ముంబై: వరుసగా వడ్డీరేట్లలో కోతలు విధిస్తూ వచ్చిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ)కి తాజాగా ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన ఉల్లి ధరలు అడ్డుగా నిలిచాయి. మార్కెట్‌లో ఠారెత్తిస్తున్న ఉల్లిగడ్డ ధర.. ద్రవ్యోల్బణం అంచనాల్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. కిలో ఉల్లి ధర దేశవ్యాప్తంగా సెంచరీ కొడుతున్న విషయం తెలిసిందే. 

దాంతో, ఆర్‌బీఐ ఈసారి సమీక్షలో తాత్కాలిక విరామం తీసుకున్నది. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు రెపో రేట్లను మరోసారి తగ్గించవచ్చన్న మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా ద్రవ్యోల్బణానికి ప్రాధాన్యం ఇస్తూ యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. 

తద్వారా వృద్ధి పునరుద్ధరణ కంటే ధరాఘాతం నియంత్రణకే పెద్దపీట వేసింది. ఇది స్వల్ప విరామమేనని, వృద్ధి పునరుద్ధరణకు అవసరమైతే వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తామని సంకేతాలిచ్చింది. వచ్చే ఏడాదిలో ఆర్‌బీఐ రెపోను 0.60-0.70 శాతం మేర తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అనూహ్యంగా గతేడాది ఆర్బీఐ పగ్గాలు చేపట్టిన శక్తికాంత దాస్.. జీడీపీ బలోపేతానికి కీలక వడ్డీరేట్లను వరుసగా తగ్గిస్తూపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన ఐదు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో రేటు 135 బేసిస్ పాయింట్లు దిగివచ్చింది. 

also read మీ చుట్టు రోజూ తిరుగలేం...జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

ఇటీవల ఎన్నడూ లేనివిధంగా ఓసారి 35 బేసిస్ పాయింట్లను తగ్గించిన సంగతీ విదితమే. కానీ వృద్ధిరేటు పుంజుకోవడం మాటటుంచితే ద్రవ్యోల్బణం కోరలు చాస్తుండటం ఆర్బీఐని కలవరపెట్టింది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ఐదో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈసారి వడ్డీరేట్ల జోలికి వెళ్లకూడదని ఆరుగురు సభ్యులున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ముక్తకంఠంతో తీర్మానించింది. 

మూడు రోజులపాటు జరిగిన ఈ సమీక్ష వివరాలను గురువారం ఆర్బీఐ వెల్లడించింది. కమిటీ ఏకగ్రీవ నిర్ణయం వల్లే వరుస వడ్డీరేట్ల కోతలకు బ్రేకులు పడ్డాయి. ద్రవ్య సమీక్ష అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ దాస్ మాట్లాడుతూ బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి తమ నిర్ణయాల ప్రయోజనాలను ఖాతాదారులకు అందించారని హర్షం వ్యక్తం చేశారు.

ఎప్పట్నుంచో ఆర్బీఐ ఆశిస్తున్నట్లుగా రెపో ఆధారిత రుణాల వడ్డీరేట్ల విధానాన్ని బ్యాంకులు అమలుపరుచడం బాగుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇక వృద్ధిరేటు మందగమనంపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆర్బీఐ పనిచేస్తున్నదని చెప్పారు. ద్రవ్యలోటు లక్ష్యాలను ప్రభుత్వం అందుకోబోదన్న దానిపై తమకు ఎలాంటి దిగులూ లేదన్నారు. డిజిటల్ కరెన్సీ జారీపై ఇప్పుడే మాట్లాడబోమన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ వ్యతిరేకమని, వాటిని అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

పీర్ 2 పీర్ రుణదాతల కోసం రుణ పరిమితిని ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం రూ.10 లక్షలుగా ఉంటే, రూ.50 లక్షలకు పెంచింది. రూ.500 కోట్లకుపైగా ఆస్తులను కలిగి ఉన్న సహకార బ్యాంకులను సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ) కిందకు తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.

మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సమస్యలను ఆర్బీఐ పరిశీలిస్తున్నదని డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ తెలిపారు. ఈ వారంలో హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌ నెట్‌ బ్యాంకింగ్‌ వరుసగా రెండు రోజులు క్రాష్‌ కావడం వెనక కారణాలను పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ తెలిపారు. ఈ సమస్యకు గల కారణాలను గుర్తించేందుకు తమ బృందం వెళ్లిందని చెప్పారు. సోమ, మంగళవారాల్లో హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌ ఖాతాదారులు నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధాని (అక్టోబర్-మార్చి)కి ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ పెంచేసింది. 5.1-4.7 శాతంగా నమోదు కావచ్చన్నది. ఇంతకుముందు 3.5-3.7 శాతంగానే ఉండొచ్చని చెప్పింది. కానీ ఇటీవల పెరిగిన కూరగాయల ధరలు.. ద్రవ్యోల్బణానికి సెగ పెడుతున్నాయి. ముఖ్యంగా ఉల్లిగడ్డ ధర.. ఈసారి ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలకు బ్రేకులు వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

టమాట ధర కూడా ఆందోళనకరంగా ఉండటంతో ఆహార ద్రవ్యోల్బణం భయాలు ఆర్బీఐని చుట్టుముట్టాయి. ఖరీఫ్ సీజన్ ఆఖరుకల్లా మార్కెట్‌లోకి సరఫరా పెరిగితే కొంత ఉపశమనం లభించవచ్చన్న అంచనాలున్న ఆర్బీఐ మాత్రం రిస్క్ తీసుకోలేదు. దీంతోనే వడ్డీరేట్ల జోలికి వెళ్లలేకపోయింది.

ద్రవ్యసమీక్ష జరిగిన ప్రతీసారి ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందని అనుకోవద్దంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అంతకుముందు వరుసగా ఐదు ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించింది. ఈ క్రమంలో ఈసారీ వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరూ ఊహించని రీతిలో వడ్డీరేట్ల కోతలకు ఆర్బీఐ బ్రేకేసింది. అదేపనిగా వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశించొద్దన్నారు. 

బడ్జెట్ తర్వాత వడ్డీరేట్ల కోతలకు అవకాశాలున్నాయన్న సంకేతాలనిచ్చారు. ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్నందున కొంతకాలం వరకు వడ్డీరేట్ల కోతలుండవన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ విరామ సమయంలో తాము గతంలో తగ్గించిన వడ్డీరేట్ల ప్రభావాన్ని విశ్లేషించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ దాస్ చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 5 శాతానికే పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అక్టోబర్ సమీక్షలో ఇది 6.1 శాతంగా ఉండటం గమనార్హం. ఆర్థిక మందగమనం, దిగజారిన వినియోగ సామర్థ్యం, దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య భారత వృద్ధిరేటు నిరాశాజనకమేనని ఆర్బీఐ అభిప్రాయపడింది. 

ఈ జూలై-సెప్టెంబర్‌లో జీడీపీ 4.5 శాతానికి పతనమైన విషయం తెలిసిందే. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో జీడీపీ 5.9-6.3 శాతంగా ఉండొచ్చన్న ఆర్బీఐ.. ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో 4.9-5.5 శాతంగా నమోదు కావచ్చన్నది.

ఓ సరికొత్త ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్స్‌ట్రూమెంట్ (పీపీఐ)ను దేశ ప్రజలకు పరిచయం చేయాలని ఆర్బీఐ చూస్తున్నది. వస్తు, సేవల లావాదేవీల కోసం మాత్రమే దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని పరిమితి విలువ రూ.10 వేలు. డిజిటల్ చెల్లింపుల్లో పీపీఐలు కీలక పాత్ర పోషించగలవని ఆర్బీఐ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నది.

పీపీఐలకు ఉన్న ఆదరణనుబట్టి కార్డు వినియోగానికి సంబంధించి వెసులుబాటు కల్పిస్తామని రిజర్వ్ బ్యాంక్ చెబుతున్నది. వీటి లోడింగ్, రీలోడింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి మాత్రమే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ నెలాఖర్లోగా ఈ కార్డుల విషయమై మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రకటించింది.
 
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు (ఎస్ఎఫ్బీ) ఆన్‌-టాప్‌ లైసెన్సుల జారీ విషయమై ఆర్‌బీఐ గురువారం తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందుకు కనీస మూలధన పెట్టుబడిని రెట్టింపు స్థాయి రూ.200 కోట్లకు పెంచింది. తొలుత అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, ఎన్‌బీఎ్‌ఫసీ, సూక్ష్మ రుణ సంస్థ, స్థానిక బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంక్‌గా కార్యకలాపాలు కొనసాగించి ఎస్ఎఫ్బీగా మారిన వాటికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. 

ఐదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న పేమెంట్‌ బ్యాంకులు సైతం ఎస్ఎఫ్బీలుగా మారేందుకు అర్హత కల్పించింది. దేశంలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు 2014 నవంబరులో ఆర్‌బీఐ 10 కంపెనీలకు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లైసెన్సులు జారీ చేసింది. పీఎంసీ బ్యాంక్‌ తరహా కుంభకోణాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు చేపట్టింది. 

రూ.500 కోట్ల ఆస్తులున్న సహకార బ్యాంకులను సీఆర్‌ఐఎల్‌సీ రిపోర్టింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ పరిధిలోకి చేర్చుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకులు, బడా ఎన్‌బీఎ్‌ఫసీల్లో ఒత్తిడిలో ఉన్న ఆస్తులను గుర్తించేందుకు వీలుగా సెంట్రల్‌ రిపాజిటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్‌ (సీఆర్‌ఐఎల్‌సీ)ని ఏర్పాటు చేసింది ఆర్‌బీఐ. బడా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తాము మంజూరు చేసే పెద్ద మొత్తం రుణాలపై ఈ వ్యవస్థ ద్వారా రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

also read ప్లగింగ్ ద్వారా 2.7 టన్నుల ప్లాస్టిక్ సేకరించిన "రన్ టు మేక్ కంట్రీ ఫ్రీ"
 
పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణంపై ఫోరెన్సిక్‌ దర్యాప్తు నివేదిక ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి రావచ్చు. దర్యాప్తు నివేదికను పరిశీలించాక ఈ బ్యాంక్‌పై చేపట్టాల్సిన తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపింది ఆర్బీఐ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన పీఎంసీ బ్యాంక్‌పై సెప్టెంబరు 23న ఆర్‌బీఐ పలు ఆంక్షలు విధించింది. అంతేకాదు, బ్యాంక్‌ బోర్డును రద్దు చేసి, తన తరఫున పర్యవేక్షణ అధికారిని నియమించింది.

ఒక ఆర్బీఐ ద్రవ్య సమీక్షపై ఎవరేమన్నారో ఒకసారి పరిశీలిద్దాం.. ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పందిస్తూ ‘వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా కీలక రేట్లను యథాతథంగా ఉంచటం సరైన చర్యగా భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం పెరుగడం వల్లే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించలేకపోయింది. జీడీపీ క్షీణిస్తున్నా.. ద్రవ్యోల్బణం భయాలకే పెద్దపీట వేసింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి’ అని తెలిపారు. 

ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమాని స్పందిస్తూ ‘వడ్డీరేట్లను తగ్గించకపోవడం నిరాశను కలిగించింది. వృద్ధిరేటుకు అనుగుణంగా ఆర్బీఐ ద్రవ్యసమీక్ష కొనసాగాల్సిన అవసరం ఉన్నది’ అని పేర్కొన్నారు. అసోచామ్ అధ్యక్షుడు బీకే గోయెంకా ప్రతిస్పందిస్తూ ‘ఈ విరామం తాత్కాలికమైనదేనని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం గణాంకాలు ఇప్పటికీ ఆర్బీఐ ఆమోదయోగ్య పరిధిలోనే ఉన్నాయి’ అని వెల్లడించారు. 

పీహెచ్‌డీ చాంబర్ అధ్యక్షుడు డీకే అగర్వాల్ మాట్లాడుతూ ‘పెట్టుబడులకు ఊతమిచ్చే, ఉత్పత్తి విస్తరణకు ప్రోత్సాహాన్నిచ్చే విధానాలను ఆర్బీఐ అనుసరించాలి. పరిశ్రమకు రుణాలు అందాలి’ అని చెప్పారు. నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హీరానందని స్పందిస్తూ.. ‘ఆర్బీఐ నిర్ణయం అసంతృప్తిని కలిగించింది. రెపో రేటును 1 శాతం తగ్గించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే గృహ రుణాలు చౌకవుతాయి’ అని తెలిపారు. అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ ‘నిర్మాణ రంగం నిరుత్సాహకరంగా కొనసాగుతున్నది. మునుపెన్నడూ లేనివిధంగా గృహ రుణాల డిమాండ్ 8 శాతం దిగువకు చేరింది. ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గితే బాగుండేది’ అని వ్యాఖ్యానించారు.