న్యూఢిల్లీ: విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. విప్రోలో తన 34 శాతం షేర్లను అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. ఆయన నియంత్రణలో ఉన్న పలు సంస్థల వద్ద ఉన్న షేర్లు ఇవి. 

విప్రో సంస్థలో అజీమ్ ప్రేమ్ జీ నియంత్రణలో ఉన్న ఈ షేర్ల విలువ దాదాపు రూ.52,750 కోట్లు వరకు ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించే అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు ఆయనే ఛైర్మన్‌గా ఉన్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు. పెంచిన నిధులతో అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ కు అజీం ప్రేమ్ జీ కేటాయించిన విరాళాల మొత్తం 21 బిలియన్ల డాలర్లు. 

అజీం ప్రేమ్ జీ ప్రకటించిన తాజా విరాళంతో ప్రపంచంలోకెల్లా అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్‌ను అతిపెద్ద రెండో సంస్థగా నిలిపింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 40 బిలియన్ల డాలర్లు, ఫోర్డ్ ఫౌండేషన్ కేవలం 12 బిలియన్ల డాలర్లు దాత్రుత్వానికి ఖర్చుచేస్తోంది. 

అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ కార్యకలాపాల కోసం ఉపయోగించే దాతృత్వ నిధికి ప్రేమ్‌జీ గతంలో కూడా షేర్లు, ఆస్తుల రూపంలో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా కేటాయించిన రూ.52,750 కోట్లతో కలిపితే ఆ విలువ రూ.1.45 లక్షల కోట్లకు చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలపై ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. ఈ షేర్లు, ఆస్తులపై వచ్చే ఆర్థిక ప్రయోజనాలతో ఫౌండేషన్‌ దాతృత్వ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రధానంగా దేశంలో విద్యారంగంపై పని చేస్తోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కర్ణాటక, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఫౌండేషన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే కొన్నేళ్లలో ఫౌండేషన్‌ కార్యకలాపాల్ని విస్తరించడంతోపాటు ఈశాన్య ప్రాంతంలోనూ ఓ విశ్వవిద్యాలయం నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఇనిస్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్టు ఫౌండేషన్‌ తెలిపింది. సమానత, మానవతతో కూడిన స్థిరమైన సమాజం కోసం అన్నది ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ లక్ష్యం. 150 సంస్థలకు అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ సాయమందిస్తోంది. పౌష్టికాహార లోపం, గ్రుహ హింసకు గురైన మహిళలు, మనుష్యుల అక్రమ రవాణా అంశాలకు వ్యతిరేకంగా ఫౌండేషన్ పని చేస్తోంది. 

దేశీయ ఐటీ రంగంలో మూడో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న విప్రో లిమిటెడ్‌లో గతేడాది డిసెంబర్ నాటికి అజీమ్ ప్రేమ్‌జీకి 74.3 శాతం వాటా ఉన్నది. ఇందులో ప్రేమ్ జీ తనయులు రిషాద్ ప్రేమ్ జీ, తారిక్ ప్రేమ్ జీలకు కూడా వాటా ఉంది. అయితే వారికి ఆర్థిక ప్రయోజనాల కోసం గరిష్ఠంగా ఏడు శాతం వరకు వాడుకోవచ్చు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఐటీతోపాటు పలు ఇతర వ్యాపార రంగాల్లోనూ ఉన్నది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ.. విప్రో చైర్మన్‌గాను ఉన్న సంగతి విదితమే. ఉత్తర భారతంలోనే తమ సంస్థలను విస్తరిస్తామని అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రకటించింది.