ప్రతి పండుగ సమయంలో ఆఫర్ల మోజులో వినియోగదారుల సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకుంటున్నాయి కార్పొరేట్ సంస్థలు. అందులో క్రమంగా బిగ్ బజార్ నుంచి రిలయన్స్ వరకు.. పేటీఎం నుంచి అమెజాన్ వరకు వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి. 

హైదరాబాద్: వినియోగదారుల సెంటిమెంట్ కార్పొరేట్ సంస్థలకు వర ప్రదాయిని. ప్రతి పండుగకు, వేడుకకు ఆఫర్లు ప్రకటించి వినియోగదారుల మదిని దోచి తమ వస్తువుల విక్రయ లక్ష్యాలను చేరుకునేందుకు శతధా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిటైల్‌ దిగ్గజం బిగ్‌బజార్‌ మరోమారు 'మహాబచత్‌' సేల్‌ను ప్రకటించింది. శనివారం (11వ తేది) నుంచి 15వ తేదీ వరకు ఈ 'ఐదు రోజుల మహాబచత్‌' సేల్‌ కొనసాగుతుందని సంస్థ సీఈవో సదాశివ్‌ నాయక్‌ తెలిపారు. 

2006 నుంచి బిగ్ బజార్ ‘మహాబచత్’
2006లో మొదలు ప్రతీ యేడాది బిగ్‌బజార్‌ దేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఐదు రోజుల 'మహాబచత్‌' సేల్‌ను నిర్వహిస్తూ వస్తోందని బిగ్ బజార్ సీఈఓ సదాశివ్ నాయక్ చెప్పారు. ఇదే పరంపరను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్టు నాయక్‌ తెలిపారు.

ఈ ఏడాది 'మహాబచత్‌'ను బ్రాండ్‌ఫ్యాక్టర్‌, సెంట్రల్‌, ఈజీడే, నీలగిరీస్‌, హెరిటేజ్‌ ఫ్రెష్‌, ఫుడ్‌వరల్డ్‌ స్టోర్స్‌కు కూడా అనువర్తింపజేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మహాబచత్‌లో భాగంగా పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లతో పాటు ఫూచర్‌ పే, పేటీఎం వ్యాలెట్ల ద్వారా బిగ్‌బజర్‌ స్టోర్స్‌లో కొనుగోళ్లు జరిపే వారికి మంచి ఆఫర్లను అందిస్తున్నట్టు ఆయన వివరించారు. 

రూ.3000 కొనుగోళ్లపై గరిష్టంగా రూ.1200 క్యాష్ బ్యాక్
రూ.3000 కోనుగోళ్లు జరిపిన వారికి గరిష్టంగా రూ.1200 వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నట్లు బిగ్ బజార్ సీఈఓ సదాశివ్ నాయక్ తెలిపారు. మహాబచత్‌ సేల్‌కు గతంలో లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది మరిన్ని వస్తువులను ఈ సేల్‌ కిందకు తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌బీఐ డెబిట్‌కార్డులపై రూ.3000 వరకు కొనుగోళ్లు జరిపిన వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్‌ అందజేయనున్నట్లు కూడా బిగ్‌బజార్‌ వర్గాలు తెలిపాయి.

మహాబచత్ కోసం అనుబంధ స్టోర్లనూ తీర్చిదిద్దిన బిగ్ బజార్
బిగ్ బజార్ ‘మహాబచత్‌’ సేల్‌ ఆఫర్‌ను దృష్టి ఉంచుకొని బిల్లింగ్‌ క్యూలను తగ్గించే చర్యలతో పాటు హోమ్‌ డెలివరీ వ్యవస్థను మెరుగు పరచడం, ఎం-పీవోఎస్‌ సౌలభ్యాన్ని పెంచడం వంటి చర్యలను చేపడుతున్నట్టుగా బిగ్‌బజార్‌ వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా అన్ని బిగ్‌బజార్‌ స్టోర్స్‌తో పాటు అనుబంధ స్టోర్స్‌ను మహాబచత్‌కు తీర్చిదిద్దినట్లు బిగ్‌బజార్‌ వర్గాలు వివరించాయి.

రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్
దేశీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్.. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ కొనుగోలుదారులకు గొప్ప ఆఫర్లను ప్రకటించింది. డిజిటల్ ఇండియా సేల్ పేరుతో ఈ నెల 11 (శనివారం) నుంచి 15 వరకు ఈ రాయితీ మేళాను ముందుకు తెచ్చింది.

ఇందులో భాగంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సిటీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ వంటి అన్ని ప్రధాన డెబిట్, క్రెడిట్ కార్డులపై జరిపే కొనుగోళ్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇచ్చింది. ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో అందుబాటులో ఉంటుందని రిలయన్స్ ఓ ప్రకటనలో చెప్పింది. ల్యాప్‌టాప్‌లపైనా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయని తెలిపింది.