ముంబై: మౌలిక వసతుల(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ప్రాజెక్టులు, ప్రత్యేకించి విద్యుత్‌ రంగ బలోపేతాననికి బ్యాంకులు రుణాలివ్వొద్దని ప్రభుత్వరంగ అగ్రగామి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అభిప్రాయపడింది. గత దశాబ్దకాలంలో ఈ రంగానికి మంజూరు చేసిన రుణాల్లో అధిక భాగం మొండి బకాయిలుగా (ఎన్‌పీఏలు) మారడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో విద్యుత్‌ రంగానికి సంబంధించి రూ.1.7 లక్షల కోట్ల మొండి బాకీల విషయమై దివాలా చర్యల కోసం బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మౌలిక వసతులకు రుణాలు నిలిపేయాల్సి రావచ్చు
బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రుణాలను నిలిపివేయాల్సి రావచ్చని ఎస్బీఐ ఎండీ దినేష్‌కుమార్‌ ఖరా మీడియాతో అన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇన్‌ఫ్రా రంగానికి నిధుల సాయం అవసరాల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, బ్యాంకులకు ఇప్పుడు ఈ రంగం ‘అంటరానిదా’ అన్న ప్రశ్నకు... కేవలం విద్యుత్‌ రంగానికే అది వర్తిస్తుందన్నారు. రోడ్డు ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు సుముఖంగానే ఉన్నామన్నారు. రిస్క్‌ నివారణను సరైన చర్యలు తీసుకుంటే అన్ని రంగాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమేనని తేల్చి చెప్పారు.

విద్యుత్ రంగంలో సరఫరా, కొనుగోలు ఒప్పందాలపై సమస్యలు
విద్యుత్‌ రంగంలో ఇంధన సరఫరా ఒప్పందాలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పరంగా సమస్యలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎస్బీఐ ఎండీ పీకే గుప్తా మాట్లాడుతూ ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ మొండి బాకీలను సత్వరం గుర్తించాలని జారీ చేసిన ఉత్తర్వులతో బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్సీఎల్టీకి విద్యుత్‌ ప్రాజెక్టుల మొండి బాకీలను నివేదించితే సహజంగానే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దుకు దారితీస్తుందని, అది బ్యాంకులను బలహీనపరుస్తుందని చెప్పారు. బ్యాంకులకు మరింత సమయం ఇస్తే ఎన్‌సీఎల్‌టీకి వెళ్లకుండా పరిష్కార ప్రణాళిక కనుగొనేందుకు అవకాశం ఉంటుందన్నారు.  

కీలక స్థానాల అధికారులను మూడేళ్లకోసారి మార్చాలని సీవీసీ ఆదేశాలు
కీలక పదవు (పోస్టు)ల్లో ఉన్న ఉద్యోగులను మారుస్తూ ఉండాలని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఆదేశించింది. ఇందువల్ల మోసాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపింది. ఈ విషయమై మే నెలలో ఇచ్చిన ఆదేశాలను సీవీసీ ప్రస్తావించింది. ‘కీలక పదవుల్లో ఉన్న వారిని మూడేళ్లకు బదిలీ చేయాలన్న నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాలి’ అని ఆదేశించింది. కీలక పోస్టుల్లోంచి బదిలీ చేయాలని సూచించామే కానీ, ఆ ప్రాంతం నుంచి కాదని, ఇది ఆయా సంస్థల విధాన నిర్ణయాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. 

పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో సీవీసీ ఆదేశాలకు ప్రాధాన్యం
బ్యాంకుల్లో ఇటీవల భారీమొత్తం మోసపూరిత లావాదేవీలు వెలుగుచూసిన నేపథ్యంలో, సీవీసీ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13 వేల కోట్ల మోసపూరిత లావాదేవీలు నిర్వహించిన గీతాంజలి జువెలర్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుగుతున్న సంగతి విదితమే. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర సంస్థల్లో చోటుచేసుకున్న మోసాలకు ‘కీలక పదవుల్లోని వారిని ఎక్కువకాలం కొనసాగించడమూ ఒక కారణం’ అని సీవీసీ పేర్కొంది. అందువల్ల కీలక పదవుల్లోని వారిని మూడేళ్లకు బదిలీ చేయాలన్న ఆదేశాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని చీఫ్‌ విజిలెన్స్‌ అధికారులకు తెలిపింది. దీనిపై నివేదిక అందించాలని వివరించింది.