బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వివిధ బ్యాంకులకు చెందిన పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె చేయడంతో సేవలపై తీవ్ర ప్రభావం కనిపించింది. బ్యాంకుల విలీనంపై ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బంది సమ్మె చేశారు. దీనికి కొన్ని పాత తరం ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు సైతం మద్దతు ఇచ్చాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది చేపట్టిన సమ్మె విజయవంతమైంది.

తొమ్మిది యూనియన్ల ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది నిరసన
అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), ఎన్‌సీబీఈ, ఎన్‌ఓబీడబ్ల్యూ సహా తొమ్మిది యూనియన్‌ల సంయుక్త సంఘమైన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. వారం రోజుల్లో ఇది రెండో బ్యాంక్‌ సమ్మె కావడం గమనార్హం. నగదు డిపాజిట్లు, ఉపసంహరణ, చెక్‌ క్లియరెన్స్‌, డీడీల జారీ సహా అన్ని బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయాయి. 

తెలుగు రాష్ట్రాల్లో స్తంభించిన బ్యాంకు లావాదేవీలు
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు చేపట్టిన ఒక్కరోజు సమ్మెతో దాదాపు రూ.20 వేల కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి.  శుక్రవారం నుంచి బుధవారం వరకు బ్యాంకులు పనిచేయక ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. సమ్మెలో భాగంగా బుధవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 5 వేలకు పైగా బ్యాంకు శాఖలు మూతపడ్డాయి. దాదాపు 85 వేల మంది ఉద్యోగులు బ్యాంకుల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 

హైదరాబాద్ లో ఆందోళనలు ఇలా
హైదరాబాద్‌లోని కోఠి ఎస్‌బీఐ ముందు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ తెలుగు రాష్ట్రాల కన్వీనర్‌ వీవీఎస్‌ఆర్‌ శర్మ, అధ్యక్షుడు రాధాకృష్ణన్‌, నరేంద్ర, శ్రీరామ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళన చేపట్టారు. బ్యాంకుల విలీన ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ బ్యాంకు ముందు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి రాంబాబు, తెలుగు రాష్ట్రాల కార్యదర్శి కుమార్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. జాతీయ బ్యాంకుల విలీన యోచనను తక్షణమే విరమించాలని, మొండి బకాయిదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) తెలుగు రాష్ట్రాల కార్యదర్శి వీవీఎస్‌ఆర్‌ శర్మ డిమాండ్‌ చేశారు. 

కార్పొరేట్ల నుంచి మొండి బాకీలు వసూలు చేయాలి
రుణాలను ఎగ్గొట్టిన కార్పొరేట్ల నుంచి బకాయిలను వసూలు చేయాలని, బ్యాంకుల విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. విజయవాడ గవర్నర్‌పేటలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎదుట బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణకే కేంద్ర ప్రభుత్వ విలీన ప్రతిపాదన తెచ్చిందన్నారు. బ్యాంకులను విలీనం చేస్తే ఖాతాదారులు ఇబ్బందులు పడతారన్నారు. తక్షణం విలీన ప్రక్రియను నిలిపివేసి, బ్యాంకుల స్వతంత్రతను కాపాడాలని డిమాండ్‌ చేశారు. 

సమ్మెతో మూతబడ్డ ఏటీఎంలు
సమ్మెతో ఏటీఎంలూ మూతపడ్డాయి. సగానికి పైగా ఏటీఎంలు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఉన్నాయి. వరుస సెలవులతో బ్యాంకు చెస్ట్‌లు పనిచేయలేదు. దీంతో పలు ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు నిండుకుంది. ప్రతి రోజూ దేశవ్యాప్తంగా దాదాపు 85 లక్షల వరకు చెక్కు చెల్లింపులు జరుగుతుంటాయి. ఇందులో 6 లక్షల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన గత రెండు మూడు రోజులుగా 18 లక్షల వరకు చెల్లింపులపై ప్రభావం పడింది.

నేటి నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు
క్రిస్మస్‌ సందర్భంగా మంగళవారం, సమ్మె సందర్భంగా బుధవారం రెండు రోజుల పాటు బ్యాంకులు పనిచేయలేదు. గురువారం నుంచి యథావిధిగా పనిచేస్తాయి. బ్యాంకు చెస్ట్‌ల నుంచి నగదు ఏటీఎంలకు అందుబాటులోకి వస్తుంది.

ఆశ చావలె: ఆర్బీఐ నిధులపై బిమల్ జలాన్ కమిటీ
ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) వద్ద  మిగులు నిధులు ఎంతమేర ఉంచాలనే అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. దీనికి ఆర్బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ఆర్బీఐ బుధవారం ప్రకటించింది. ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి రాకేశ్‌ మోహన్‌ ఈ కమిటీ వైస్‌ ఛైర్మన్‌గా ఉంటారు. ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్‌చంద్ర గార్గ్‌, ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డు సభ్యులైన భరత్‌దోషి, సుధీర్‌ మన్‌కడ్‌, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాధన్‌ కూడా ఉన్నారు. 


90 రోజుల్లో ఆర్బీఐకి కమిటీ నివేదిక
ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైన రోజు నుంచి 90 రోజుల వ్యవధిలో తన నివేదికను సమర్పిస్తుందని ఆర్బీఐ తెలిపింది. అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్రబ్యాంకులు ఎంతమేర మిగులు నిధులు, అదనపు నిల్వలు (బఫర్‌ క్యాపిటల్‌) కలిగి ఉంటున్నాయో అధ్యయనం చేయాలని కమిటీని కోరినట్లు ఆర్బీఐ వివరించింది. 

ఆర్బీఐ మిగులు నిధులపైనే విభేదాలు
ఆర్బీఐ వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల మిగులు నిధుల విషయమై గత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, ప్రభుత్వం మధ్య వివాదం ఏర్పడిన సంగతి విదితమే. స్థూల నిధుల్లో సగటున 14% వరకు అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకుల వద్ద ఉండగా, ఆర్బీఐ వద్ద 28 శాతం ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. నవంబర్ నెల 19వ తేదీన సమావేశమైన ఆర్బీఐ బోర్డ్‌, దీనిపై ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయించింది. అయితే కమిటీలో మోహన్‌ పాత్రపై ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఇప్పటివరకు ఆలస్యమైంది. 

బిమల్ జలాన్ కమిటీ పరిశీలించే అంశాలివి..
బిమల్ జలాన్ కమిటీ భిన్న దేశాల కేంద్ర బ్యాంకులు ప్రొవిజన్లు, నిల్వలు, అదనపు నిల్వల విషయంలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను  పరిశీలించనుంది. ఆర్బీఐ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, సహేతుకంగా లాభాలను పంపిణీ చేసే విధానాన్నీ ప్రతిపాదించనుంది. ఆర్బీఐ వద్ద ఎంతమేర నిల్వలు ఉండాలనే విషయమై 199లో వీ సుబ్రమణ్యమ్‌, 2004లో ఉషాథోరట్‌, 2013లో వైహెచ్‌ మాలేగామ్‌ కమిటీలు అధ్యయనం చేశాయి.