Asianet News TeluguAsianet News Telugu

థెరెసా మేకు రిలీఫ్‌! బ్రెగ్జిట్‌కు గడువు పెంచిన ఈయూ

ఎట్టకేలకు బ్రిటన్‌ ప్రధాని థెరెస్సా మేకు కాసింత రిలీఫ్‌ లభించింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు అక్టోబర్‌ 31వ తేదీ వరకు గడువు లభించింది. ఈయూ కౌన్సిల్‌ సమ్మిట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నందుకు సభ్య దేశాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

Brexit update: EU agrees to extend UK departure to October 31
Author
London, First Published Apr 12, 2019, 11:25 AM IST

లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు (బ్రెగ్జిట్) రావడానికి ఉన్న గడువు మరోసారి పొడిగించారు. ఈ డెడ్‌లైన్‌ను ఆరు నెలలు పొడిగిస్తూ అక్టోబర్ 31 దాకా ఈయూ సభ్యదేశాలు సమయమిచ్చాయి. నిజానికి గత నెల 29వ తేదీన బ్రెగ్జిట్ ప్రక్రియ ముగియాలి. 

కానీ దీన్ని ఈ నెల 12 వ తేదీ వరకు పొడిగించారు. శుక్రవారంతో ఈ గడువు ముగియనున్న క్రమంలో గురువారం బ్రిటన్‌కు ఈయూ సభ్య దేశాలు అక్టోబర్ 31 వరకు గడువిచ్చినట్లు తెలిపాయి. 28 దేశాల ఈ ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

2016 జూన్ 23న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 51.9 శాతం బ్రిటన్‌ వాసులు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన సంగతి విదితమే. అయితే బ్రెగ్జిట్ వ్యతిరేకుల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు బ్రిటన్ సర్కారును ముందుకెళ్లకుండా చేస్తున్నాయి. 

ప్రతికూల పరిస్థితుల నడుమ బ్రెగ్జిట్ కష్టంగా పరిణమిస్తుండగా, ప్రధాని థెరిసా మేకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. కాగా, తొలుత జూన్ ఆఖరుకల్లా బ్రెగ్జిట్ జరుగుతుందని మే భావించారు. 

కానీ అదంత సులువుగా కనిపించకపోవడంతో అక్టోబర్ 31దాకా గడువివ్వాలన్న థెరెస్సా మే ప్రతిపాదనకు ఈయూ దేశాధినేతలు అంగీకరించారు. దీనిపై యూరోపియన్ కౌన్సిల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ఈ మేరకు వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

మరోవైపు బ్రిటన్, బ్రెగ్జిట్‌పట్ల యూరోపియన్‌ యూనియన్ (ఈయూ) తీరు చాలా కఠినతరంగా ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూరోపియన్ యూనియన్ వైఖరి చాలా బాధాకరమని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఐరోపా దేశాల కూటమిపైనా ట్రంప్ వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. 

అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్నారంటున్న ట్రంప్.. ఇటీవలే యూరోపియన్ దిగుమతులపై 11 బిలియన్ డాలర్ల సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థకు రాయితీలు ఇవ్వబోమని చెప్పారు.

బ్రెగ్జిట్ గడువును మరోసారి పొడిగించడాన్ని బ్రిటన్ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభానికి గురికా కుండా కాపాడిందని బ్రిటన్ పరిశ్రమల సమాఖ్య (సీబీఐ) అభిప్రాయపడింది. 

బ్రెగ్జిట్ అనిశ్చితిని తొలగించాలని, ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి కృషి చేయాలని బ్రిటన్ ప్రధాని థెరిసా మేను సీబీఐ డైరెక్టర్ జనరల్ కార్లోన్ ఫెయిర్‌బైర్న్ కోరారు. ఈ కష్టకాలంలో అంతా ఒక్కటైతేనే దేశం వృద్ధిపథంలో వెళ్తుందని, ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయని హితవు పలికారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios