విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది నెలలుగా పెరుగుతూ వచ్చిన జెట్ ఫ్యూయల్ ధర ఆల్‌టైం హైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా జెట్ ఫ్యూయల్ ధరలను మరో 18 శాతం పెంచాయి చమురు విక్రయ సంస్థలు. 

చమురు మార్కెటింగ్ కంపెనీలు విమానాల్లో వాడే ఇంధన ధరలను భారీగా పెంచాయి. బుధవారం పెంచిన రేట్లతో దేశీయంగా ఏవియేషన్ టర్బైన్​ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధర కిలో లీటర్​కు (1000 లీటర్లు) జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.లక్ష దాటింది. దేశంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఏటీఎఫ్ ధరలు సవరించే విధానం అమలులో ఉంది. దీనితో తాజాగా ధరలను సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా.. ఏటీఎఫ్​ ధరలను ఈ స్థాయిలో పెంచాయి.

తాజాగా ఎంత పెరిగాయి..?

ఏటీఎఫ్ ధరలను 18.3 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్​ ధర రూ.1,10,666.29 వద్దకు చేరింది. ఇక కోల్​కతా, ముంబయి, చెన్నైలలో ఏటీఎఫ్​ ధరలు కిలో లీటర్​కు వరుసగా రూ.1.14 లక్షలు, రూ.1.09 లక్షలు, రూ.1.14 లక్షలుగా ఉంది.

ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలు..!

రష్యా- ఉక్రెయిన్ మధ్య 20 రోజులకుపైగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనితో బ్యారెల్ ముడి చమురు ధర ఇటీవల 140 డాలర్లు దాటింది. దీనితో దేశీయంగా ఏటీఎఫ్ ధరలను పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. గతంలో 2008 ఆగస్టులో బ్యారెల్ ముడి చమురు ధర 147 డాలర్లకు పెరిగినప్పుడు.. దేశీయంగా ఏటీఎఫ్ ధర కిలో లీటర్​కు రూ.71,028 వద్దకు చేరింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్థాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర బ్యారెల్​కు 100 డాలర్లుగా ఉండగా.. ఏటీఎఫ్​ ధర మాత్రం కిలో లీటర్​కు రూ.లక్ష దాటడం గమనార్హం.

ఏటీఎఫ్ ధర పెరిగితే ఏమవుతుంది..?

ఏటీఎఫ్ ధర పెరిగితే.. విమానయాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. అంతర్జాతీయ విమానాలను పూర్తి స్థాయిలో నడిపించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతినిచ్చిన నేపథ్యంలో.. విమానయాన టికెట్ ధరలు తగ్గే అవకాశముందని వార్తలు వచ్చాయి. అయితే ఏటీఎఫ్ ధరలు జీవనకాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏటీఎఫ్ ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు మరోసారి ఛార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు డాలర్ మారకంతో రూపాయి బలహీనపడగా, మరోవైపు ఇంధన ఛార్జీలు భారీగా పెరిగాయని, దీంతో టిక్కెట్ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఏటీఎఫ్ ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో జెట్ ఫ్యూయల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా కోరుతున్నారు. డొమెస్టిక్ పాసింజర్ మార్కెట్‌లో ఇండిగో వాటా 55 శాతం వరకు ఉంది.