న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ తేల్చి చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ కంపెనీలను (పీఎస్‌యూ)ను ప్రైవేటీకరించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.

ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. వ్యూహాత్మక రంగాల్లో గరిష్ఠంగా నాలుగు పీఎస్‌యూలనే కొనసాగిస్తామని, మిగతా వాటిని ప్రైవేటీకరించనున్నట్లు గతనెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

వ్యూహాత్మకయేతర రంగాల్లో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించనున్నారు. బ్యాంకింగ్‌ను కూడా వ్యూహాత్మక రంగాల్లో భాగం చేయనున్నట్లు సుబ్రమణియన్‌ తాజాగా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యూహాత్మక రంగాలు, వ్యూహాత్మకేతర రంగాలను గుర్తించే పనిలో ఉందన్నారు.

పీఎస్బీల్లోనూ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమవుతోందని కొన్ని రోజులుగా మార్కెట్లో ఊహాగానాలు నెలకొన్నాయి. విలీన ప్రతిపాదన లేని బ్యాంక్‌లను ఇందుకు ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. దీని ప్రకారం ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం), పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (పీఅండ్‌ ఎస్బీ)తో పాటు మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం ఉంది. 

also read ఏటీఎంలలో తగ్గిన క్యాష్‌ విత్‌డ్రాలు..కానీ ఆన్ లైన్ పేమెంట్లు రెట్టింపు..

భారత్‌పై రేటింగ్‌ ఏజెన్సీల వైఖరిని తెలిపేందుకు సీఈఏ సుబ్రమణియన్‌  వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. పటిష్ఠ ఆర్థిక మూలాలు ఉన్న భారత్‌ మరింత మెరుగైన రేటింగ్‌కు అర్హమని ఆయన అన్నారు. భారత పరపతి రేటింగ్‌ను  మూడీస్‌ మరింత దిగువ స్థాయికి తగ్గించింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌(ఎస్‌ అండ్‌ పీ) యథాతథంగా కొనసాగించింది.

ఈ నేపథ్యంలో  రేటింగ్‌ పెంపుపై సీఈఏ కేవీ సుబ్రమణ్యం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రుణాల తిరిగి చెల్లింపుల సామర్థ్యంలో భారత్‌ది గోల్డ్‌ స్టాండర్డ్‌ అని,  దీన్ని దృష్టిలో పెట్టుకుని  మన రేటింగ్‌ను మెరుగుపర్చాలన్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను రేటింగ్‌ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకున్నాయని, వచ్చే ఏడాదిలో అధిక వృద్ధి సాధించేందుకు ఈ సంస్కరణలు కీలకమన్నారు. 

క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల మేనేజింగ్‌ డైరెక్టర్లు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమావేశం అయ్యారు. భారత స్థూల ఆర్థికాంశాల పరిస్థితి, ఆయా రంగాల్లో స్థితిగతులపైౖ రేటింగ్‌ ఏజెన్సీల అధిపతుల వైఖరిని తెలుసుకునేందుకు ఈ భేటీ జరిగింది.

వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు, సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. రేటెడ్‌ కంపెనీల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, కరోనా సంక్షోభం నేపథ్యంలో కంపెనీల రేటింగ్‌ను ప్రభావితం చేస్తున్న అంశాలపైనా చర్చ జరిగింది. రేటింగ్‌ ప్రక్రియను మరింత పటిష్ఠపర్చే విషయమై ఆర్‌బీఐ ఈ ఏజెన్సీల అభిప్రాయాల్ని సైతం కోరారు.