తస్మాత్ జాగ్రత్త: భవిష్యత్ మొండి బాకీలకు ‘ముద్రా’ రుణాలు గుదిబండ
ముంబై: చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ముద్ర పథకం వల్ల బ్యాంకింగ్ ‌రంగంలో మొండి బాకీలు పెరుగుతున్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. భవిష్యత్‌లో ఆ పథకం మొండిబాకీలకు మూలంగా మారుతుందని పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికే దాదాపు రూ. 11,000 కోట్ల మేరకు మొండిబకాయిలు ఉన్నాయని తెలిపింది. 

2017-18లోనే రూ.2.46 లక్షల కోట్ల రుణాల పంపిణీ
ఒక్క 2017-18 లోనే ఈ పథకం కింద రూ. 2.46లక్షల కోట్ల మేరకు రుణాలు.. వీటిల్లో మొత్తం 40శాతం మహిళలకు పంపిణీ చేశారు. మరో 33శాతం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అందజేశారు. ఈ పథకం మొత్తం 4.81 కోట్ల మంది లబ్ధి పొందారు.

మరో ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కాగలదని ఆర్బీఐ హెచ్చరిక
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ముద్ర రుణాలపై కూడా ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. 2015లో పీఎంఎంవై పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద చిన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు బ్యాంక్‌లు రూ. 10లక్షల వరకు రుణాలు ఇవ్వాలి. మొత్తం మూడు విభాగాల్లో ఈ రుణాలను మంజూరు చేస్తారు.

బీమాపై తగ్గుతున్న ఎల్ఐసీ ఆధిపత్యం
ప్రైవేట్ బీమా సంస్థలు దూకుడుతో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్‌ విలువ పడిపోతోంది. గతేడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ వాటా 70 శాతానికి తగ్గింది. 2016-17లో 28.19 శాతంగా ఉన్న ప్రైవేట్ సంస్థల వాటా 2017-18లో 30.64 శాతానికి పెరిగింది.

ఏడాదిలోనే ప్రైవేట్ సంస్థల ముందు ఎల్ఐసీ వెనుకంజ
‘ప్రీమియం ద్వారా ఎల్‌ఐసీకి వచ్చిన మొత్తం ఆదాయం 2016-17లో మార్కెట్‌ వాటాలో 71.81 శాతం. ఇప్పుడది 69.36 శాతానికి తగ్గింది’ అని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) తెలిపింది. ఇక రెన్యువల్‌ ప్రీమియం ఆదాయం 72.31 శాతం నుంచి 69.35 శాతానికి తగ్గింది. ప్రైవేటు సంస్థల ఆదాయం 27.69 శాతం నుంచి 30.65 శాతానికి పెరిగింది.

గతేడాది ఎల్ఐసీ పాలసీల ప్రగతి 5.99% 
జీవిత బీమా సంస్థలు 2017-18లో 2.81 కోట్ల కొత్త పాలసీలు జారీ చేస్తే అందులో ఎల్‌ఐసీ 2.13 కోట్లు (75.7 శాతం) ఇచ్చింది. ప్రైవేట్ సంస్థలు 68.59 లక్షల (24.3 శాతం) కొత్త పాలసీలు జారీ చేశాయి. గతేడాది కొత్త పాలసీల జారీలో ప్రైవేటు సంస్థల వృద్ధి 8.47% ఉండగా ఎల్‌ఐసీ 5.99% వృద్ధి నమోదు చేసింది. 2018, మార్చి నాటికి దేశంలో 68 బీమా సంస్థలు ఉండగా అందులో 24 జీవిత బీమా సంస్థలు, 27 సాధారణ బీమా సంస్థలు, 6 ఆరోగ్య బీమా సంస్థలు, 11 రీ ఇన్సూర్ సంస్థలు ఉన్నాయి.