Asianet News TeluguAsianet News Telugu

జెట్‌స్పీడ్‌లో బోయింగ్ దిద్దుబాట: 600$ బిలియన్ల ఆర్డర్లు గోవిందా!!

ఆరు నెలల్లో రెండు విమాన ప్రమాదాల్లో విమానాల తయారీ సంస్థ బోయింగ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆగమేఘాలపై సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడంపై బోయింగ్ యాజమాన్యం కేంద్రీకరించింది. 

Boeing's 737 Max revamp could cost it $2.5 bn in best-case scenario
Author
Washington, First Published Mar 18, 2019, 10:49 AM IST

వ్యాపార పునాదులు కదిలిపోతుండటంతో అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పదిరోజుల్లో 737మాక్స్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల్లో అప్‌గ్రేడ్‌చేసిన సాఫ్ట్‌వేర్‌తో బోయింగ్‌ 737మాక్స్‌లు గాల్లోకి ఎగురుతాయని బోయింగ్ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైతే వేగంగా అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉంది.  

అవును మరి.. ఇండోనేషియాకు చెందిన లయన్‌ ఎయిర్‌ విమానం, ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదాలు బోయింగ్‌ వ్యాపారాన్నే కుదిపేస్తున్నాయి. ఈ రెండు ప్రమాదాలతో బోయింగ్‌ ‘737మాక్స్‌ 8’ మోడల్‌పై నీలినీడలు కమ్ముకొన్నాయి. 

ఇప్పటికే ఈ మోడల్‌ విమానాల కోసం దాదాపు  600 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41లక్షల కోట్లు) విలువైన ఆర్డర్లు బోయింగ్‌ వద్ద ఉన్నాయి. రెండు విమాన ప్రమాదాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆర్డర్లు ఇచ్చిన ఎయిర్‌లైన్స్‌ సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. 

ఇండోనేషియాకు చెందిన  లయన్‌ సంస్థ దాదాపు 22 బిలియన్‌ డాలర్లు విలువైన ఆర్డర్‌ను రద్దు చేసుకోనుంది.  రష్యాకు చెందిన మరో ఎయిర్‌లైన్స్‌ సంస్థ విమానాల డెలివరీ తీసుకోవడానికి ముందే తమకు హామీ కావాలని పట్టుబడుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ఓ విమానయాన సంస్థ 5.9బిలియన్‌ డాలర్లు విలువైన ఆర్డర్‌ కూడా రద్దయ్యే పరిస్థితి నెలకొంది. 

బోయింగ్‌ విమానాల్లో అమర్చిన యాంగిల్‌ ఆఫ్‌ అటాక్‌ సెన్సర్‌ నుంచి వచ్చే సందేశాలను కచ్చితంగా విశ్లేషించేలా ఇంజినీర్లు మార్పులు చేయనున్నారు. ఒక సెన్సర్‌ నుంచి రాగానే విమానంలోని ఎంకాస్‌ సాఫ్ట్‌వేర్‌ స్పందించకుండా తోక వద్ద ఉండే రెండో సెన్సర్‌ సమాచారాన్ని కూడా క్రోడికరించుకొని స్పందించేలా మార్పులు చేయనున్నారు. 

గతంలో లయన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రమాద సమయంలో కూడా ఈ సెన్సర్‌ నుంచి వచ్చిన గందరగోళ సందేశాల వల్లే 12సార్లు నేలవైపునకు దూసుకుకెళ్లింది. తాజా మార్పులతో ఈ సందేశాలను కచ్చితంగా క్రోడికరించుకొనే అవకాశం ఉంటుందని బోయింగ్‌ భావిస్తోంది.  

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 350 బోయింగ్‌ 737 మాక్స్‌లు  ఎగరక పోవడంతో పాత విమానాలకు డిమాండ్‌ పెరిగింది. 737 మాక్స్‌కు ముందు వినియోగించిన 737 ఎన్‌జీ(నెక్స్ట్‌ జనరేషన్‌) మోడల్ విమానాలకు డిమాండ్‌ పెరిగింది.

దీంతో వాటి లీజ్‌, అద్దె ధరలు దాదాపు 10శాతం మేరకు పెరిగాయి. దీంతో 10 ఏళ్లనాటి 737 ఎన్‌జీ నెల అద్దె 2 లక్షల డాలర్ల నుంచి 2.5లక్షల డాలర్లకు మధ్యలో ఉంది. సాధారణ రోజుల్లో కంటే ఇది 10 శాతం ఎక్కువ.

ప్రస్తుతం ఆగమేఘాలపై సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడానికి 500 మిలియన్ల డాలర్ల నిధులను బోయింగ్ ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు ఇప్పటికే వివిధ దేశాలకు అందజేసిన విమానాల్లో సాఫ్ట్ వేర్ రీప్లేస్ మెంట్, రీయంబర్స్ మెంట్ ప్రక్రియలో జాప్యం వల్ల వివిధ విమానయాన సంస్థలు రెండు బిలియన్ల డాలర్లు నష్టపోవాల్సి రావచ్చు.

రేపు సాఫ్ట్ వేర్ సమస్య పరిష్కారమైన తర్వాత అమెరికాకు చెందిన పైలట్లు వివిధ దేశాల విమానయాన సంస్థల పైలట్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పిదాలను అధిగమించేందుకు బోయింగ్ 737 మ్యాక్ 8 మోడల్ విమానాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బోయింగ్ యాజమాన్యం అంగీకారానికి వచ్చాయి. ఇందుకోసం సంబంధిత పైలట్లకు అదనపు శిక్షణ అందించాలని నిర్ణయించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios