న్యూయార్క్: ఇప్పటికే ఇంటర్నేషనల్ గ్లోబల్ విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్’ పలు చిక్కుముళ్లను ఎదుర్కొంటున్నది. ఇటీవలి కాలంలో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానంలో సాంకేతిక లోపంతో పలు ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా అదే బోయింగ్ 737 మ్యాక్స్ మరో కొత్త లోపాన్ని గుర్తించామని ప్రకటించింది. 

అయితే ఇది చిన్న లోపం మాత్రమేనని బోయింగ్ పేర్కొన్నది. దీన్ని వీలైనంత త్వరగా సరి చేయడానికి ప్రయత్నిస్తామని బోయింగ్ వెల్లడించింది. తాజాగా తలెత్తిన సమస్య వల్ల తమ బోయింగ్ 747 మ్యాక్స్ విమానాలను తిరిగి విమానయాన సేవల్లో చేర్చాలని తాము నిర్దేశించుకున్న గడువుపై ఎటువంటి ప్రభావం ఉండబోదని వెల్లడించింది. 

also read   స్మాల్ సేవింగ్స్‌పై కేంద్రమంత్రి నజర్... 2.5 లక్షల వరకు రాయితీ...!

సాఫ్ట్ వేర్‌లో తాజాగా తలెత్తిన లోపం, దానిని సవరించడానికి తాము తీసుకుంటున్న చర్యలపై ఫెడరల్ ఏవియేషన్‌కు నివేదిక సమర్పించామని బోయింగ్ తెలిపింది. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణ సేవలు అందించడమే తమ తొలి ప్రాధాన్యం అని పేర్కొన్నది. 

గత వారం నిర్వహించిన టెక్నికల్ సమీక్షలో తాజా సమస్యను చేర్చలేదని బోయింగ్ తెలిపింది. విమానాన్ని అదుపు చేసే సాఫ్ట్ వేర్, సిమ్యులేటర్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరి చేయడానికి ఇప్పటికే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సేవల నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్ విమానాలకు సంబందించి రెండు భారీ ప్రమాదాలు జరిగాయి. ఈ రెండు ప్రమాదాల్లో 346 మంది ప్రయాణికులు మరనించారు. 

also read రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్... ఉచితంగా కొత్త సర్వీస్

రెండు భారీ విమాన ప్రమాదాల తర్వాత పలు దేశాలు, విమానయాన సంస్థలు కూడా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల వినియోగంపై నిషేధం విధించాయి. బోయింగ్ విమాన సంస్థ కూడా సదరు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు భారీగా కసరత్తు చేస్తోంది. 

అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అధికారులు కూడా బోయింగ్ తాజా సాఫ్ట్ వేర్ సమస్య పరిష్కారానికి చర్య ఎలా తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు సాంకేతిక సమస్య వల్ల మార్చి వరకు బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపివేసిన అమెరికా ఫెడరల్ ఏవియేషన్ (ఎఫ్ఎఎ) తాజాగా ఏప్రిల్ వరకు తుది నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.