బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత కుబేరుల జాబితాలో భారత కుబేరుడు ముఖేష్ అంబానీ 10 స్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో గౌతం అదానీ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే టాప్ 10 సంపన్నుల జాబితాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ పేరు లేదు.

బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ సంపన్నుల జాబితా(Bloomberg Billionaires Index)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ (Mukesh Ambani Net Worth) 89.4 బిలియన్ డాలర్లుగా (రూ. 68,39,62,74,60,000)గా అంటే దాదాపు 6.83 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.

ఈ జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 11వ స్థానంలో నిలిచారు. ఆయన (Gautam Adani Net Worth) మొత్తం నికర ఆస్తుల విలువ 86 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అంటే మన కరెన్సీలో 6.57 లక్షల కోట్లు రూపాయలుగా అంచనా వేశారు.

మస్క్ మొదటి స్థానంలో నిలిచాడు. 
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ సంపద (Elon Musk Net Worth)ఇప్పుడు 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మార్చి 15, 2022న, మస్క్ ఆస్తుల నికర విలువ 199 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయితే ఈ లిస్ట్‌లో మాత్రం మొదటి స్థానంలోనే ఎలాన్ మస్క్ కొనసాగుతున్నాడు. ఈ సూచికలో రెండవ స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ (Jeff Bezos) మొత్తం నికర విలువ 3.74 బిలియన్లకు తగ్గి, మొత్తం నికర విలువ 166 బిలియన్లకు తగ్గింది. 

టాప్ 10 సంపన్నులలో 8 మంది అమెరికన్లే..
ప్రపంచంలోని 10 మంది పెద్ద సంపన్నులలో 8 మంది అమెరికన్లు ఉండటం విశేషం. అయితే ఈ జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ (3వ స్థానం), ముకేశ్ అంబానీ మాత్రమే అమెరికాయేతరులుగా ఉన్నారు. జాబితాలోని అమెరికనల్లో (మొదటి), బెజోస్ (రెండు), బిల్ గేట్స్ (నాలుగు), వారెన్ బఫెట్ (ఐదు), లారీ పేజ్ (ఆరు), సెర్గీ బ్రిన్ (ఏడు), స్టీవ్ బాల్మెర్ (ఎనిమిది), లారీ ఎలిసన్ (తొమ్మిది) స్థానాల్లో ఉన్నారు.

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ టాప్ 10 నుంచి మాయం...
టాప్ 10 సంపన్నుల జాబితాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ పేరు లేదు. ఆయన 13వ స్థానానికి పడిపోయాడు. అతని నికర విలువ 71.1 బిలియన్లుగా అంచనా వేశారు. అదే సమయంలో, చైనాలోని అత్యంత ధనవంతుడు, జాంగ్ షన్షాన్ నికర విలువ ఐదు బిలియన్ డాలర్లు తగ్గింది 60.3 బిలియన్ల నికర విలువతో, అతను ఈ జాబితాలో 18వ స్థానంలో ఉన్నాడు.