌కు కీలక పరిణామం. 

బైజూస్ మాతృ సంస్థ ‘‘ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’’ ఇంజనీర్లు, ఉపాధ్యాయులైన బైజు రవీంద్రన్  అతని సతీమణి దివ్య గోకుల్‌నాథ్‌లు 2011లో స్థాపించారు. ప్రారంభంలో వారు పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లను అందించారు. ఇది విజయవంతం కావడంతో 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించింది. అనతికాలంలోనే యాప్‌కు ఆదరణ దక్కడంతో రెండేళ్ల తర్వాత పిల్లల కోసం గణిత యాప్, వారి పురోగతిని ట్రాక్ చేసేలా తల్లిదండ్రుల కోసం మరో యాప్‌ను ప్రారంభించారు. 

2018 నాటికి బైజూస్ 1.5 కోట్ల మంది వినియోగదారులను కలిగి వుంది. దేశంలోని చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం యాప్ విస్తరించింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు , విద్యాసంస్థలు మూసినప్పుడు , పిల్లలు తప్పనిసరి పరిస్ధితుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు మారాల్సి వచ్చినప్పుడు బైజూస్‌నే ఆశ్రయించారు. శిఖరాగ్రానికి చేరిన బైజూస్.. 2021లో భారీ నష్టాన్ని నమోదు చేయడంతో దాని విలువ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆ పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల రాడార్ కిందకు చేరుకుంది. 

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో యాప్‌కు ఆదరణ తగ్గింది. అలాగే దాని పనితీరుపైనా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తమను బలవంతంగా ఖరీదైన కోర్సులను కొనుగోలు చేయించారని పలువురు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఖర్చులను తగ్గించుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను కూడా తొలగించుకోవాల్సి వచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో విదేశీ నిధులను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో బెంగళూరులోని బైజూస్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసింది. బైజూస్ చెల్లింపులు, రుణ ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ రుణదాతలు అమెరికాలోని కోర్టులను ఆశ్రయించడంతో కంపెనీ విదేశాల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంది. రుణదాతలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బైజూస్‌పై కేసు సైతం నమోదైంది.  

Follow Us:
Download App:
  • android
  • ios