ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ రుణభారాలను తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. అందుకోసం తమ లాయల్టీ ప్రోగ్రాం ‘జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్’లో వాటాల విక్రయ అంశం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ రుణభారాలను తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. అందుకోసం తమ లాయల్టీ ప్రోగ్రాం ‘జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్’లో వాటాల విక్రయ అంశం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసిన వెంటనే ఈ వాటాల కొనుగోలుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ‘బ్లాక్‌స్టోన్’ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఒప్పందం గానీ కుదిరితే జెట్ ప్రివిలేజ్ సంస్థ వ్యాల్యుయేషన్ రూ. 3,000 కోట్లు– రూ. 4,000 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాల కథనం.
విదేశీ రుణభారం తగ్గించుకునే యత్నాల్లో జెట్ ఎయిర్ వేస్
విదేశీ రుణభారం తగ్గించుకునే యత్నాల్లో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ సుమారు రూ. 5,000 కోట్ల సమీకరణకు ఇప్పటికే ఎస్బీఐ కన్సార్షియాన్ని సంప్రదించినట్లు సమాచారం. తరచూ జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించే వారికి లాయల్టీ, రివార్డ్ పాయింట్లు మొదలైన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
భారం తగ్గించుకునే మార్గం చెప్పాలని జెట్ ఎయిర్‌వేస్‌ను కోరిన పైలట్లు
మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అనుసరించే వ్యూహాలు తమకు తెలియజేయాలని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు సంస్థ యాజమాన్యాన్ని కోరాయి. ఇటీవల వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంతోపాటు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని సంస్థ వాటాదారుల వార్షిక సమావేశంలో జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) వినయ్ దూబే తెలిపారు. జీతాలను 25 శాతం మేర తగ్గించుకోవాలని ఈమధ్య సంస్థ తన పైలట్లతో పాటు ఇతర కీలక సిబ్బందిని కోరింది. పైలట్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన సంస్థ ప్రస్తుతానికి ఈ వాయిదా వేసుకుంది. భవిష్యత్‌లో ఈ ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెస్తామని వార్షిక సమావేశంలో దూబే చెప్పకనే చెప్పారు.
విమానయాన శాఖ కార్యదర్శికి నరేశ్ గోయల్ వివరణ
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ సంస్థ చైర్మన్ నరేష్ గోయల్.. పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబేతో భేటీ అయ్యారు. ప్రస్తుతం సంస్థ పరిస్థితిని ఆయనకు వివరించారు. నిధుల కొరతతో తీవ్రంగా సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్.. ఈనెల 9న విడుదల చేయాల్సిన త్రైమాసిక ఫలితాలను సైతం వాయిదా వేసుకుంది. నిధుల సేకరణ ప్రయత్నాల్లో ఉన్న నరేష్ గోయల్.. చౌబేను కలిసిన అనంతరం లండన్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.11 వేల కోట్ల అప్పుల భారం
ఆర్థిక కష్టాల్లోంచి బయటపడేందుకు అవసరమైన నిధుల కోసం అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సంస్థపై రూ.11 వేల కోట్ల అప్పుల భారం ఉంది. కంపెనీలో పరిణామాలపై విమానయాన శాఖతో పాటు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కూడా కన్నేసి ఉంచాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) త్వరలోనే సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఆడిట్ చేయనుంది.
