దేశవ్యాప్తంగా ఉన్న 25 విద్యా సంస్థలు, ఎన్నో కంపెనీలను, దాతృత్వ సంస్థలను.. ముఖ్యంగా కుటుంబ సభ్యులను శోక సముద్రంలో ముంచి.. ఆయన వెళ్లిపోయారు. ఆయనే బసంత్ కుమార్ బిర్లా. 

పారిశ్రామిక దిగ్గజం ఘన్‌శ్యామ్‌ దాస్‌ చిన్న కుమారుడు, ఆదిత్య విక్రమ్‌ తండ్రి, కుమార మంగళం బిర్లా తాతయ్య బసంత్ కుమార్ బిర్లా(98) బుధవారం ముంబైలో తనువు చాలించారు. వయసు సంబంధిత అనారోగ్యం వల్లే మరణించిన బిర్లాకు కోల్‌కతాలోని బిర్లాపార్క్‌లోని ఆయన సొంత గృహం వద్దే అంత్యక్రియలను నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

తాత ఆరోగ్యం క్షీణించడంతో మనవడు కుమారమంగళం బిర్లా ఆయనను ముంబైకి తీసుకెళ్లారని తెలుస్తోంది. దాతృత్వానికి పెట్టింది పేరు అయిన ఘన్‌శ్యామ్‌ దాస్‌ బిర్లాకు 1921, జనవరి 12న బీకే బిర్లా జన్మించారు. చిన్నప్పటి నుంచీ వారికున్న అన్ని కంపెనీలతో గొప్ప అనుబంధాన్ని కొనసాగించారు. అందుకే కేవలం 15 ఏళ్ల వయసులోనే కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్‌ అయ్యారు. 

నాటి నుంచి ఇప్పటి దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు బీకే బిర్లా. పత్తి, పాలిస్టర్‌, నైలాన్‌, పేపరు, షిప్పింగ్‌, సిమెంటు, టీ, రసాయనాలు, ప్లైవుడ్‌.. ఇలా ఎన్నో ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇండో ఇథియోపియన్‌ టెక్స్‌టైల్స్‌ షేర్‌ కంపెనీ పేరిట ఒక అతిపెద్ద సంయుక్త సంస్థను ఏర్పాటు చేశారాయన. ఏ భారత పారిశ్రామికవేత్తా చేయలేని పనిని అప్పట్లో చేశారు. ఇందుకు ప్రతిగా ఇథియోపియో రాజు హెయిలీ సెలాసీ చేతుల మీదుగా ఆర్డర్‌ ఆఫ్‌ మెనిలిక్‌ను అందుకున్నారు. ఆ దేశంలో అదే అత్యంత ఉన్నత పౌర పురస్కారం.

1941 ఏప్రిల్‌లో బ్రిజ్‌లాల్‌ బియానీ కూతురు సరళను పెండ్లాడారు. విచిత్రం ఏమిటంటే వీరిద్దరికి పరిచయం చేసింది మహాత్మా గాంధీ, జమ్నాలాల్‌ బజాజ్‌ కావడం విశేషం. ఆ విధంగా వీరి పెళ్లికి గాంధీ కారణమయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. 

ఒకరు జయశ్రీ మెహతా కాగా మరొకరు మంజుశ్రీ ఖైతాన్‌. జయశ్రీ మెహతా ఆధ్వర్యంలో జయశ్రీ టీ, మంజుశ్రీ ఆధ్వర్యంలో కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ నడుస్తున్నాయి. ఇక ఏకైక కుమారుడు ఆదిత్య విక్రమ్‌ బిర్లా 1995 అక్టోబర్ నెలలో మరణించారు.

బి.కె. బిర్లా తన సారథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీలు, అన్ లిస్టెడ్ కంపెనీలను నెలకొల్పడం విశేషం. కుమారుడు ఆదిత్య మరణించిన అనంతరం ఎవరు వారసుడు అని చర్చలు రాకముందే ముందే వీలునామా రాశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, ఆలయాలు, పలు ఆశ్రమాలు, బంగ్లాలను తన కుటుంబ సభ్యుల పేరిట ముందుగానే రాసిచ్చారు.

బిర్లా సొంతూరు కావడం వల్లే అందరికీ సుపరిచితమైన బిట్స్‌-పిలానీని రాజస్థాన్‌లోని పిలానీలో ఏర్పాటు చేశారు. కృష్ణార్పన్‌ చారిటీ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన బి.కె. బిర్లా ఆ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోనే బిట్స్‌-పిలానీని నిర్వహించారు. ఖతర్‌లో బిర్లా పబ్లిక్‌ స్కూల్‌ను, ముంబయిలో బిర్లా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ను ఏర్పాటు చేశారు.

పలు కంపెనీలను నిర్వహించడంలో తీరికలేకుండా ఉన్నా బీకే బిర్లా పుస్తకాలను సైతం రాశారు. స్వంత్‌ సుఖయా పేరిట స్వీయచరిత్రనూ రాశారాయన. బికే బిర్లా గ్రూప్‌లో కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌తో పాటు సెంచురీ టెక్స్‌టైల్స్‌, సెంచురీ ఎంకా, జయశ్రీ టీ వంటి కంపెనీలున్నాయి.