Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడే టార్గెట్.. జీఎస్టీ రేట్లకు రెక్కలు?

వివిధ వస్తు, సేవలపై పన్ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ వస్తువుల శ్లాబ్ లు పెంచినా.. సామాన్యుడు కొనుగోలు చేసే వస్తువులపై గల 5 శాతం శ్లాబ్ ను ఆరు శాతంగా మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్నది.  కనీసం రూ.లక్ష కోట్ల మేరకు పన్ను వసూళ్లు పెంచుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తున్నది. 
 

Brace for rise in GST rates as Centre looks at Rs 1 lakh crore additional revenue
Author
Hyderabad, First Published Dec 9, 2019, 12:56 PM IST

న్యూఢిల్లీ: రెవెన్యూ లోటుతో కేంద్ర ప్రభుత్వం సతమతం అవుతున్నది. ఆదాయం పెంచుకునే మార్గాలను సర్కార్ అన్వేషిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇందులో భాగంగా జీఎస్టీని పునర్వ్యవస్థీకరించి పన్ను రేటు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే జీఎస్టీ పెంచి, వ్యక్తిగత ఆదాయం పన్ను తగ్గిస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. 

జీఎస్టీ మండలి సమావేశం అంటే సాధారణంగా పన్ను రేట్ల తగ్గింపు ఉంటుంది. కానీ త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రేట్ల పెంపునకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఈ వస్తు, సేవల పన్ను.. ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండి కొడుతున్నది మరి. 

దీంతో జీఎస్టీలోని వస్తు, సేవలపై పన్నులను పెంచాలని మోదీ సర్కార్ యోచిస్తున్నది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ నినాదంతో దాదాపు రెండున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆర్బాటంగా అమలులోకి తెచ్చిందే ఈ చారిత్రాత్మక సంస్కరణ. 

also read ఆర్బీఐకి ‘ఉల్లి’ ఘాటు...వరుస కోతలకు ‘ధరల’ బ్రేక్’

అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టాల్లో ఉన్న డజనుకుపైగా పన్నులను ఏకం చేసి పరిచయం చేసిన జీఎస్టీ పరిధిలో 500లకుపైగా సేవలు, 1,300లకుపైగా వస్తువులు ఉన్నాయి. 0, 5, 12, 18, 28 శాతాల్లో ఆయా వస్తు, సేవలపై పన్నులను విధించారు. బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను వేయగా, విలువైన ముడి రత్నాలు, రాళ్లపై కనిష్ఠంగా 0.25 శాతం పన్ను నిర్ణయించారు. 

ఇక పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చని  కేంద్రం.. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితరాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ జీఎస్టీతో ఖజానాకు పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అమాంతం పడిపోయింది. మరోవైపు జీఎస్టీ వల్ల ఆదాయాన్ని కోల్పోతున్న రాష్ర్టాలకు ఐదేళ్లు నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. 

రెవెన్యూ అంచనాలకు అనుగుణంగా రాక కేంద్రం పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ఆగస్టు నుంచి రాష్ర్టాలకు జీఎస్టీ నష్టపరిహారం అందడం లేదు. మీ నష్టాలకు మేం పరిహారం చెల్లించలేమని కూడా రాష్ర్టాలకు కేంద్రం చెప్పేసింది. జీఎస్టీ వసూళ్ల క్షీణతకుతోడు ఆర్థిక మందగమనం పరిస్థితులూ కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

దీంతో పన్ను మినహాయింపు ఇచ్చిన వస్తు, సేవలపై తిరిగి పన్నులను వేయాలన్న నిర్ణయానికి మోదీ సర్కారు వస్తున్నట్లు సమాచారం. జీఎస్టీ భారమైన రంగాల విజ్ఞప్తులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయా వస్తు, సేవలపై పన్నును కేంద్రం ఇన్నాళ్లూ తగ్గిస్తూ వచ్చింది. దీంతో గరిష్ఠ పన్ను రేటు 28 శాతం శ్లాబులో అతికొద్ది వస్తూత్పత్తులే మిగిలాయి. 

