ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళల్లో అక్టోబర్ 1 నుంచి మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళల్లో ఒకటి ఎంపిక చేసుకొని అమలు చేస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ నెల 3నుంచి 7 దాకా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి( ఎస్ఎల్బీసీ) కన్వీనర్ కేవీ నాంచారయ్య తెలిపారు.

భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు. 1.ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలు,2. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటలు, 3. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటలు. ఈ మూడు రకాల పనివేళ్లల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి సంప్రదింపుల సమితిలో చర్చించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు. వారి ఆమోదంతో  ఈ పనివేళలు అమలు చేస్తారు.

పక్కాగా పత్రాలు ఉంటే అక్కడికక్కడే రుణాలు ఇస్తామని బ్యాంకులు ప్రకటించాయి.  జిల్లాల వారీగా ఏర్పాటు చేసే సదస్సులో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. వ్యక్తిగత, వాహన, విద్య, గృహ, చిన్న పరిశ్రమలు, పంటలు తదితర రుణ అవసరాలు తెలుసుకుంటాయి. ఖాతాదారులు తమ ఆదాయపన్ను దాఖలు పత్రాలు, గుర్తింపు ధ్రువీకరణలు, కేవైసీ పత్రాలు చూపించాలి. అన్నీ సక్రమంగా ఉంటే పరిమితుల మేరకు అక్కడికక్కడే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.