రెండేళ్లుగా అరకొర వృద్ధికి పరిమితమైన దేశీయ అతి పెద్ద ఔషధ సంస్థలు, ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ డిజిల్ వృద్ధితో దూసుకెళ్లతాయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. అమెరికాలో విక్రయాలు పెరగడం, రూపాయి మారకపు విలువ క్షీణించడం, దేశీయంగా గిరాకీ పెరగడమే దీనికి కారణాలుగా విశ్లేషిస్తోంది. 

పెద్ద ఔషధ సంస్థలకు ఇలా లాభాలు
రూ.1,000 కోట్లు, అంతకంటే పెద్దమొత్తాల్లో టర్నోవర్‌ గల ఔషధ కంపెనీలు ఇందువల్ల లాభపడతాయని క్రిసిల్ పేర్కొంది. మొత్తం ఔషధ పరిశ్రమ ఆదాయాల్లో నాలుగింట మూడొంతులు కలిగిన నమోదిత 20 సంస్థల్లో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే, ఆ దిశగా సంకేతాలు కానవచ్చాయని వివరించింది. ఈ సంస్థల సగటు ఆదాయంలో 30 శాతం అమెరికా వాటా ఉంటే, మరో 35 శాతం దేశీయ వాటా ఉంటుందని తెలిపింది.

ప్రస్తుత ఏడాది ఏడు శాతం పురోగతి
గత 8 త్రైమాసికాల్లో అయిదుసార్లు విలోమవృద్ధి నమోదైన అమెరికా విపణిలో, గత జూన్‌ త్రైమాసికంలో పునరుత్తేజం ఏర్పడిందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేథి తెలిపారు. దేశీయ సంస్థలకు అమెరికా ఆదాయం, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2017-18 జూన్‌ త్రైమాసికంలో ఏమ్రాతం పెరగకపోగా, 2018-19 ఇదేకాలంలో 7 శాతం వృద్ధి లభించిందని తెలిపారు. 

తగ్గిన నిబంధనల సవాళ్లు
నిబంధనా పరమైన సవాళ్లు తగ్గిపోయి ఔషధ ఉత్పత్తులకు వేగంగా అనుమతులు రావడం, కాంప్లెక్స్‌ ఉత్పత్తుల వాటా పెరగడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమీద దేశీయ ఔషధ సంస్థలకు అమెరికా ఆదాయంలో 6-7 శాతం వృద్ధి లభిస్తుందని అంచనా వేస్తున్నామని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి అన్నారు. దేశీయంగా గిరాకీ పెరగడం, ఆరోగ్యబీమా వంటివి మరింత ఉపకరించి, మొత్తంమీద 12-13 శాతం వృద్ధి లభిస్తుందని తెలిపారు.

కాంప్లెక్స్‌పై స్పష్టత కలిసి వస్తుందన్న ఇండియా రేటింగ్స్ 
కాంప్లెక్స్‌ జనరిక్‌ ఔషధాల విషయమై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇచ్చిన స్పష్టత వల్ల, అమెరికా విపణి కోసం కొత్త ఔషధాలకు (అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్స్‌) దరఖాస్తు చేసిన దేశీయ సంస్థలకు మేలు కలుగుతుందని ఇండియా రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. ఇప్పటివరకు కాంప్లెక్స్‌ ఔషధాల విషయమై నిబంధనావళి లేక ఇబ్బంది కలిగిందని తెలిపింది.

ఇలా పెండింగ్ దరఖాస్తులకు మోక్షం
యూఎస్ఎఫ్డీఏ ఈనెల 9న వెలువరించిన ఆదేశాల వల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సత్వర ఆమోదం లభించవచ్చని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య సమయానికి సంబంధించి, భవిష్యత్ అంచనాలను ఈ నివేదిక వెలువరించింది.

దేశీయంగా ఫార్ములేషన్లు రూపొందించే లుపిన్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌, సిప్లా, టోరెంట్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, సన్‌ ఫార్మా సంస్థలకు సమీప, మధ్య కాలానికి మేలు జరుగుతుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.