పేరుకున్న వాయుసేన బకాయిలు: అప్పుల ఊబిలోకి హెచ్ఏఎల్

First Published 6, Jan 2019, 4:28 PM IST
Broke HAL borrows Rs 1,000 crore to pay salaries to employees
Highlights

మహారత్న సంస్థగా పేరొందిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) కేవలం సిబ్బంది జీత భత్యాల చెల్లింపు కోసం రూ.1000 కోట్ల అప్పు చేసింది. సంస్థకు అతిపెద్ద కస్టమర్ భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) రమారమీ రూ.13 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండటం గమనార్హం.

ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కోంటోంది. సుదీర్ఘకాలంగా ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నసంస్థ తాజాగా ఉద్యోగులకు జీతాల చెల్లిపు, తదితర అవసరాల కోసం  రూ.1000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది.

20వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులకు  మూడు నెలల జీతాల చెల్లించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రెండు మూడు దశాబ్దాల కాలంగా మహారత్న జాబితాలో ఉన్న హెచ్‌ఏఎల్‌ సంస్థ తొలిసారి నగదు కోసం అప్పు (ఓవర్‌ డ్రాఫ్ట్‌ ద్వారా) చేసామని హెచ్‌ఏఎల్‌ ఛైర్మన్‌ ఆర్‌ మాధవన్‌ వ్యాఖ్యానించారు.

పుష్కలమైన ఆర్థిక నిల్వలతో ఉన్న సంస్థ తాజాగా లోటు బడ్జెట్‌లోకి జారుకుందని మాధవన్‌ పేర్కొన్నారు. మార్చికల్లా ఈ నగదు ప్రతికూలత  భరించలేనంత  స్థాయిలో రూ. 6వేల కోట్లకు చేరుకోనుందన్నారు. 

ప్రధానంగా హెచ్‌ఏఎల్‌కు అదిపెద్ద కస్టమర్‌గా ఉన్న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. దీనివల్లే తాము ఆర్థిక ఒత్తిడికి  దారి తీసినట్టు హెచ్ఎల్ ఛైర్మన్‌ మాధవన్ తెలిపారు. 2017 సెప్టెంబర్‌ నాటికి రూ. 14,500 కోట్ల బకాయిల్లో కేవల రూ. 2వేల కోట్లను మాత్రమే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చెల్లించింది. 

2017-18లో రక్షణశాఖకు ప్రభుత్వం 13,500 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. 2017-18 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయితో కలిపి సవరించిన బడ్జెట్ రూ. 33, 715 కోట్లకు చేరుకున్నది.

మరోవైపు డిసెంబరు 31వ తేదీ నాటికి రూ.15,700 కోట్లు తాకిన బకాయిలు వచ్చే మార్చి 31 నాటికి రూ. 20,000 కోట్లకు చేరవచ్చన్నారు. రూ. 14,500 కోట్లు ఐఏఎఫ్ చెల్లించాల్సి ఉండగా, మిగిలిన  బకాయిలు భారతీయ సైన్యం, నావికాదళం, కోస్తా గార్డ్స్‌ నుంచి రావాల్సి ఉంది. 

ఈ పరిణామం సంస్థపై ఆధారపడిన దాదాపు 20వేల మంది సూక్ష్మ, చిన్నమధ్య తరహా వ్యాపారస్తులను ప్రభావితం చేయనుందని హెచ్ఏఎల్ చైర్మన్ మాధవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

నగదు కొరత అప్పులువైపు నెడుతోందనీ, లేదంటే బకాయిలు చెల్లించమని  ఎంఎస్‌ఎఈలను బలవంతం చేయాలని, ఇది వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు.  కాగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,035. వీరికి చెల్లించే నెలవారీ జీతాల మొత్తం రూ.358 కోట్లుగా ఉన్నది. 

loader