మోదీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్..రూ. 315 లక్షల కోట్లు దాటిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.315 లక్షల కోట్లకు చేరుకుంది. బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్ దేశీయ స్థూల ఆర్థిక డేటా ప్రోత్సాహకంగా ఉన్న కారణంగా సరికొత్త రికార్డుల దిశగా మార్కెట్ అడుగులు వేస్తోంది.
ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో సోమవారం దేశ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. తాజాగా బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.315 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే సోమవారం BSE బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 30 సూచీ 240.98 పాయింట్లు లాభంతో 65,628.14 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల మూలధనం రూ.5,41,951.7 కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.3,15,01,090.40 కోట్లకు పెరిగింది. ఇది బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.