న్యూఢిల్లీ: ఒకనాడు ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ, తాజాగా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లు సింగ్‌ సోదరులు.. కానీ ఫోర్టిస్ రుణ బకాయిలు, నిధుల దారి మళ్లింపుతో ఆ సంస్థ ప్రస్తుతం చేతులు మారే దశలో ఉన్నది. ఈ క్రమంలో సింగ్ సోదరుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తాజాగా తమ్ముడు శివీందర్‌ సింగ్‌ తనపై దాడి చేశాడని అన్న మల్వీందర్‌ సింగ్‌ ఆరోపించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియోలో ఈ ఆరోపణలు చేశారు. తమ్ముడు తనను కొట్టాడని, అసలు అతనికి నియంత్రణే లేదని.. కంపెనీకి రావాల్సిన బకాయిలకు అడ్డుగా నిలిచాడని అంతక్రితం ఆరోపించారు. దీంతో సోదరుల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. శివీందర్‌ పరిస్థితులను ఏ మాత్రం నియంత్రణలోకి తీసుకోలేడని.. పైగా గ్రూప్‌నకు రావాల్సిన బకాయిలను రాబట్టుకునే అంశంలో అడ్డుగా మారాడంటూ మల్వీందర్‌ ఆరోపించారు. ఈనెల 5వ తేదీన శివీందర్‌ సింగ్‌ తనపై దాడి చేయడంతో చేతుల మీద గాయాలయ్యాయని అన్నారు. 

‘ఆ కంపెనీకి శివీందర్‌ డైరెక్టర్‌ కాదు, ఉద్యోగి కాదు, వాటాదారు అంత కంటే కాదు. మరి ఏ హోదాలో వచ్చారు. కీలక సమావేశాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఏదో సందడి కనిపించగానే.. పరిస్థితులను అర్థం చేసుకునేందుకు నేను అక్కడకు వెళ్లాను. అక్కడి సభ్యులతో మాట్లాడుతుండగానే శివిందర్‌ ఆ గదిలోకి దుందుడుగా వచ్చి నన్ను కొట్టాడు. నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఫిర్యాదు చేయడం కోసం వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాను. నా పరిస్థితిని చూసి వాళ్లు రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇపుడు ఆ నొప్పి నుంచి, దిగ్భ్రాంతి నుంచి తేరుకుంటున్నా’ అని చెప్పారు. కుటుంబ జోక్యం, శివిందర్‌ క్షమాపణతో నేను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నానని ఆయన తెలిపారు.

అన్న మల్వీందర్ సింగ్ ఆరోపణలను శివీందర్‌ ఖండించారు. గ్రూప్‌ కంపెనీ ప్రియస్‌ రియల్‌ ఎస్టేట్‌ బోర్డు సమావేశంలో ఉద్యోగులను మల్వీందర్‌ సింగ్‌ వర్గం బెదిరిస్తోందన్న సమాచారంతో తాను అక్కడికి వెళ్లినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుందన్నారు. ఈ క్రమంలో మల్వీందర్‌ సింగ్‌ తనను బలవంతంగా గోడకు అదిమిపెట్టేయడంతో తప్పించుకునేందుకు ఆయన్ను పక్కకు తోసేశానని చెప్పారు. ఇంత జరిగాక మల్వీందర్‌తో కలిసి పనిచేసే మార్గాలన్నీ మూసుకు పోయినట్లేనని శివిందర్ సింగ్ స్పష్టం చేశారు. ‘ఇదో తప్పుడు, సిగ్గుమాలిన చర్య. నాపై బురద చల్లడమే ఇది’ అని శివిందర్‌ అన్నారు. ‘మా విలువల విషయంలో చాలా అంతరం ఉంది. మేం కలిసే ఏవైనా దారులు ఏవైనా ఉన్నా కూడా తాజా ఘటనతో అవి కూడా మూసుకుపోయాయ’ని పేర్కొన్నారు. 

‘డిసెంబరు 5న అసాధారణ బోర్డు సమావేశం సందర్భంగా మా కార్యాలయానికి నేను వెళ్లాను. మల్వీందర్‌ బంధువైన మరో బోర్డు సభ్యుడి అనవసర జోక్యం వల్ల ఒక బోర్డు డైరెక్టర్ సమావేశం నుంచి బయటకు వెళ్లడం గమనించాను. మల్వీందర్‌ కొంత మంది ఉద్యోగులతో బలవంతంగా వీడియో రికార్డ్‌ ప్రకటనలను నమోదు చేయడానికి ప్రయత్నించినట్లూ తెలిసింది. ఉద్యోగుల మంచి కోసం నేను ఆ గదిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని వెళ్లాను. నన్ను చూడగానే మల్వీందర్‌ కోప్పడ్డారు. నన్ను గోడకు నొక్కి ఊపిరాడకుండా చేయడానికి ప్రయత్నించారు. ఆత్మ సంరక్షణ కోసం నేను నెట్టానంతే’ అని తెలిపారు. ‘ఆ సంఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. ఈ విషయాలను గోప్యంగా ఉంచాలంటూ మా కుటుంబం కోరడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నా’ అని వివరించారు.

సింగ్‌ సోదరుల మధ్య వివాదం ఇప్పటిది కాదు. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో నిధుల మళ్లిం పు జరిగిందన్న ఆరోపణలు బయటపడినప్పటి నుంచి సింగ్‌ సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మల్వీందర్‌ సింగ్‌ ఫోర్జరీ, అవకతవక లకు పాల్పడ్డారని శివీందర్‌ సింగ్‌ ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత దైచీ శాంక్యోకు మధ్యవర్తిత్వ చెల్లింపు విషయంలో ఆ విభేదాలు మరింత పెరిగాయి. ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్‌ కొనుగోలు వివాదంలో దైచీకి తన వాటా అయిన రూ.3500 కోట్లను ఇవ్వడానికి శివిందర్‌ ఒప్పుకున్నారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీల, వాటాదార్ల ప్రయోజనాలను ఒక పద్ధతి ప్రకారం కాలరాస్తున్నారంటూ మాల్విందర్‌, రెలిగేర్‌ మాజీ అధిపతి సునీల్‌ గోధ్వానీలపై ఎన్‌సీఎల్‌టీ వద్ద శివిందర్‌ ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. తల్లి సలహా మేరకు సెప్టెంబర్  14వ తేదీన ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.