తింటే గారెలే తినాలి.. వింటే మహాభారతమే వినాలి.. అన్నది పెద్దల సూక్తి. కానీ ఆధునిక భారతావనిలో చూస్తే అంబానీల ఇంట పెళ్లినే చూడాలి.. ఈ వ్యాఖ్యలో కాసింత అతిశయం కనిపించినా.. ముకేశ్ అంబానీ- నీతా అంబానీల తనయుడు ఆకాశ్ అంబానీ వివాహానికి వచ్చిన అతిథులు.. 

అసలు వివాహ వేడుక సొగసును వర్ణించడం అంత తేలిక్కాదు సుమా  ..అటువంటిది జాతీయ, అంతర్జాతీయ, సినీ, రాజకీయ, పారిశ్రామిక అతిరథ మహారధులు హాజరయ్యారంటే ఆ దర్జా.. ఆ దర్పం.. ఆ వైభోగం.. ఆ విలాసం.. అసలు మాటల్లో చెప్పతరమా !!

మూడు నెలల క్రితమే అభినవ కుబేరుడు ముకేశ్‌ ముద్దుల తనయ ఈశా వివాహం  కళ్లముందు కదలాడుతుండగానే  దేశ, విదేశీ ప్రముఖుల సందడి మధ్య అంబానీ దంపతులు తమ తనయుడు ఆకాశ్‌ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.

తన చిన్ననాటి స్నేహితురాలు, రోజీ బ్లూ డైమండ్స్‌ సీఈఓ రసెల్‌ మెహతా తనయ శ్లోకా మెహతాను జీవిత భాగస్వామిగా స్వీకరించాడు ఆకాశ్‌.  శనివారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో వీరి వివాహం జరిగింది. సాయంత్రం మొదలైన వివాహ వేడుక అర్థరాత్రి వరకు అట్టహాసంగా సాగింది.

తొలుత తన తల్లిదండ్రులు ముకేశ్‌, నీతా, సోదరి ఈశా అంబానీ, బావ ఆనంద్‌ పిరమాల్‌, తమ్ముడు అనంత్‌తో కలిసి తాత ధీరూబాయ్‌ అంబానీ చిత్రపటానికి ఆకాశ్‌ నివాళులు అర్పించారు. ఆ తర్వాత నాయనమ్మ కోకిలా బెన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి.

మరోపక్క బాబాయ్‌ అనిల్‌ అంబానీ, పిన్ని టీనా అంబానీ, వీరి తనయులు జై అన్షూల్‌, జై అనుమోల్‌ దగ్గరుండి పెళ్లి పనులను పర్యవేక్షిస్తూనే మరోవైపు అతిథులకు దగ్గరుండి స్వాగతం పలికారు.

ఎప్పుడూ సూటూబూటుల్లో కనిపించే ఆకాశ్‌ అంబానీ సంప్రదాయ దుస్తుల్లో వరునిగా ముస్తాబై మెరిసిపోయారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వివాహ వేదిక ప్రాంగణానికి బయలుదేరారు. 

బారాత్‌లో గుర్రంపై ఊరేగుతూ నృత్యాలు, బ్యాండు బాజాల హోరు మధ్య జియో వరల్డ్‌ సెంటర్‌లోని వివాహ వేదికకు చేరుకున్నారు. ఓ గంటన్నర పాటు వేదికంతా ఆటపాటలు, నృత్యాలు, సందళ్లతో హోరెత్తింది. అనంతరం వివాహ కార్యక్రమం మొదలైంది. మంత్రాలు, ఆశీర్వచనాల నడుమ సంప్రదాయ రీతిలో శ్లోకాను ఆకాశ్‌ పరిణయమాడారు.

అతిథుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రసిద్ధ వంటకాలను ఏర్పాటు చేసి ఆతిథ్యంలోనూ తమకు తామే సాటి అని చాటారు అంబానీలు. ఆది, సోమవారం కూడా వివాహ అనంతర విందు వేడుకలను సైతం ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, చెర్రీ బ్లెయిర్‌, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌ అధినేత లక్ష్మీ మిట్టల్‌ దంపతులు, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ దంపతులు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, శ్యామ్ సంగ్ వైస్ చైర్మన్ జయ్ వై లీ తదితరులు హాజరయ్యారు.  

టాటా సన్స్‌ గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా,  టాటాగ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్ దంపతులు‌, సినీ ప్రముఖులు రజనీకాంత్‌, అమితాబ్ బచ్చన్ దంపతులు, జాన్వీ కపూర్, విద్యాబాలన్ దంపతులు, అభిషేక్‌ బచ్చన్-ఐశ్వర్య బచ్చన్‌, అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, ప్రియాంకా చోప్రా, క్రీడా రంగ ప్రముఖులు సచిన్‌ తెండూల్కర్ దంపతులు‌, హార్దిక్‌ పాండ్యా, కృణాల్‌ పాండ్యా, జహీర్‌ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌ దంపతులు తదితరులు హాజరయ్యారు.

ఇంకా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు క్రిస్టోఫె దీకెప్పర్, సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ఖాలీద్ అల్ ఫాలిహ్, సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎండీ యాసిర్ ఓత్మాన్ అల్ రుమయ్యాన్ హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.

కోకాకోలా సీఈఓ జేమ్స్ క్విన్ సే, మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ కాంటర్ దంపతులు మోర్గాన్ స్టాన్లీ మిచెల్ గ్రిమ్స్ దంపతులు, డౌ కెమికల్స్ చైర్మన్ ఆండ్రూ లీవెరిస్ దంపతులు, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరైల్ లించ్ చైర్మన్ పూర్ణ సంగుర్తి, నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హాస్టింగ్స్, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేలా జయవర్దనే తదితరులు హాజరయ్యారు. 

వివాహ వేదిక వద్ద లార్డ్ క్రుష్ణ, ఒక గుర్రం, నెమలి, ఏనుగులతో భారీగా సెట్టింగ్‌లతో అలంకరించారు. సంప్రదాయ పద్దతుల్లో అతిథులకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆకాశ్ అంబానీ సోదరి ఈశా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమాల్, పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్, ఆయన భార్య స్వాతి కూడా వేడుకలో అందరినీ అలరించారు. 

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సురేశ్ ప్రభు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద శర్మ కూడా హాజరయ్యారు. ఆదివారం కూడా వివాహానంతర ఉత్పవాలు కొనసాగుతాయి. సోమవారం వివాహ విందు ఏర్పాటు చేశారు.