న్యూఢిల్లీ: నేడు పార్లమెంటులో బడ్జెట్  ప్రవేశపెడుతున్న సంధర్బంగా ట్విటర్ లో ప్రముఖులు బడ్జెట్ పై వారికి ఉన్న ఆశలను ట్వీట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుసగా రెండోసారి కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టారు.

కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి  ఈ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ ముజుందార్‌ షా కొత్త  బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అయితే ఆర్థిక వ్యవస్థను కాన్యర్‌తో పోలుస్తూ వైద్య పరిభాషలో కిరణ్‌ ముజుందార్‌ షా ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

తన ట్వీట్లో ‘‘మన ఆర్థిక క్యాన్సర్‌కు కీమోథెరపీ కాదు, ఇమ్యూనోథెరపీ కావాలి. మనం గాయాల గురించి కాదు, దానికి కారణమైన వాటి గురించి ఆలోచించాలి. బడ్జెట్‌ 2020 ఇలాంటి విధానాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నా. మన ఆర్థిక నిరోధక వ్యవ్యస్థలో సంపద సృష్టి అనేది కీలకమైనది!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆర్థిక క్యాన్సర్‌పై ద్రవ్య విధానం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలు ఇమ్యూనోథెరపీలో టీ సెల్స్‌ వంటివి’’ అని కిరణ్‌ ముజుందార్‌ షా ట్విటర్‌లో పేర్కొన్నారు.