పైగా చాలావాటికి పన్ను నుంచి మినహాయింపునూ ఇచ్చారు. దీంతో నెలసరి వసూళ్లు రాన్రాను పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జీఎస్టీ ఆదాయాన్ని దాదాపు మరో లక్ష కోట్ల రూపాయల మేర పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. శ్లాబులను మార్చి, పన్ను రేట్లను పెంచి, కొత్త పన్నులను విధించడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సర్కార్ ప్రధాన ఆలోచన. 

18 శాతం శ్లాబులోకి కనీసం 243 వస్తువులు చేరే వీలుందని తెలుస్తుండగా, దీనివల్ల వినియోగదారులపై భారం పడినా.. ఖాజానాకు కాసుల వర్షం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయా వస్తువులపై నేరుగా కాక వాటి ముడి సరుకులపై పన్నులను పెంచాలని కూడా కేంద్రం యోచిస్తున్నది.

జీఎస్టీ భారం పెరిగితే ప్రజల్లో ఆందోళనలు ఖాయమన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవనశైలిని పెంపు నిర్ణయం ప్రభావితం చేస్తుందన్న భయాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకూ ఇది దారితీయవచ్చన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

అటు ఆర్థిక మందగమన పరిస్థితులున్న వేళ జీఎస్టీ భారం పెంచితే ఇబ్బందన్న కోణంలో కేంద్రం కూడా ఆలోచిస్తున్నది. దీంతో మొదట లగ్జరీ ఉత్పత్తులపై పన్ను పెంచాలని, చివరకు సామాన్యులను ప్రభావితం చేసే వస్తు, సేవల జోలికి వెళ్లాలని మోదీ సర్కారు అనుకుంటున్నది. మొత్తానికి ఇప్పుడు అందరి చూపు.. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంపైనే నెలకొన్నది.

also read కార్పొరేట్‌ పన్నుల భారం తగ్గిస్తూ.... పార్లమెంటు ఆమోదం

వివిధ వస్తూత్పత్తులు, సేవలపై తిరిగి పన్ను వేయాలని చూస్తున్న కేంద్రం.. శ్లాబులను పునర్‌వ్యవస్థీకరించాలని కూడా చూస్తున్నది. ఈ నెల 18వ తేదీన జీఎస్టీ మండలి సమావేశం కానున్నది. ఈ భేటీలో ఆదాయం పెంపుపై ప్రధానంగా చర్చించనున్నారు. 

జీఎస్టీ కనీస శ్లాబు రేటును 5 శాతం నుంచి 9-10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకునే వీలుందని ఓ జాతీయ వార్తా దినపత్రిక చెబుతున్నది. 12 శాతం శ్లాబును తొలగించే అవకాశాలూ ఉన్నాయని తెలుస్తున్నది. అంతేగాక కొన్ని వస్తువులను ఎగువ శ్రేణి శ్లాబుల్లోకి మార్చడంతోపాటు పన్నులేని వస్తు, సేవలకు పన్ను వేయాలని నిర్ణయించే వీలుందని సమాచారం.

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల్లో అత్యధికం ఐదు శాతం శ్లాబ్ పరిధిలో ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో ఐదు శాతం ఆదాయం ఈ శ్లాబ్ ద్వారానే వస్తున్నది. పన్ను తగ్గింపుతో జీఎస్టీ వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నెల 18న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఐదు శాతం శ్లాబ్ కాస్తా ఆరుశాతానికి పెంచే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఇలా ఐదు శాతం శ్లాబ్‌ను ఆరు శాతానికి పెంచడంతో ప్రభుత్వానికి నెలకు రమారమీ రూ.1000 కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుంది. కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో కాసింత పెరిగాయి. గత నెలలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటి రూ.1.03 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios